05.11.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత ఇరవై రోజులుగా ప్రచురించడానికి అస్సలు వీలు కుదరలేదు. ఈ రోజు శ్రీ సాయి పదానంద రాధాకృష్ణ స్వామీజీ గారి గురించి ప్రచురిస్తున్నాను. ఆయన గురించిన సంపూర్ణ సమాచారం శ్రీ బొండాడ జనార్ధనరావుగారి బ్లాగునుండి, మరియు సాయిఅమృతాధార నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీ రాధాకృష్ణ స్వామీజీ – 2 వ.భాగమ్
(సాయిపదానంద)
1942 వ.సంవత్సరంలో అనుకోకుండా ఆయన శ్రీ బి.వి. నరసింహస్వామిగారిని కలుసుకోవడం తటస్థించింది. అక్కడితో ఆయన తన గురువుకోసం జరుపుతున్న అన్వేషణ పూర్తయింది. బాబాకు
అంకిత భక్తునిగా మారి శ్రీ నరసింహస్వామిగారికి ఆధ్యాత్మిక వారసుడయ్యారు.
రాధాకృష్ణన్ గారు మద్రాసులో ఉన్నపుడు ఆల్ ఇండియా సాయి సమాజ్ కి సంబంధించిన లెక్కలన్నిటినీ తనిఖీ చేస్తూ ఉండేవారు. శ్రీనరసింహస్వామి గారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించేవారు. ఆయన ఎప్పుడూ తనకు తాను గొప్పవాడినని ఎవ్వరిముందూ గొప్పలు ప్రదర్శించుకోలేదు. అందరిముందు తానెంతో చిన్నవాడిననే భావంతోనే ప్రవర్తించేవారు. సమాజంలో ప్రచారాలను యిష్టపడేవారు కాదు. ఆడంబరాన్ని ఎప్పుడూ ప్రదర్శించలేదు. తన గురించి ఎవ్వరూ గొప్పగా చెప్పడం కూడా ఆయనకి యిష్టం ఉండేది కాదు. ఫొటోలకు ఫోజులు కూడా యిచ్చేవారు కాదు. ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రదేశాలకు వెళ్ళి అక్కడ సాయిబాబా తత్వ ప్రచారం చేసారు. శ్రీనరసింహస్వామీజీయే తన గురువుగా ఆయనకు సర్వశ్య శరణాగతి చేసారు. నరసింహస్వామిగారు ఏది చెప్పినా అదే వేదం ఆయనకు. ఆల్ ఇండియా సాయి సమాజ్ కు రాధాకృష్ణన్ గారిని ఉపాధ్యక్షునిగా నియమించారు.
1952 వ.సంవత్సరంలో నరసింహస్వామీజీ గారు కర్నాటక రాష్టంలో సాయి తత్వాన్ని ప్రచారం చేయడానికి రాధాకృష్ణన్ గారిని బెంగళూరుకు పంపించారు. 1952 లో రాధాకృష్ణన్ గారు బెంగళురుకు వచ్చారు. అక్కడ కంటోన్ మెంటు ప్రాంతంలో సాయిభక్తులు ఉండటం వల్ల మొదటగా అక్కడే ఒక చిన్న కార్యాలయాన్ని నెలకొల్పారు. ఆ తరువాత ఆయన ఎన్.ఆర్. కాలనీ ప్రాంతంలోని బస్ స్టాప్ దగ్గర ఉన్న ఒక యింటి పైఅంతస్థులో ఒక గది తీసుకుని అందులో నివాసం ఏర్పరచుకొన్నారు. కాలక్రమేణా ఈ గదే సాయి స్పిరిట్యువల్ సెంటర్ గా మార్పు చెందింది. స్పిరిట్యువల్ సెంటర్ కి శాశ్వతంగా ఒక భవనాన్ని నిర్మించేటంత వరకు రాధాకృష్ణన్ గారు 7 సంవత్సరాలపాటు ఈ గదిలోనే నివసించారు.
ఆయన తరచుగా బెంగళూరు వెళ్ళినపుడెల్లా తన గురువుగారిని కలుసుకుంటూ ఉండేవారు. 1953 వ.సంవత్సరంలో నరసింహస్వామీజీ గారు ఆయనకు ‘సాయి పదానంద’ అనే బిరుదునిచ్చారు. రాధాకృష్ణన్ గారు రాధాకృష్ణస్వామీజీ అయ్యారు. రాధాకృష్ణన్ గారికి బాబాయందు ఉన్న ధృఢమయిన భక్తికి, గురువుపైనున్న విధేయతకు ఆవిధంగా ఆయనకి తన గురువుగారినుంచి గుర్తింపు లభించింది. 1954 వ.సంవత్సరంలో సౌత్ ఎండ్ రోడ్ బసవన్ గుడిలో ఉన్న సాయి భజన్ గ్రూప్ వారి శ్రీరామనవమి ఉత్సవాలకు రాధాకృష్ణ స్వామీజీ ప్రారంభోత్సవం చేసారు. సాయి ఆధ్యాత్మిక కేంద్రం యిచ్చటినుండె మొదలవుతుంది. ఇక ఆయన భోజనం విషయానికి వస్తె భక్తులు ఆయనకు ఆహారపదార్ధాలను సమర్పిస్తూ ఉండేవారు. ఆయన చాలా రోజులపాటు భోజనం లేకుండా ఉండేవారు. సాయిబాబా
తత్వ ప్రచారనిమిత్తం ఆయన ప్రతి శనివారం తుమ్ కూరుకు వెడుతూ ఉండేవారు.
మైసూర్ ప్రభుత్వంలో అసిస్టెంట్ కంట్రోలర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన శ్రీ దొమ్లూర్ కృష్ణమూర్తిగారు బాబా ప్రేరణతో, సాయిబాబావారి తత్వ ప్రచారం నిమిత్తం ఒక భవన నిర్మాణానికి బెంగళూరులోని త్యాగరాజ నగర్ లో వేయి గజాల స్థలాన్ని దానం చేశారు. 1961 వ.సంవత్సరంలో ట్రస్టులో ఒకరయిన శ్రీ వి.ఎస్.శాస్త్రిగారు సాయి ఆధ్యాత్మిక కేంద్రానికి స్థలాన్ని కానుకగా సమర్పించారు. బాబా అనుగ్రహంతో గుజరాతీ వ్యాపారస్థుడయిన శ్రీ భాయి పటేల్, రాధాకృష్ణస్వామీజీ
గారిని కలుసుకుని భవన నిర్మాణానికి కావలసిన ఆర్ధిక సహాయాన్ని ఆయనకు అందించారు.
రాధాకృష్ణస్వామీజీ గారి నేతృత్వంలో నిర్వహింపబడుతున్న
సాయి ఆధ్యాత్మిక కేంద్రం యొక్క కార్యకలాపాలకు ఆకర్షితుడయిన శ్రీ శాస్త్రిగారు కూడా విరాళాలను ప్రోగుచేసారు. అపుడు రాధాకృష్ణస్వామీజీ
గారు రెండుగదులతో ఒక ప్రార్ధనామందిరం నిర్మాణానికి శంకుస్థాపన పనులను వేగవంతం చేసారు. ఎటువంటి ప్రయత్నం చేయకుండానే దేశం నలుమూలలనుంచి ఎంతోమంది భక్తులు భవన నిర్మాణం కోసం స్వఛ్చందంగా విరాళాలను అందించారు.
1965 వ.సంవత్సరంలో రాధాకృష్ణస్వామీజీ
అధికారికంగా భవనానికి ప్రారంభోత్సవం చేసారు. ఏప్రిల్, 27, 1967 వ.సంవత్సరంలో శ్రీ ఎస్.దొరైస్వామిగారు
సాయిబాబావారి అద్భుతమయిన నిలువెత్తు రంగుల చిత్రపటాన్ని భవనంలో ఆవిష్కరణ నిమిత్తం బహుకరించారు. అప్పట్లో కర్ణాటక రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న
శ్రీ వి.వి.గిరిగారి సమక్షంలో ఆయన సతీమణి శ్రీమతి సరస్వతీబాయిగిరి గారు సాయిబాబా పటాన్ని
భవనం ప్రధాన హాలులో ఆవిష్కరించారు.
మైసూర్ సొసైటీస్ యాక్ట్
ప్రకారం 1979 వ.సంవత్సరంలో ‘సాయి స్పిరిట్యువల్ సెంటర్’ ని రిజిస్టర్ చేసారు. శ్రీ హర్షద్ పటేల్ శ్రీరాధాకృష్ణగారి అద్భుతమయిన
విగ్రహాన్ని బహూకరించగా, రాధాకృష్ణస్వామీజీగారు 1972 వ.సంవత్సరంలో విగ్రహావిష్కరణ చేసారు. 1978 వ.సంవత్సరంలో
స్పిరిట్యువల్ సెంటర్ యొక్క సిల్వర్ జూబ్లీ సందర్భంగా శ్రీసాయిబాబావారి నిలువెత్తు
పాలరాతి విగ్రహాన్ని సాయిబాబావారి 60 వ.మహాసమాధి రోజున ప్రతిష్టించారు.
శ్రీ నరసింహస్వామీజీ
గారు 19.10.1956 వ.సంవత్సరంలో పౌర్ణమిరోజున మహాసమాధి చెందారు. ఆరోజునే ఆయన తనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తినంతటినీ
రాధాకృష్ణస్వామీజీగారికి బదలాయించారు. తన తదనంతరం
తను అనుకున్న లక్ష్యాన్ని మరింత ఉత్సాహంతో ముందుకు నడిపించేటందులకే ఆయన తనలోనున్న శక్తులన్నిటినీ
రాధాకృష్ణస్వామీజిగారికి ధారపోశారు. 1970 వ.సంవత్సరంనుండి
మద్రాసులో ఉన్న ఆలిండియా సాయి సమాజ్ ప్రెసిడెంట్ గా వాటి వ్యవహారాలతోపాటు బెంగళూరులో
ఉన్న త్యాగరాజనగర్ మందిర వ్యవహారాలను కూడా చూస్తూ ఉండేవారు. గురుపూర్ణిమనాడు, మహాసమాధిరోజు యింకా యితర ముఖ్యమయిన
పండుగరోజులలో ఆయన అదేరోజు మద్రాసునుంచి బెంగళురుకు, మరలా బెంగళూరునుంచి మద్రాసుకు ప్రయాణం
చేస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆయన మద్రాసులోను,
బెంగళూరులోను ఉన్న మందిరాలకు పండుగ దినాలలో అదే రోజు రెండుచోట్ల పాల్గొంటూ ఉండేవారు. ఆ విధంగా పాల్గొనడానికి ఆయన కారులోను, విమానంలోను ప్రయాణిస్తూ ఉండేవారు. ఆల్ ఇండియా సాయిసమాజ్ మద్రాసుకి
ప్రెసిడెంటుగా ఆయన మద్రాసు చుట్టుప్రక్కల, ఆంద్రప్రదేశ్, మహారాష్టలలో ఎన్నో బాబా మందిరాలకు
ప్రారంభోత్సవం చేసారు. 1978 వ.సంవత్సరంలో పూనాలో
ఆయన నాయకత్వంలో అఖిలభారత సాయి భక్తుల సమ్మేళనం ఎంతో విజయవంతంగా నిర్వహింపబడింది.
(ఇంకాఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment