02.12.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 6 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – సాకోరీ – షిరిడి - గురువారము, అక్టోబరు, 17, 1985
(శ్రీ ఉధ్ధవ గారితో ముఖా ముఖీ తరువాయి భాగమ్)
ప్రశ్న --- బాబా తన భక్తులకు శ్రధ్ధ, సబూరీలను అలవరచుకోమని పట్టుపట్టి
మరీ చెబుతూ ఉండేవారట – నిజమేనా?
జవాబు --- నిజమే
– బాబా తన భక్తులను, ఇంకా ప్రజలందరినీ కూడా శ్రధ్ధ,
సబూరి (నమ్మకము, సహనం)
వీటిని అలవరచుకోమని బోధిస్తూ ఉండేవారు. బాబా చాలా తరచుగా ఈ సలహా ఇస్తూ ఉండేవారు.
ప్రశ్న ---
గురువును శరణు వేడుకోమని బాబా చెప్పేవారా?
బాబా ఎల్లప్పుడూ అల్లా మాలిక్, రామ్ మాలిక్, విష్ణు, శివ, అని స్మరిస్తూ ఉండేవారు. బాబా ఎల్లప్పుడూ ఈ విధంగానే అంటూ
ఉండేవారు. బాబా పుస్తకాలను
ఎప్పుడూ చదవలేదు. ఆయన
షిరిడీ విఢిచి కూడా ఎక్కడికీ వెళ్ళేవారు కాదు. ఒకోసారి ఆయన కొద్ది మైళ్ళ దూరంలో షిరిడీకి కుడివైపున ఉన్న నీమ్ గావ్ కి గాని, ఆరుమైళ్ళ దూరంలో ఎడమవైపున ఉన్న రహతాకు గాని వెడుతూ ఉండేవారు.
ప్రశ్న --- బాబా ఎవ్వరికీ మంత్రాలు గాని, ఉపదేశాలను గాని ఇవ్వలేదన్న
మాట నిజమేనా?
జవాబు --- నిజమే, బాబా ఎవరికీ మంత్రాలను గాని ఉపదేశాలను గాని ఇవ్వలేదు. బాబా అందరికీ తమ ఆశీర్వాదాలను ఇచ్చేవారు.
ప్రశ్న --- బాబా గారి పుట్టుపూర్వోత్తరాలు ఏమయినా చెప్పగలరా?
జవాబు --- ఎంతోమంది ప్రజలు, భక్తులు బాబాని ఆయన తల్లిదండ్రుల గురించి, ఆయన ఎక్కడినుండి వచ్చారన్న వివరాలను అడుగుతూ ఉండెవారు. ఒక సారి బాబా, “నా తల్లి సప్తశృంగి”, అని చెప్పారు. ఇపుడు సప్తశృంగి, దేవి కొలువై ఉన్న పుణ్యక్షేత్రం.
బాబా ఇంకా చెప్పిన విషయం,
“నా తండ్రి శివుడు --- త్రయంబకంలోని శంకరుడు”
అని చెప్పారు. త్రయంబకేశ్వరం శివుని జ్యోతిర్లింగాలలో ప్రముఖ పూజనీయ స్థలం. తన పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోవడం
కూడా ముఖ్యం కాదని బాబా తన భక్తులతో అన్నారు. దీనియొక్క గూఢార్ధం ఏమిటంటే ఆయన భగవంతుని
నుంచి భువికి దిగివచ్చినవారు. అందువల్లనే బాపూసాహెబ్ జోగ్ శివునికి పెట్టినట్లుగా త్రిపుండ్రం (మూడు అడ్డ గీతలు) బాబా నుదుటి మీద
దిద్దేవాడు. బాబా నిలుచుని
ఉన్నపుడు ఆయన చేతులు పొడవుగా ఆయన మోకాళ్ళను దాటి ఉండేవి. ఆవిధంగా చేతులు మోకాళ్ళను దాటి ఉన్నవారిని
ఆజానుబాహువు అంటారు.
ప్రశ్న --- బాబా గారి దినచర్య గురించి వివరిస్తారా?
జవాబు --- ఉదయం 8 గంటలకు బాబా మసీదునుండి బయలుదేరి అడవిలో
10 గంటలవరకు తిరుగుతూ ఉండేవారు. ఆతరువాత భిక్షకు వెళ్ళేవారు. ఆయన గ్రామంలో ఉన్న నాలుగయిదు ఇండ్లకు మాత్రమే భిక్షకు వెళ్ళేవారు. ఇంటిముందు బాబా భిక్షకు వెళ్ళినపుడు
“మా భక్రియాన్” (అమ్మా కాస్త రొట్టె పెట్టు)
అనేవారు. భిక్ష తరువాత మసీదుకు తిరిగి వచ్చి ధుని వద్ద కూర్చొనేవారు.
ప్రశ్న --- ప్రజలు
మసీదులోకి యధేఛ్చగా ప్రవేశించేవారా లేక ఏమయినా నియమ నిబంధనలు ఉండేవా?
జవాబు --- ఎటువంటి తరతమ భేదాలు లేకుండా ప్రజలందరూ మసీదులోకి ప్రవేశించేవారు. మసీదులోకి అందరికీ అనుమతి ఉండేది.
ప్రశ్న --- బాబాకు ఉన్న అధ్బుతమయిన శక్తుల గురించి చెప్పగలరా?
జవాబు --- ఎంతోమంది భక్తులు బాబా వద్దకు వస్తూ ఉండేవారు. వారు బాబాతో తమ కష్టాలను,
సమస్యలను చెప్పుకుంటూ ఉండెవారు. “బాబా నాకు సంతానం లేదు, “నేను
ఒంటరిగా ఉన్నాను” ఇటువంటి సమస్యలను చెప్పుకుంటూ ఉండేవారు. ఆవిధంగా బాబాను తమ తమ కష్టాలనుండి
గట్టెక్కించమని కోరికలను తీరేలాగా తమను ఆశీర్వదించమని వేడుకొనేవారు. అపుడు బాబా తమ హస్తంతో వారిని దీవించేవారు. ఒకోసారి ఆయన సంతానం కోరి వచ్చిన స్త్రీని,
అనుగ్రహించినట్లుగా ఒక కొబ్బరికాయను ఇచ్చేవారు. త్వరలోనే ఆమె గర్భం దాల్చి ఒక బిడ్డకు
జన్మనిస్తుందని దాని అర్ధం.
ప్రశ్న --- బాబా మీతరఫున ప్రతినిధిగా గాని ఉన్నారా? బాబా మీకు ఏమవుతారు?
జవాబు --- (ఈ ప్రశ్నకు సమాధానం దాటవేసి ఒక కధను చెప్పారు) షోలాపూర్ నుండి సీతారామ్ మహదేవ్ అనే షాహుకారు షిరిడికి వచ్చాడు. ఆయన 40 కిలోల బరువు గల గణపతి విగ్రహాన్ని తీసుకువచ్చాడు. బాబా ఆవిగ్రహాన్ని తాకిన తరువాత ఆయన అనుగ్రహంతో ఆ విగ్రహాన్ని తన ఇంటికి తీసుకువెడదామనుకున్నారు. (ఉధ్ధవ్ తన ఇంటిలో ఉన్న ఆగణపతి విగ్రహాన్ని చూపించారు).
బాబా ఆవిగ్రహాన్ని తాకిన తరువాత, దానిని
తీసుకుని కాసేపు తమ పొట్టమీద పెట్టుకొన్నారు. ఆవిగ్రహాన్ని మరలా ఆషాహుకారయిన సీతారామ్
మహదేవ్ కు ఇవ్వకుండా మా తండ్రిగారయిన శ్యామా దేశ్ పాండెకు బహూకరించారు. ఆవిగ్రహాన్ని మాతండ్రిగారినే ఉంచుకోమని
చెప్పారు. ఇపుడు మీరు
చూస్తున్న ఆవిగ్రహం అదే మా ఇంటిలో ఇప్పటికీ ఉంది. (ఆ విగ్రహంవైపు చూపించారు.)
మేమెంతో భక్తి శ్రధ్ధలతో ప్రతిరోజు దానిని
పూజిస్తున్నాము.
ప్రశ్న --- బాబా మీకు ఏమేమి బోధించారు?
జవాబు ---
(నవ్వుతూ) ఏమీ బోధించలేదు. బాబా నన్ను మామూలుగా దీవిస్తూ ఉండేవారు. ఆయన నాకెప్పుడూ ప్రత్యేకంగా ఏమీ బోధించలేదు. మాతండ్రిగారు, శ్యామా బాబాకు కూడి భుజంగా ఉండేవారు. బాబాతో 40 సంవత్సరాలు
సన్నిహితంగా ఉన్నారు. మా తండ్రిగారు బాబాకు, భక్తులకు మధ్యవర్తిగా ఉండేవారు.
భక్తులకు ఎటువంటి కష్టాలు వచ్చినా బాబా శ్యామాతో వారికి సహాయం
చేయమని చెప్పేవారు.
ప్రశ్న --- బాబాగారు దక్షిణను స్వీకరించడంలో ప్రత్యేకమయిన
కారణం ఏమన్న ఉందా?
జవాబు --- బాబా తన భక్తుల వద్దనుంచి నిర్ణీతమయిన కొంత డబ్బు
దక్షణగా అడిగి పుచ్చుకొనేవారు. సాయంత్రమయ్యేటప్పటికి
బీదప్రజలందరికీ పంచేసేవారు. రోజులో ఎంత వస్తే
అంతా బీదవారికి పంచిపెట్టేసేవారు.
ప్రశ్న --- మీ తండ్రిగారికి ప్రత్యేకంగా ఏమయినా ఉపదేశించారా?
జవాబు --- లేదు, బాబా మానాన్నగారికి ప్రత్యేకంగా ఏమీ ఉపదేశించలేదు. మానాన్నగారు శ్యామా, బాబా ఊదీతో పాటు భక్తులకి మందులు
ఇచ్చేవారు.
ప్రశ్న --- మీనాన్నగారు వైద్యులా?
జవాబు --- ఆయన వైద్యులు కాదు. రోగులకు ఆయన ఆయుర్వేదమందులను ఇస్తూ ఉండేవారు. మందులతోపాటుగా బాబా ఊదీని కూడా ఇచ్చేవారు. బాబా మీద మానాన్నగారికి ఉన్న నమ్మకం వల్లనే మా నాన్నగారు
ఆవిధంగా ఇచ్చేవారు. మా నాన్నగారు మందులు ఇచ్చేటప్పుడు
సాయిబాబా నామస్మరణ చేస్తూ ఇచ్చేవారు అంతే.
రోగులు కూడా కోలుకొనేవారు. బాబా ఆయనను
ఆవిధంగా చేయమని చెప్పలేదు. ఆయనకు బాబామీద ఉన్న
నమ్మకమే ఆయనకు ఆవిధంగా చేయాలనిపించింది. మా
తండ్రిగారు శ్యామా మరణించేముందు, నన్ను సంస్థానం
నుండి పైసా తీసుకోకుండా బాబాకు సేవ చేయమని చెప్పారు. ఎటువంటి ఫలాపేక్ష (జీతం) లేకుండా బాబాకు ఉచిత సేవ
చేయమని చెప్పారు. మా నాన్నగారి మాట ప్రకారం
నేను సంస్థానం నుండి ఒక్క పైసా కూడా ఆశించకుండా నా జీవితమంతా 40 సంవత్సరాలపాటు సేవ
చేసాను. కేవలం సేవ మాత్రమే చేసాను. మా నాన్నగారు నాకు ఇచ్చిన సలహాను తూచా తప్పకుండా
పాటించాను. నేను చేయవలసిన ముఖ్యమయిన కార్యం
ఇదేనని మా నాన్నగారి కోరిక.
(మరికొన్ని సంభాషణలు రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment