26.01.2021
మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 35 వ.భాగమ్
(పరిశోధనా వ్యాస కర్త … శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
శివనేశన్ స్వామి చెబుతున్న వివరాలు…
తుకారామ్ --- ఈ వృత్తాంతమంతా ఎంతో అత్యధ్భుతంగా ఉంది అవునా? ఎంతో విలువయిన సమాచారాన్ని మనకందించారు. దాని అర్ధం ఏమిటంటే స్వామీజీ గారి ఆధ్యాత్మిక దాహాన్ని
సాయిబాబా మాత్రమే తీర్చగలరు. నీళ్ళు ఉన్నా
ఆయన త్రాగలేకపోయారు. ఆయన దాహాన్ని తీర్చి శాంతిని
కలిగించేది సాయిబాబా ఒక్కరే. స్వామీజీ ఆవిషయాన్ని
గ్రహించుకుని షిరిడి వదిలి వెళ్ళాలనే తన ఆలోచనను శాశ్వతంగా ఉపసంహరించుకుని ఇక్కడే ఉండిపోయారు. చాలా ఆసక్తికరంగా ఉంది.
మేము
ఆయన వద్దనుంచి శలవు తీసుకుని వెళ్ళబోతుండగా శివనేశన్ స్వామి ఇంకా మరికొన్ని విశేషాలు
చెప్పారు.
నాకే కాదు, ఇంకా ఎంతో మంది భక్తులకు ఆయన సశరీరంతో దర్శనమిచ్చారని ఆ భక్తులే నాతో స్వయంగా చెప్పారు. బాబా ఇప్పటికీ జీవించే ఉన్నారన్నదానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఢిల్లీనుంచి స్వాతి అనే వైద్యునికి చాలా జబ్బు చేయడం వల్ల మెరుగయిన వైద్యం కోసం లండన్ లొ ఉన్న ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళారు. కూడా ఆయన భార్య ఉంది. అక్కడి వైద్యుడు పరీక్షించి ఆయన చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారనీ, చనిపోవడానికి సిధ్ధంగా ఉన్నారని ఆయన భార్యతో చెప్పాడు. మీరు ఆయన శరీరాన్ని భారతదేశానికి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది అన్నారు. బాబా తను చెప్పిన పదకొండు వచనాలలో “నేను ఈ దేహాన్ని వీడినా నాభక్తులకు సహాయపడటానికి వారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాను”. అన్నది కూడా ఒకటి. అందువల్ల డా.స్వాతిగారి భార్య ఆ రోజు రాత్రంతా బాబా ఇచ్చిన ఈ అభయవచనాన్ని మననం చేసుకుంటూ “బాబా నువ్వు నీ భక్తులకు సహాయపడటానికి వస్తానని మాట ఇచ్చావు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నా భర్తను కాపాడు” అంటూ రాత్రంతా ప్రార్ధించుకుంటూ కూర్చుంది.
ఆరోజు రాత్రి బాబా అస్పత్రికి వచ్చారు. డా.స్వాతిగారు తన మంచం ప్రక్కనే ఒక బాబా ఫొటో, గురునానక్ ఫొటో రెండూ పెట్టుకున్నారు. ఆయన శిక్కు మతస్తులు. సాయిబాబాను ఆస్పత్రిలో సశరీరంగా ఒక నర్సుకు కనిపించారు. సాయిబాబా “మా అబ్బాయి ఎలా ఉన్నాడు?” అని నర్సుని అడిగారు. “ఆయన బ్రతకడం కష్టమె” అని నర్సు చాలా గంభీరంగా సమాధానమిచ్చింది. అప్పుడు బాబా “ఆయనకు నయమవుతుంది. ఆయన అదృష్టవంతుడు" అన్నారు. అక్కడ కాసేపు ఉండి ఆతరువాత వెళ్ళిపోయారు. ఆమరుసటిరోజు డా.స్వాతి గారు తాను బాగానే ఉన్నానని చెప్పారు. “క్రితంరోజు రాత్రి మీనాన్నగారు వచ్చారు. మీ ఆరోగ్యం గురించి అడిగారు” అని నర్సు చెప్పింది. అపుడు డా.స్వాతిగారు, “మా నాన్నగారా? ఆయన ఎలా ఉంటారు?” అని అడిగారు. నర్సు ఆయన మంచం ప్రక్కన ఉన్న ఫోటోను చూసి “ఆయనే వచ్చారు” అని చెప్పింది. అపుడు డా.స్వాతిగారు, ఆయన మా నాన్నగారు కాదు. ఆయన ఈ విశ్వమంతటికీ తండ్రి. ఆయన సాయిబాబా” అని చెప్పారు. డా.స్వాతిగారు ఈ అనుభవాన్నంతా వివరించారు.
ఢిల్లీకి వచ్చేముందు జరిగినదంతా విపులంగా వ్రాసారు. ఇటువంటి వాస్తవమయిన సంఘటనలు నేటికీ జరుగుతున్నాయి. బాబా సజీవంగానే ఉన్నారు. ఆయన తన భక్తులకు దర్శనమిచ్చి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. న్యూయార్క్ లో నామదేవ్ అనబడే రాబర్ట్ పింక్ గారు
ఉన్నారు. ఆయన కూడా సాయిబాబా గురించి ఒక పుస్తకం
వ్రాసారు. మొట్టమొదటిసారి ఆయన ఇక్కడికి వచ్చినపుడు
విరోచనాలతో బాధపడుతున్నారు. ఆయన నావద్దకు వచ్చి
తన బాధను చెప్పుకున్నాడు. కాసిని నీళ్ళలో ఊదీని
కలుపుకు త్రాగమని చెప్పాను. కాని ఆయన వద్ద ఊదీ లేదు. ఆయన టాయిలెట్ కి వెళ్ళి గదిలోకి తిరిగి
వచ్చారు. వచ్చిన తరువాత తన సంచీలో ఆయనకు ఊదీ
పొట్లం కనిపించింది. నాకావిషయం చెప్పారు. ఊదీని నీళ్ళలో వేసుకుని త్రాగారు. ఊదీ ప్రభావంతో ఆయనకు నయమయింది. అప్పటినుండి ఆయనకు ఇక్కడికి షిరిడికి రావడం మొదలుపెట్టారు. ఆయన ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండి బాబా జీవితంలోని
విషయాలన్నిటినీ సేకరించేవారు. ఆవిధంగా సేకరించి
ఆంగ్లంలో ఒక పుస్తకాన్ని కూడా రాసారు. న్యూయార్క్ లో ఎవ్వరినీ ధనసహాయం అర్ధించకుండా తన స్వంత డబ్బుతో ఆపుస్తకాన్ని ప్రచురిద్దామని ఆయన కోరిక. ఆవిధంగా ఎంతోమంది విదేశీయులు ఇక్కడికి
వస్తూ ఉంటారు. బాబా వారికి దర్శనమిస్తూ తన
భక్తులకు సహాయపడుతూ ఉన్నారు.
తుకారామ్ --- బాబా
తాను సమాధి చెందేముందు తను లేనని విచారించవద్దని అన్నారు. “నాకు మరణంలేదు. అందుచేత నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నానని
భావించకండి. నేనెప్పటికీ జీవించే ఉంటాను. నా భక్తులు కష్టాలలో ఉన్నపుడు వారినాదుకోవటానికి
నేనెప్పుడూ సిధ్ధంగా ఉండి పరిగెత్తుకుంటూ వస్తాను.” ఎవరయినా నన్ను శరణు వేడుకొన్నా
లేక సర్వశ్య శరణాగతి చేసుకున్నా రాత్రింబవళ్ళు నేను వారి చెంతనే ఉంటాను. నాభక్తులమీద నాదృష్టి స్థిరంగా ఉంటుంది. నేను వారిని జాగ్రత్తగా కాపాడుతాను” అన్నారు.
ప్రశ్న --- సాయిబాబా
ఇచ్చిన ప్రసిధ్ధమయిన వచనాలలో ఇదీ ఒకటా?
తుకారామ్ --- అవును. బాబా చెప్పిన పదకొండు వచనాలలో ఇది కూడా ఒకటి. ఇంగ్లాండుకు ఆపరేషన్ కోసం వెళ్ళిన వైద్యుని ఉదంతమే దానికి తార్కాణం. తన భక్తులను ప్రమాదంనుండి కాపాడటానికి బాబా తానే స్వయంగా మన ఊహకి అందకుండా ప్రకటితమవుతారు. ఉదాహరణకి డా.స్వాతిగారి విషయంలో జరిగిన అధ్భుతమయిన లీలను చెబుతాను. డా.స్వాతిగారికి అత్యవసరంగా క్లిష్టమయిన ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి. ఆయన లండన్ లో చాలా మంచి పేరున్న ఆప్సత్రిలో చేరారు. ఆయన పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండటం వల్ల ఆయనను ఐ.సి.యూ. లో ఉంచారు. అందులోకి ప్రవేశించడానికి ఎవరికీ అనుమతి లేదు. ఆరోజు రాత్రి విధినిర్వహణలో ఉన్న నర్సు ఒక వృధ్దుడిని చూడటం జరిగింది. ఆవృధ్ధుడు తానారోగి యొక్క తండ్రినని చెప్పాడు. తన కుమారునికి త్వరలోనే నయమవుతుందని అన్నాడు. కాని ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు అందరూ ఆరోగి కోలుకొనే అవకాశమే లేదని అన్ని ఆశలూ వదిలేసుకున్నారు. ఆ డాక్టరు కొద్ది గంటలలోనే చనిపోతాడనీ కోలుకోవడం అసాధ్యమని తేల్చేసారు. కాని సాధారణంగా ఐ.సి.యూ.లోకి ఎవ్వరినీ రానివ్వనప్పటికీ, ఈ కారణం చేతనే నర్సు ఆవృధ్దుడు ఐ.సి.యూ.లోకి వచ్చినా అడ్డు చెప్పలేదు. మరణించబోతున్న తన కొడుకుని ఆఖరిసారి చూద్దామనే ఉద్దేశ్యంతో భారదేశంనుండి తండ్రి వచ్చాడని నర్సు జాలి పడింది. “ఆయనను లోపలికి ఎందుకని వెళ్ళనివ్వకూడదు? అతని కొడుకు మరణించబోతున్నాడు. తన కుమారుని కడసారి చూసుకోవటానికి అతని తండ్రిని లోపలికి వెళ్లనిస్తే పోయేదేముంది” అని లోచించి అడ్డు చెప్పలేదు. కొద్ది నిమిషాల తరువాత ఐ.సి.యూ. గదిలో ఆవృధ్ధుడు ఏమి చేస్తున్నాడో చూద్దామని కిటికీలోనుండి చూసింది. ఆవృధ్ధుడు రోగి శరీరం చుట్టూరా నడుస్తూ తన చేతిని అతని శరీరంపై తిప్పుతున్నాడు. ఆవిధంగా మూడు నాలుగు సార్లు చేసాడు. ఆయన ఆవిధంగా తన చేతిని తిప్పడం చూస్తె మృత్యువును తొలగింపచేస్తున్న విధంగా ఉంది. అర్ధమయిందా? రోగి వద్దకు మృత్యువు రాకుండా ఈవిధంగా బాబా రక్షణ రేఖను సరిహద్దులా గీసి, ఆహద్దును దాటి మృత్యువు సమీపించకుండా కాపాడారు.
మరుసటిరోజు
ఆస్పత్రి సిబ్బంది వైద్యులు అందరూ వచ్చి చూసారు.
రోగి కోలుకొని తెలివిలోకి రావడం చూసి చాలా ఆశ్చర్యపోయారు. నర్సు ఆయనతో రాత్రి మీనాన్నగారు మిమ్మల్ని చూడటానికి
వచ్చారు. మీరు కోలుకుంటారని నమ్మకంగా ఎంతో
అశతో చెప్పారు. అంతేకాదు ఆయన అన్నట్లుగానే
మీరు చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు” అని చెప్పింది. డా.స్వాతి చాలా ఆశ్చర్యపోయి “పంజాబులో ఉన్న చిన్న
గ్రామంనుండి పాస్ పోర్టు, వీసా లాంటి అన్ని పనులను పూర్తి చేసుకుని మానాన్నగారు ఇంగ్లాండుకు
రావడం ఎలా సాధ్యం?” అని ఆలోచించారు. ఆస్పత్రికి
వచ్చిన ఆ వృధ్ధుడు ఎలా ఉంటారని నర్సుని అడిగారు.
నర్సు ఆయన తన కూడా తెచ్చుకున్న ఫొటోవైపు చూపించింది. డా.స్వాతి శిక్కు మతస్థుడు. ఆయన తనతో కూడా గురుగోవింద్, గురునానక్, ఇంకా తన
ఆరాధ్యదైవమయిన సాయిబాబా ఫొటోలను తెచ్చుకున్నారు.
నర్సుకి సాయిబాబా గురించి ఏమాత్రం తెలీదు.
కాని ఆయన మంచం ప్రక్కనే ఉన్న బల్లమీద ఉన్న సాయిబాబా ఫొటోవైపు వేలితో చూపిస్తూ
“నిన్న రాత్రి వచ్చినది ఆయనే” అని చెప్పింది.
దీనిని
బట్టి సాయిబాబా నేటికీ తన భక్తులను ఆదుకోవడానికి వస్తూ ఉంటారని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్షనిదర్శనమని
మనకి అర్ధమవుతుంది. బాబా తనకు ఎప్పుడు దర్శనమివ్వాలని అనుకుంటే అపుడు ఇస్తారు. ఆవిధంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం నేటికీ ఆయన ఎప్పటికీ సజీవులే అని మనం గ్రహించుకోవచ్చు.
0 comments:
Post a Comment