20.03.2018 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీస్వామీజీ భక్తులతో
జరిపిన అనుగ్రహ భాషణమ్ - 13 వ.భాగమ్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
10.11.1971 ఈ రోజు ఒక భక్తుడు స్వామీజీ తో “స్వామీజీ,
ఈ రోజు నాకు 55 సంవత్సరాలు వచ్చాయి. ఈ సందర్భంగా నేను 55 సార్లు విష్ణుసహస్రనామ పారాయణ చేద్దామనుకుంటున్నాను” అన్నాడు.
దానికి సమాధానంగా స్వామీజీ “విష్ణుసహస్రనామ పారాయణ ఇన్ని సార్లు చేయాలి అనే నియమం ఏమీ లేదు. వాస్తవంగ
చెప్పాలంటే భక్తి భావం కలగగానే ఎన్నిమార్లు పారాయణ చేసాడో చేసినవానికే తెలియదు. ఇపుడు నీకు 55 సంవత్సరాలు వచ్చాయని చెబుతున్నావు. 55 సం.ఎవరికి వచ్చాయి? శరీరానికా లేక ఆత్మకా? వయస్సు వచ్చింది శరీరానికే. మనలో ఉన్న ఆత్మకి వయస్సనేది రాదు. ఆ దృష్టితో చూస్తే ఎవరయినా తమకు వయస్సు గుర్తుకు వచ్చి పుట్టినరోజును జరుపుకుందామనే ఆలోచన వచ్చిందంటే అటువంటి ఆలోచన ఎందుకూ పనికిరానిది. మనము భౌతికంగా అటువంటి ఆలోచనా పరిధులను దాటి భగవంతుని యొక్క తత్త్వములోకి ప్రవేశించాలి. పెద్దవారు పుట్టినరోజులు జరుపుకోవడం నాకు మాత్రం యిష్టం లేదు. పిల్లలు
మాత్రమే జరుపుకోవాలి.
విష్ణుసహస్రనామ ప్రారాయణకు ఆధ్యాత్మిక విలువ ఎంతగానో ఉంది. చెప్పాలంటే పారాయణవల్ల మన మన్సులో ఉన్న చెడు ఆలోచనలన్నీ తుడిచిపెట్టుకుని పోతాయి. మనకి మరింకేవిధమయిన పుణ్యం గాని గొప్పతనం గాని అవసరం లేదు. మనమెవరం? మనము వయసేరాని, మరణమే లేని ఆత్మలం. భగవంతునియొక్క అనుగ్రహం మనకు ప్రసాదింపబడాలంటే మనలో ఉన్న అరిషడ్వర్గాలను రూపుమాపుకొని పరిశుధ్ధులమవ్వాలి. దానికి
సులభమయిన మార్గం భక్తి. భగవంతుని విగ్రహాల ముందు మనము ఆయనను కీర్తిస్తూ గానం చేయాలి. దానివల్ల
మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
12.11.1971 : స్వామీజీ ఈ రోజు ముఖ్యంగా తులా మాసంలో పవిత్రనదులలో స్నానమాచరించడం వల్ల కలిగే ఫలితాలను గురించి వివరించారు.
“తులామాసంలో కావేరి నదిలో స్నానం చేసినట్లయితే గంగానదిలో స్నానం చేసినంత ఫలితం వచ్చి ముక్తి కలుగుతుందని” చెప్పారు. గంగా నదిలో రెండుసార్లు, యమునా నదిలో అయిదు సార్లు స్నానమాచరిస్తే ముక్తి కలుగుతుందని వివరించారు. అదే కావేరి నదిలో ఒక్కసారి స్నానమాచరించినా ముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయని అన్నారు. దానికి కారణమేమిటంటే కావేరి నది రంగనాధస్వామిని రెండు మార్లు చుట్టి ప్రవహిస్తు ఉంటుంది. కావేరిమాత కూడా శ్రీరంగపట్టణంలో రంగనాధుడిని పూజించింది.
కావేరినది ప్రవహించడానికి కారణమయిన వినాయకుడిని మనము మరువరాదు. ఆయన ద్వారానే భక్తులకు ఎంతగానో మేలు కలిగింది. వినాయకుని వల్లనే శ్రీరంగంలో రంగనాధుని ప్రతిష్ట జరిగింది. గోకర్ణంలో మహాబలేశ్వరుని ప్రతిష్ట కూడా ఆయన ద్వారానే జరిగింది. అగస్త్యముని ద్వారా కైలాసంనుండి నీలగిరిపర్వతాల వద్ద నది ప్రవహించడానికి గణపతే కారకుడు. ఇదే కావేరి నదిగా మారింది. గణేశుడు మేధస్సును ప్రసాదించేవాడయితే సుబ్రహ్మణ్యేశ్వరుడు
ప్రజ్ఞని ప్రసాదిస్తాడు. ప్రజ్ఞ
అనేది చైతన్యం, స్పృహ. మేధస్సు అంటే జ్ఞానం. జ్ఞానం అనుభవంలోకి రావాలంటే ప్రజ్ఞ అవసరం. సుబ్రహ్మణ్యేశ్వరుడు, గణపతి ఇద్దరూ తృప్తి చెందితే శివుడు, శక్తి సంతోషిస్తారు. ఈ కలియుగంలో భగవన్నామ స్మరణ వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఆవిధంగా కేవలం విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే చాలు. ఆఫలితం
ఏదో ఒకరోజు మనలను భగవంతుని వద్దకు చేరుస్తుంది. మనలోని
దోషాలన్నిటిని నిర్మూలించే మహాత్ముడు భగవంతుడె. ఆవిధంగా
మనలను పవిత్రులుగా చేసి తన అనుగ్రహాన్ని మనమీద ప్రసరింప చేస్తాడు. యాంత్రికంగా విష్ణుసహస్రాన్ని చదివినా కూడా మంచి ఫలితాన్నిస్తుంది. విష్ణుసహస్రనామాన్ని చదువుతున్నపుడు మనము ఆయన గురించే ఆలోచిస్తూ ఆయన మనలోనే ఉన్నాడని భావించడం వల్ల అది మనకెంతో మేలు చేస్తుంది. మన ఇఛ్చ ప్రకారం ఏభగవంతుని నామాన్నయినా మనం స్మరించుకుంటూ ఉండవచ్చు. ‘రామనామం’
జపించడం ఎంతో ఉపయుక్తమయినది. అది ఎంతో శక్తివంతమయిన నామం. రాముడిని పూజించడమంటే త్రిమూర్తులను పూజించినట్లే. మనమంతా చేయవలసినది భగవంతుని కోసం మనం కొంత సమయాన్ని కేటాయించాలి. ఆయన నామస్మరణ ఎంతటి పాపాత్ముడినయినా పునీతుడిని చేస్తుంది. గీతలో భగవానుడు. “అపి చేత్ సుదురాచారో….” అని చెప్పలేదా? భగవంతుడు పాపిని కూడా తనవద్దకు చేర్చుకుంటాడు. నామస్మరణ తెలిసి చేసినా తెలియక చేసిన దాని ఫలితం మొట్టమొదటగా మన ఆత్మను ఉత్తేజపరచి, తప్పకుండా ఆయన వద్దకు చేర్చి సత్యంవైపు నడిపిస్తుంది. పరమార్ధాన్ని తెలియచేస్తుంది. బాబా మనకు రామ మార్గాన్ని చూపించారు. నామదేవుడు కూడా భక్తులకు విఠలుని చూపించాడు.
భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. మన వేదాలు కూడా ఇదే విషయాన్ని ప్రముఖంగా చెప్పాయి. వేదాలలో
చెప్పబడినవాటిలో గొప్ప వాక్యం. “తద్విష్ణో పరమం పదం” ఈ భావన ఎంతగొప్పదో గమనించండి. (ఇది ఋగ్వేదంలోని మంత్రం). ప్రతిజీవరాశిలోను దైవికశక్తి నిండి ఉంది. ఆశక్తి
వల్లనే మనకు వెలుతురు, జలము, అగ్ని లభిస్తున్నాయి. మన జఠరం (జీర్ణకోశం) లో అగ్నివలననే మనకు జీర్ణక్రియ జరుగుతోంది. “అహం వైష్వానరో …” అనగా ఆభగవంతుడె మన జఠరంలో ఉన్న జఠరాగ్ని. ఆయన ప్రతి కార్యాన్ని నిర్వహిస్తాడు. మనం చేసేదేమీ లేదు. ఆయనే సృష్టికర్త, పోషకుడు, రక్షకుడు. చివరికి
మనలను తన వద్దకు చేర్చుకుంటాడు.
ఇపుడు మీకు భగవన్నామము యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తాను. మీరు రామనామాన్ని జపించినట్లయితే విష్ణువు, శివుడు యిద్దరూ ప్రీతి చెందుతారు.
కాని మీకు ఉండవలసినది పూర్తి నమ్మకం. మీరు భగవంతునియొక్క వేయినామాలను జపిస్తున్నట్లయితే కనీసం ఒక్క నామమయిన మీహృదయంలో నాటుకొంటుంది. ఆవిధంగా
కొంతమందికి ‘కృష్ణ’ మరికొందరికి ‘రామ’ నామాలు వారి హృదయాలలో నిక్షిప్తమవవచ్చు. ఆ పవిత్ర నామంతోనే మనం పురోగతిని సాధించాలి. ఆఖరికి ఆభగవంతుడు లేకుండా ఈ ప్రపంచంలో మనం బ్రతకలేమన్నంతగా ఉన్నత స్థాయికి పురోగమిస్తాము.
పురందరదాసు ఏమని చెప్పాడో గుర్తుకు తెచ్చుకోండి. “నేను నిన్ను వదలను, నువ్వు నన్ను వదలలేవు”. అమ్మవారి దర్శనం కోసం తహతహలాడుతూ శ్రీరామకృష్ణపరమహంస ఏవిధంగా రోదించాడో మీకు తెలుసు. ఒక్కసారిగా మనం ఆస్థాయికి వెళ్లలేము. మనమింకా
ఈ ఐహిక ప్రపంచంలోనే జీవిస్తున్నాము. మనలోనున్న విషయవాసనలను నిర్మూలించుకున్నపుడే
మనము భగవంతుని చేరుకోగలము. వాటిని నిర్మూలించుకోవాలన్నా
కూడా అదంతా ఆయనమీదనే ఆధారపడి ఉంది. తిరుగులేని పరిపూర్ణమయిన విశ్వాసాన్ని పొందాలన్నా ఆయన మాత్రమే మనలను అనుగ్రహించాలి.
“బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే
వాసుదేవః సర్వమతి స మహాత్మా సుదుర్లభః
అనేక జన్మలపిదప జ్ఞానియైనవాడు
(భగవత్తత్త్త్త్వమును ఎఱిగినవాడు) సర్వమూ వాసుదేవమయమే అని భావించి నన్ను శరణుపొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. ( గీత. అ.7 శ్లో.19)
ఆయన అనుగ్రహం వల్ల మాత్రమే
ఎన్నోజన్మలు గడిచిన తరువాత మనకు ఆయన దర్శనం, జ్ఞానం లభించాలనే కోరిక కలుగుతుంది. ఆయన దయ లేకుండా ఏదీ జరుగదు. మనం ఆయన పాదాలవద్ద శరణు వేడుకుంటూ ఈ విధంగా ప్రార్ధించాలి.
“హే భగవాన్, ఏది మంచో ఏది చెడో నాకు తెలియదు.
నువ్వే నన్ను సరియైన మార్గంలో నడిపించి నీదగ్గరకు చేర్చు” . భగవంతుని వద్దకు చేరుకోవడానికి మనము కలిగే పురోగతికి
మన అహంకారమే పెద్ద అడ్డంకి. అహంభావం వల్లనే
మనకు మనమే ‘నేను, నేను’ అని అంటూ ఉంటాము. మనకు
ఈ మానవజన్మ లభించినందుకు మనము ఆయనకు కృతజ్ఞులమై ఉండి నిరంతరం ఆయననే స్మరిస్తూ ఉండాలి. సాయంకాలం కాగానే సూర్యకిరణాలు ఏవిధంగానయితే మరలా
వెనుకకు ఆయన వద్దకే వెళ్ళిపోతాయో అదేవిధంగా మనము “హే భగవాన్, నేను మరలా నీవద్దకే తిరిగి
చేరుకోవాలి” అని ప్రార్ధించాలి. మనకు ముఖ్యంగా
కావలసినది. భగవంతునియందు పరిపూర్ణమయిన అచంచలమయిన నమ్మకాన్ని పెంపొందించుకోవడం. ఆయనను చేరుకోవడానికి ఎటువంటి అధ్యయనం చేయనక్కరలేదు. ఆయననే ధ్యానిస్తు జాగరూకులమై జ్ఞానంతో మెలగాలి. దానివల్ల మనకు సత్యం బోధపడుతుంది. ఆధ్యాత్మికాన్వేషణలో మనకు కలిగే అడ్డంకులు తొలగిపోవాలంటే
గణపతిని పూజించాలి. గణపతి ఎవరు? ఆయన ‘శబ్దానికి’
చిహ్నం. మన ఋషులు ధ్యానం చేసిన తరువాత ఓంకార
శబ్దాన్ని కనుగొన్నారు. ఈ ‘ఓమ్” అనే శబ్దం
భగవంతునినించే ఉధ్భవించింది.
ఈ ఓంకార శబ్దం
ఏవిధంగా వచ్చిందో వివరించడానికి వారు ఒక ఏనుగును ఊహించుకుని ఆ ఏనుగు చేసే శబ్దమే ఓమ్
అని ఊహించారు. అది ‘ప్రణవం’ --- గణపతి ప్రణవస్వరూపుడు.
0 comments:
Post a Comment