01.12.2020 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 5 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – సాకోరీ – షిరిడి - గురువారము, అక్టోబరు, 17, 1985
షిరిడీలో ఉద్ధవరావు మాధవరావు దేశ్ పాండె
గారి తండ్రిగారి ఇంటిలో జరిగిన ముఖాముఖీ సంభాషణ.. ఉదయం గం.8-30
నుండి గం. 10-00 వరకు.
ఉధ్దవరావు దేశ్ పాండే వయస్సు 79 సంవత్సరాలు. ఆయన కీశే. మాధవరావు దేశ్ పాండే (శ్యామా,
మరణించిన సం. 1944) కుమారుడు. శ్యామా సాయిబాబాకు అత్యంత సన్నిహిత
భక్తుడే కాక బాబాకు తరచుగా మధ్యవర్తిగా ఉండేవాడు.
ఉద్దవరావు, ఆయన భార్య, నన్ను, నాతోకూడా వచ్చిన దుబాసీ, స్వామి శేఖరరావుని, బలదేవ్ గ్రిమె, అతని భార్య మమ్మలనందరినీ ఎంతో సాదరంగా ఆహ్వానించారు. వారు మాకు మంచి టీ ఇచ్చారు. ఆతరువాత నేను ఉద్ధవ్ గారిని బాబా
గురించి వివరాలు తెలుసుకోవడానికి ముఖాముఖీ ప్రశ్నలు అడిగాను.
ప్రశ్న ---
బాబాతో మీకు కలిగిన మొట్టమొదటి అనుభవాలను వివరిస్తారా?
జవాబు --- బాబా మహాసమాధి చెందేనాటికి నాకు
12 సంవత్సరాల వయసు.
ప్రశ్న --- బాబా గురించి మీకు గుర్తున్నంతవరకు వివరిస్తారా?
జవాబు --- బాబా చాలా పొడగరిగా పైకి కనిపించినప్పటికీ ఆయన ఎత్తు అయిదడుగుల మూడు అంగుళాలు ఉంటుంది. ఆయన ఎత్తు కొలిచినట్లయితే సరిగ్గా అంతే ఎత్తు ఉంటారు.
బాబా నన్ను ఎంతో ప్రేమగా చూసేవారు. నాతోపాటుగా తనచుట్టూ ఉండే పిల్లలని కూడా ఎంతో అభిమానించేవారు. మాతో ఆటలు ఆడేవారు. *** ఆయన తరచుగా నన్ను పిలిచి ఏదో ఒకటి ఇస్తూ ఉండేవారు, నానుంచి కూడా తీసుకుంటూ ఉండేవారు. నేను రోజంతా మసీదులో బాబా దగ్గరే ఉండేవాడిని. బాబా తరచూ నాతో మాట్లాడుతూ ఉండేవారు. మేమిద్దరం ఎంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవాళ్ళం. బాబా ఎప్పుడూ పొడవాటి కఫ్నీ ధరించేవారు.
రంగు కఫ్నీలను ఎప్పుడూ ధరించలేదు.
గ్రామంలో ఉన్న బావిలోని నీటితో బాబా రోజూ స్నానం చేసేవారు. ఆయన తచుగా మసీదులో ఉన్న పెద్ద ***రాతి
మీద కూర్చొని స్నానం చేస్తూ ఉండేవారు.
ఆసమయంలో అక్కడ భక్తులెవరయినా ఉంటే వారితో మాట్లాడుతూ ఉండేవారు. ఆయన కూర్చున్న రాయి ఇప్పటికీ మీరు
మసీదులో చూడవచ్చు.
బాబా భుజంమీద చాలా పెద్ద పుట్టుమచ్చ ఉంది. స్వల్పంగా కత్తిరించబడ్డ గడ్డం ఉండేది. వారానికి ఒకసారి క్షురకుడు మసీదుకు వచ్చి బాబాకు క్షురకర్మ చేసేవాడు. ఆయనకు తలమీద జుట్టు లేదు అనగా తలమీద పూర్తిగా క్షవరం చేయించుకునేవారు.
హిందూ మతాచార ప్రకారం ఆయన చెవులు
కుట్టబడి ఉన్నాయి. ఆయన
ముఖవర్చస్సు ప్రకాశవంతంగా ఉండేది. మేనిఛాయ ఒక విధమయిన పసుపురంగు వన్నెతో అసాధారణమయిన దివ్యమయిన వెలుగుతో ప్రకాశిస్తూ
ఉండెది. ఆయన శరీరంనుండి
అధ్బుతమయిన వెలుగు ప్రసరిస్తూ ఉండేది.
ప్రశ్న --- బాబాగారు చేసిన బోధనల గురించి మీరేమన్న చెప్పగలరా?
జవాబు --- ప్రజలందరికీ భక్తులతోపాటుగా గ్రామస్థులందరికీ భగవన్నామ స్మరణ చేస్తూనే ఉండమని
బాబా బోధించారు. అప్పుడప్పుడు పవిత్ర
గ్రంధాలయిన విష్ణుసహస్రనామం, రామాయణం, భగవద్గీతలను
చదువుతూ ఉండమని సలహా ఇస్తూ ఉండేవారు.
ప్రశ్న --- ప్రత్యేకంగా బాబాకు సంబంధించి ఏదయినా ప్రత్యేకమయిన సంఘటన గురించి చెప్పగలరా?
జవాబు --- కాంగ్రెస్ నాయకులలో ఒకరయిన ***లోకమాన్య బాల గంగాధర తిలక్ గారు బాబాను కలుసుకోవడానికి
షిరిడి వచ్చారు. ఆసమయంలో
తిలక్ గారు షిరిడీనుండి మన్మాడ్ కి దగ్గరలో ఉన్న యోవలాకి వెడదామనుకొన్నారు. అపుడు బాబా ఆయనతో “యోవలాకి వెళ్లవద్దు, తిన్నగా మన్మాడ్ కు వెళ్ళు”
అన్నారు. ఆ సమయంలో అక్కడ యోవలాలో అల్లర్లు చెలరేగుతూ ఉన్నందువల్ల బాబా తిలక్ ను అక్కడికి
వెళ్లవద్దని హెచ్చరించారు. “యోవలాకి వెళ్లవద్దు” అన్న బాబా మాటలమీద విశ్వాసముంచి
తిలక్ గారు యోవలాలో ఆగకుండా తిన్నగా మన్మాడ్ చేరుకొన్నారు. మన్మాడ్ నుంచి బొంబాయి వెళ్ళే రైలెక్కారు. షిరిడీలో వయసు మళ్ళిన బాపూసాహెబ్ జోగ్
ఉండేవాడు. ప్రతిరోజు
ఉదయం జోగ్ వచ్చేవాడు. బాబా స్నానం చేసిన తరువాత జోగ్ స్వయంగా బాబా నుదుటి మీద స్వస్తిక్ ఆకారంలో
బొట్టు పెట్టేవాడు. ఆవిధంగా
పెట్టిన తరువాత బాబా నుదుటి మీద బిల్వపత్రం ఉంచేవాడు. అనగా పరమశివునికి ప్రీతికరమయిన బిల్వపత్రాలను
సమర్పించి పూజించేవాడు.
ప్రశ్న --- బాబా గారి అలవాట్లు ఏమిటి?
జవాబు --- బాబా రోజువిడిచి రోజు ఒకరోజు మసీదులోను, తరువాతి రోజు చావడిలోను రాత్రివేళలలో నిద్రించేవారు. ఆయన చావడిలోకి ఎవరినీ రానిచ్చేవారు కాదు. స్త్రీలకు చావడిలోకి ప్రవేశం పూర్తిగా నిషిధ్ధం. అది ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఆయన తరచుగా పసుపురంగ సిల్కు వస్త్రాన్ని ధరించేవారు. బాబా తలకు చుట్టుకోవడానికి ఒక వస్త్రం ఉండేది. ఆయన దానిని తలకు చుట్టుకొని ముడివేసుకుని ఎడమవైపుకు మిగిలిన వస్త్రభాగం వేలాడేలా ధరించేవారు.
ప్రశ్న --- బాబా ప్రజలను ఆశీర్వదిస్తూ ఉండేవారా? ఆయన ఏవిధంగా దీవిస్తూ ఉండేవారు?
జవాబు --- చాలా అరుదుగా బాబా తన చేతితో భక్తుడిని స్పృశించి ఆశీర్వదించేవారు. కాని ఆయన మనసారా తన చేతిని ఒకవిధమయిన ప్రత్యేకమయిన ముద్రలో ఉంచి వారికి అభయం ఇస్తున్నట్లుగా దీవించేవారు.
తన దీవెనలకు
చిహ్నంగా బాబా ఎప్పుడూ తన భక్తులకు ఊదీని ప్రసాదిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు ఆయన స్వయంగా భక్తుల నుదుటి మీద ఊదీని
రాసేవారు. ఆయన తన చేతితో ఆశీర్వదించినా, ఊదీని
ప్రసాదించినా రెండూ భక్తులకి సమానమయిన ఫలితాన్నే ఇచ్చేవి. అది ఆయన దయకు స్పష్టమయిన ఉదాహరణ.
*** మాధవరావు దేశ్ పాండె, ఆయన పూర్వీకులు షిరిడికి నీమ్ గావ్
నుండి వచ్చారు. నీమ్ గావ్ షిరిడీకి 20 మైళ్ల
దూరంలో ఉంది. మాధవరావు దేశ్ పాండేకి రెండు
సంవత్సరాల వయసున్నపుడు వారి కుటుంబం షిరిడీకి వచ్చి స్థిరపడ్డారు.
***భక్తులు బాబాకు పేడాలు సమర్పిస్తూ ఉండేవారు. బాబా వాటినన్నిటినీ మసీదులో ఉన్న పిల్లలందరికీ పంచెపెట్టేసే
వారు.
***బాబా కూర్చొనే రాయి ప్రప్రధమంగా భక్తులు తమతమ దుస్తులను ఉతుకుకోవడానికి
ఉపయోగించేవారు. పూర్వపు రోజులలో మసీదు ధుని చుట్టూ కాస్త ఎత్తుగా ఉన్న ప్రదేశం. అందువల్ల రాయి బయటనే ఉండేది.
***తిలక్ గారు సాయిబాబాను చూడటానికి మే, 19, 1917 వ.సంవత్సరంలో వచ్చారు.
(మరికొన్ని విశేషాలు రేపటి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment