07.12.2020 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 10 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – సాకోరీ – షిరిడి - గురువారము, అక్టోబరు, 17, 1985
(ఎడమవైపు చిత్రం అప్పాసాహెబ్ బొరావకె)
షిరిడీ తుకారామ్ రఘుజీవ్ బొరవాకే గారి గృహంలో
సాయంత్రం గం. 6.45 నిమిషాలకు …
శ్రీ తుకారామ్ రఘుజీవ్ (అప్పాసాహెబ్ బోరవకే ఈ పేరుతో ఆయన అందరికీ బాగా పరిచితులు). 82 సంవత్సరాల వయసు. షిరిడీసాయి సంస్థానం ట్రస్టీ సభ్యులలో ఆయన కూడా ఒక సభ్యుడు. 1917వ.సంవత్సరంలో
సాయిబాబాను మొట్టమొదటిసారి కలుసుకొన్నపుడు ఆయన వయస్సు
14 సంవత్సరాలు.
బలదేవ్ గ్రిమె (కోపర్ గావ్) దుబాసీగా వ్యవహరించారు.
ప్రశ్న --- సాయిబాబాగారితో మీకు కలిగిన మొట్టమొదటి అనుభవాలను వివరిస్తారా?
జవాబు --- షిరిడికి దగ్గరలో ఉన్న నీమ్ గావ్ గ్రామంలో మాకు వ్యవసాయ భూములు ఉండటం వల్ల
నేను షిరిడికి వచ్చాను. 1916వ.సం.లో నేను అక్కడ వ్యాపారం ప్రారంభించాను. అప్పటికి నేను
చాలా చిన్నవాడిని. నేనప్పుడు పాఠశాలలో చదువుతున్నాను. మా పెద్దన్నగారు రావుసాహెబ్ బొరావకె,
మా అమ్మగారు ఇద్దరూ సాయిబాబా దర్శనానికి వెళ్ళారు. సాయిబాబా మా అన్నగారిని కొంత డబ్బడిగారు. తన దగ్గర డబ్బులేదని మా అన్నయ్యగారు
చెప్పారు. అపుడు సాయిబాబా మా అన్నగారి జేబువైపు చూపిస్తూ అందులో
ఒక రూపాయి ఉందని అన్నారు. ఆ రూపాయి మా అన్నగారి బంధువు ఒకరు మిఠాయిలు కొనమని ఇచ్చినది. సాయిబాబా ఆరూపాయను దక్షిణగా స్వీకరించి,
జీవితమంతా ధనసంపదలతో వర్ధిల్లుతావు అని మా అన్నగారిని ఆశీర్వదించారు. బాబా దీవెనలు యదార్ధమయ్యాయి. కాలక్రమేణా 1917వ.సంవత్సరంలో నాకు సాయిబాబాతో పరిచయం కలిగింది. నేను సాయిబాబాను దర్శించుకునేవాడిని
అంతే తప్ప ఆయనతో చనువుగా ఏమీ మాట్లాడలేదు.
ప్రశ్న --- మీజీవితంలో సాయిబాబావారి ప్రభావం గురించి చెబుతారా? ఆయన గురించి మీ భావాలు తెలియచేస్తారా?
జవాబు --- బాబాగారు మహాసమాధి చెందిన తరువాత మాకుటుంబంలో కలతలు రేగాయి. ఏమి చేయాలో నాకు తెలియలేదు.
ప్రశ్న --- అప్పుడు మీరు చాలా చిన్నవారు అవునా?
జవాబు --- అవును. నేను చిన్నవాడిని. కాని మాకుటుంబ కలహాలు బాబా సమాధి చెందిన చాలా కాలం తరువాత అనగా 1943వ.సం.లో వచ్చాయి. మాకుటుంబ కలహాలు నన్ను తీవ్రంగా బాధించాయి. అపుడు మందిరానికి వెళ్ళి బాబా పాదాలు పట్టుకొని, మాకుటుంబంలో శాంతి నెలకొని అందరూ సంతోషంగా గడిపేలా దీవించమని బాబాను వేడుకొన్నాను.
ఆతరువాత నా జీవితం ఆధ్యాత్మికంగాను,
ఆర్ధికపరంగాను చాలా ఆనందంగా సాగింది. బాబా దయకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
ప్రశ్న --- ఇదంతా సాయిబాబా గారి అనుగ్రహం వల్లనేనా?
జవాబు --- అవును, ఇది 1943 లో జరిగింది.
అప్పా గుర్తుకు తెచ్చుకొని చెప్పిన మరికొన్ని
వివరాలు…
ఆతరువాత ప్రతిరోజు ఉదయం పది గంటలకు బాబా
సమాధిమీద పుష్పాలను ఉంచే హక్కు నాకు ఇవ్వబడింది. అది ఎంతో గౌరవప్రదమయిన సేవ.
ఈ హక్కు ఎవరికి ఇవ్వలన్న దానిమీద విభేదాలు ఏర్పడ్డాయి. కాని సాయిబాబా అనుగ్రహం వల్ల ఆయన సమాధిమీద పుష్పాలను ఉంచి పూజించే ప్రాధాన్యత నాకే ఇచ్చారు. ఇప్పటికీ నలభై సంవత్సరాలుగా బాబా సమాధికి నేను పుష్పాలను ప్రతిరోజు తీసుకువస్తున్నాను.
ప్రశ్న --- ఇటీవలి కాలంలో మీకు కలిగిన అనుభవాన్ని వివరిస్తారా? దాని గురించి నేను ఈ గ్రామంలో విన్నాను…
జవాబు --- ఏడు
లేక ఎనిమిది సంవత్సరాల క్రితం 25 నుండి
32 మంది భక్తులు ఢిల్లీనుండి వచ్చారు. వారు బాబాను పూజించుకోవడానికి షిరిడికి వచ్చారు.
నేను రోజుకు రెండుసార్లు మందిరానికి వెడుతూ ఉంటాను. ఒకసారి నేను మందిరానికి వెళ్ళినపుడు వారందరూ అక్కడే ఉన్నారు. నేను బాబాకు పూజ, ఆరతి ఇస్తున్న సమయంలో వారందరు నాపాదాలను తాకడం మొదలుపెట్టారు. నేను ఒక్కసారిగా విభ్రాంతికి లోనయ్యాను. ఎటూతోచని స్థితి అయింది నాకు. “నాపాదాలను పట్టుకోకండి, బాబా పాదాలను పట్టుకుని నమస్కరించుకోండి, నేను మామూలు
వ్యక్తిని మాత్రమే” అన్నాను. కాని వారు నామాట వినిపించుకోలేదు. అపుడు వారంతా మాయింటికి వచ్చి నన్ను
పూజించుకోవడానికి వచ్చామన్నారు. నేనేమీ మాట్లాడలేదు. నన్ను, నాభార్యను పూజించడానికి
వారంతా ఉదయం వచ్చారు. ఆతరువాత మరుసటిరోజు టాంగాలో ముగ్గురు స్త్రీలు షిరిడినుండి
మా ఇంటికి వచ్చారు. అపుడు
మాఇంటిలో మా పెద్ద కోడలు ఉంది. ఆమెకూడా చాలా ఆశ్చర్యపోయింది.
“అసలు ఇక్కడ ఏమి జరుగుతోంది” అని అడిగింది. జరిగేదంతా చాలా ఆసక్తిగా గమనిస్తూ
ఉంది. అపుడు మాకోడలు
“మీరు మామామగారిని ఎందుకు పూజిస్తున్నారు?” అని అడిగింది.
కారణం తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంతో ఉంది మాకోడలు. అపుడు వారంతా ఒక ఆసక్తికరమయిన విషయాన్ని చెప్పారు. ఢిల్లీలో తమకు సాయిబాబా స్వప్నంలో ఆదేశాన్ని ఇచ్చారని చెప్పారు.
ప్రశ్న --- కలలోనా?
జవాబు --- అవును వారికి కలలో బాబా చెప్పారట.
ప్రశ్న --- అంటే సాయిబాబా వారికి కలలో దర్శనమిచ్చారా?
జవాబు --- అవును. బాబా
వారికి కలలో దర్శనమిచ్చి ఆప్పాను పూజించండి అని చెప్పారట.
ప్రశ్న --- వారికి అప్పా గురించి ఇంకా ఏమయినా తెలుసా?
జవాబు --- లేదు లేదు, వారికి
అప్పా గురించి అసలేమీ తెలీదు ఆకధంతా చాలా ఆసక్తిగా ఉంటుంది.
ప్రశ్న --- మీ అభిప్రాయం ప్రకారం సాయిబాబా మీకు బోధించినవాటిల్లో ముఖ్యమయినది ఏది?
జవాబు --- మాకుటుంబ కలహాల తరువాత నాకేమి చేయాలో తెలీలేదు. కష్టాలలో ఉన్నపుడు ఎవరయినా సరే
చివరికి ఎవరోఒకరి దగ్గరకు వెళ్ళి
తన కష్టాలను చెప్పుకుంటాడు. నేను సాయిబాబా దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలను పట్టుకొన్నాను. సాయిబాబా నన్ను ఆశీర్వదించి
నాకు అన్నీ అనుగ్రహించారు. నేను ఇక్కడ ఉండటంలేదు. ఇక్కడినుండి పది మైళ్ల దూరంలో ఉన్న
బ్రహ్మన్ గావ్ గ్రామంలో ఉంటున్నాను.
నాకక్కడ కొన్ని పొలాలు కూడా ఉన్నాయి. కాని చివరికి నామిగిలిన జీవితమంతా
సాయిబాబా తనవద్దనే గడపమని నన్ను అనుగ్రహించారని భావించాను. ఈవిధంగా నేను సాయిబాబాకు చేరువయ్యాను. చాలా కష్టాలలో ఉన్న సమయంలో సాయిబాబా నాకు సహాయపడ్డారన్నది
వాస్తవం.
ప్రశ్న --- ఇపుడు మీరు చెప్పిన ఆసక్తికరమయిన కధనంలో భక్తి అనగా గురువుకు
సర్వస్య శరణాగతి చేయాలన్నదే అతి ముఖ్యమని మనం
భావించవచ్చా?
జవాబు --- నిజమే, నాకు కలిగిన అనుభవానికి అదే సరైన సమాధానం. మీరు సరిగానే
చెప్పారు.
ప్రశ్న --- ఒక చిన్న పిల్లవాడిగా మీరు మొట్టమొదటిసారిగా సాయిబాబాను చూడగానే మీలో ఎటువంటి భావాలు కలిగాయి?
జవాబు --- సాయిబాబాను చూసినవెంటనే నాలో ఎంతో ఆనందం కలిగింది. నాహృదయమంతా సంతోషంతో నిండిపోయింది. ఆయనను చూడగానే నేనెంతో సంతుష్టి చెందాను.
ప్రశ్న --- మీరు సాయిబాబావారిని మసీదులో కలుసుకొన్నారా?
జవాబు --- అవును మొట్టమొదటిసారిగా నేను ఆయనను మసీదులోనే కలుసుకొన్నాను.
ప్రశ్న --- సాయిబాబా మీనాన్నగారికి గాని, మీ అమ్మగారికి గాని ప్రత్యేకించి
ఏమయినా ఉపదేశంగాని బోధ గాని చేసారా?
జవాబు --- లేదు, ఏమీ లేదు. ఆయన వారిని దీవించారు అంతే.
(రేపటి సంచికలో ఉపాసని బాబా గురించి ఆయన చెప్పిన వివరాలు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment