Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, February 7, 2018

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 7 వ.భాగమ్

Posted by tyagaraju on 7:56 AM
      Image result for images of shirdisaibaba
            Image result for images of rose

07.02.2018  బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.   SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు.     పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లుసాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
           Image result for radhakrishna swamiji

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 7 .భాగమ్
 తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
03.08.1971  ఈ రోజు స్వామీజీ ఎంతో ఉన్నతమయిన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు.  ఆయన మాట్లాడుతూ ఉన్నంతసేపు, తరచుగా కళ్ళు మూసుకుంటూ ఒక విధమయిన ఆనందపారవశ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు.  ఆయన వదనం అపూర్వమయిన ఆనందంతో వెలిగిపోతూ చిరునవ్వులు చిందిస్తూ ఉంది.  ఆనందం పొంగి ప్రవహిస్తూ ఉంది.


ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నారు. 

“భక్తిమార్గంలో నిరంతరం ఆనందాన్ని అనుభవించడానికి మనం నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి.  శ్రీరామకృష్ణపరమహంస ఆ జగన్మాత మీదనే తన దృష్టినంతా కేంద్రీకరించి ఎప్పుడూ ‘అమ్మా, ‘అమ్మా’ అని ఆమె కోసం పరితపిస్తూనే ఉండేవాడు.  
              Image result for ramakrishna paramahamsa worshipping kali
ప్రతిరోజు మనం చేసే భజనలలోను, ప్రార్ధనలోను, కఠినతరమయిన క్రమశిక్షణను పాటించవలసిన అవసరం ఎంతయినా ఉంది.  ప్రతిరోజు మనము ఒక సమయాన్ని నిర్దేశించుకుని ఆసమయంలోనే భగవంతుని నామాన్ని కనీసం మీకు వీలయినంత సేపు జపించుకుంటూ ఉండాలి.  ఆవిధంగా మనము ఏభగవంతుని గురించి ప్రార్ధిస్తూ ఉన్నామో ఆయననే మన మదిలో నిలుపుకోవాలి.  ఉదాహరణకి మనం ‘రాధేశ్యామ్, రాధేశ్యామ్’ అని పాడుకుంటూ ఉన్నపుడు శ్రీకృష్ణపరమాత్మ గోపికలతో రాసలీల నాట్యమాడుతున్నట్లుగా ఆ దృశ్యాలను ఊహించుకోవాలి.  
             Image result for images of srikrishna rasa lila

భగవంతుడు ఎల్లప్పుడు మన హృదయాలలోనే నివసిస్తూ ఉన్నాడనే విషయాన్ని నిరంతరం గుర్తుచేసుకుంటూ ఉండాలి.  మనం ‘నమశ్శివాయ’ అని జపించుకుంటున్నపుడు భగవంతుడు నిరాకారుడనే విషయాన్ని భావించుకోగలము.  ‘నిరాకారుడు’ అని భావించుకున్నపుడు మనకెంతటి ఆనందం కలుగుతుందో కదా!  మనం ఆ భావనలో లగ్నమయిపోతే ‘నేనే భగవంతుడను’ అని మనకనిపిస్తుంది.  అనగా ఇది ‘సోహమ్’ లాగానే ఉంటుంది.  
(సోహం  -  ధ్యానం గురించి వీడియోలు చూడండి.  భగవాన్ సత్యసాయిబాబావారి ఉపన్యాసం కూడా వినండి.)


మనము ఈవిధంగా ధ్యానం చేస్తున్నపుడు మనకు కలిగే అనవసర విషయాలనే కలుపుమొక్కలను ‘నేతి, నేతి’ అంటూ పెకలించివేయాలి.  చివరికి నేనే అందరిలోను ఉన్న ఆత్మను  అందరి హృదయాలలోను ఉన్న హృదయాన్ని నేనే.  నేనే భగవంతుడను అనుకునే స్థాయికి చేరుకుంటా  మనే విషయాన్ని మనం గ్రహించుకోగలం.
            Image result for images of bhagavadgita
భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ – “అహమాత్మ గుడకేశ సర్వభూతాశయస్థితః----“ అని చెప్పాడు. అనగా సమస్త ప్రాణులయొక్క హృదయమందున్న ప్రత్యగాత్మను నేనే అయి ఉన్నాను అని భావము. 
(గుడాకేశ -  గుడాక + ఈశ – నిద్రను జయించినవాడు, అర్జునుడు .  ఆహారము, నిద్ర అను ఇరువురు దొంగలు మనుజుని జీవితమును హరించి వేయుచున్నారు.  కావున ముముక్షువు ఆ రెండిటిని అదుపునంధుంచుకుని సంయమశీలుడై ప్రవర్తించవలెను.  మితనిద్ర, మితాహారములనే సేవించుటను అభ్యసించవలెను.  (అ. 10 శ్లో. 20)  ( భావార్ధము గీతామకరందమునుండి గ్రహింపబడినది.)
ఈ విషయాలన్నిటిని మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే మనమే బ్రహ్మం అని క్రమక్రమంగా మనలో అనుభవం కలుగుతుంది.  ‘నేనే విష్ణు, నేనే శివుడను, నేనే భగవంతుడను’ అని తెలుసుకోగలుగుతాము.  ఆ విధంగా భగవంతుడు సర్వశక్తిమంతుడని, సర్వవ్యాపకుడని, సర్వజ్ఞుడని మనం గుర్తించగలుగుతాము.
ఒకవేళ నిరాకారము మీద దృష్టిని కేంద్రీకరించడానికి సాధ్యం కాకపోయినా, లేక నిరాకారము గురించి ఆలోచించడానికి తనకు యోగ్యత లేదని భావించినా, ‘నేనే నీవు’ అనే భావంతో ధ్యానించాలి.   ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలంటే ఏవిధంగా ప్రయత్నించాలి?  సముద్రం ఉందనుకోండి.  సముద్రంలో బాగా లోతుకు కూడా ఈదుకుంటు వెళ్ళగలిగే గజఈతగాడిని గుర్తు తెచ్చుకొనండి.  తనవద్దనున్న సరంజామాతో సహా సముద్రం అట్టడుగుకు ఈదుకుంటూ వెళ్ళి ముత్యపుచిప్పలను సేకరిస్తాడు.  వాటిని బయటకు తీసుకొనివచ్చి శుభ్రం చేసి మంచిముత్యాలని బయటకు తీస్తాడు.  అదేవిధంగా మనము కూడా ఆధ్యాత్మిక సాగరంలో లోతుకు ఈదుకుంటూ వెళ్ళాలి.  ఈ సాగరంలో కెరటాలు ఉంటాయి.  వాటి భ్రమలో మనం పడకూడదు.  ఆ కెరటాలలో మనం కొట్టుకొనిపోరాదు.  మనమాఆధ్యాత్మిక సాగరంలో లోతుకు వెళ్ళాలి.  ఇదివరకే ఆవిధంగా చేరుకున్న వ్యక్తి సహాయం మనం తీసుకోవాలి.  ఇదే ఆధ్యాత్మిక జీవితం.  ఈ ఆధ్యాత్మిక సాగరంలోని కెరటాలే ‘సంసారం’.  ఆ సాగరంలోని కెరటాలే సిధ్ధులు.  మనకు లభించే సిధ్ధులయొక్క భ్రమలో పడకూడదు. (ధ్యానం బాగా సాధన చేస్తున్నవారిలో కొన్ని కొన్ని సిధ్ధులు పొందగలరు)  సాగరంలో అట్టడుగు దాకా వెళ్ళిన ఈతగాడు ఎవరు అంటే గురువు.  గురువుయొక్క సహాయం తీసుకోవడమే కాదు సత్సంగం యొక్క ఫలితాన్ని, ప్రయోజనాలని మనం అందిపుచ్చుకోవాలి.  అందుచేత మనం ఎంతగానో సాధనలు చేయాలి.  సాధనల ద్వారానే మనం ఆధ్యాత్మికతలోని లోతులను కనుగొని మంచి విలువయిన ముత్యాన్ని సంపాదించుకోగలం.  ఆ మంచి ముత్యం ఏమిటంటే భగవంతుని గురించి తెలుసుకోవడమే.  ఆ భగవంతుడిని మనం కీర్తించాలి.  ఆధ్యాత్మిక సాధనలన్నిటిలోను ఖచ్చితమయిన క్రమశిక్షణను పాటించాల్సి ఉంటుంది.  ఆధ్యాత్మిక సాగరంలో అట్టడుగుకు వెళ్ళడానికి మనము ఉపయోగించే సాధనం భగవంతుని మీద భక్తి.  అయితే కొన్ని చికాకులు ఉండవచ్చు.  జ్వరంతో బాధపడే వ్యక్తి ఏమి చేస్తాడు? డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందులు తెచ్చుకుంటాడు.  డాక్టర్ మందులు చీటీ మీద రాసి ఏ మందుల షాపులో అవి లభ్యమవుతాయో చెబుతాడు.  అక్కడికి వెళ్ళి మందులు తెచ్చుకుంటాడు.  అదే విధంగా ఇక్కడ మందులనిచ్చే డాక్టరు గురువు.  ఇక్కడ మనకి బాబాయే గురువు.  మందులను ఇచ్చే దుకాణం కూడా ఆయనే.  సాధారణ పరిస్థితుల్లో డాక్టర్ ఒక చోట ఉంటే మందుల షాపు వేరొకచోట ఉంటుంది.  కాని ఇక్కడ బాబాయే డాక్టరు.   మందులనిచ్చేది కూడా ఆయనే.  అటువంటి సౌలభ్యం ఉండగా ప్రజలు దానిని ఉపయోగించుకోవటంలేదు.
స్వామీజీ 6వ.తారీకున సంభవించబోయే చంద్రగ్రహణం గురించి చెప్పారు.  6వ.తారీకు రాత్రి మనం గాఢనిద్రలో ఉన్నపుడు చంద్రగ్రహణం సంభవిస్తోంది.  ఆసమయంలో మనం గాఢనిద్రలో ఉండటం వల్ల గ్రహణ సమయంలో మనం చేయవలసిన విధులు ఏమిటో మర్చిపోతాము.  ఆసమయంలో మనం చేయవలసిన మంచి సులభమయిన పద్ధతి విష్ణుసహస్రనామపారాయణ.  నేటి ప్రపంచంలో అసూయాపరులు కూడా ఉండవచ్చు.  వారు మనకి హాని కలిగించడానికి మంత్రప్రయోగాలు కూడా చేయవచ్చు.  వాటి ప్రభావం మనమీద పడకుండా ఉండాలంటే దానికి ఒక్కటే మార్గం.  అదే విష్ణుసహస్రనామ పారాయణ.  గ్రహణ సమయంలో నిరంతరం గాయత్రి జపం సాధ్యం కాకపోవచ్చు.  అందు చేత విష్ణుసహస్రనామ పారాయణే ఉత్తమం.  ఇటువంటి అమోఘమయిన స్తోత్రం మన ఆధ్యాత్మిక జీవితంలో కలిగే అన్ని అడ్డంకులను తొలగించడానికి దోహదపడుతుంది.  నమ్మకం ఉంచి ముఖ్యంగా గ్రహణసమయంలో తప్పకుండా విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 
(స్వామీజీ గారి అనుగ్రహ భాషణలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List