28.01.2021 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ
సాయి జయజయ సాయి
సాయి బంధువులకు
బాబా వారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనావ్యాస
గ్రంధము – 36 వ.భాగమ్
(పరిశోధనా వ్యాసకర్త
… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్
… ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – కోపర్
గావ్ -
షిరిడీ
శనివారమ్ – అక్టోబరు,
19, 1985
శివనేశన్ స్వామి
చెబుతున్న వివరాలు
ప్రశ్న --- చాలా
అధ్భుతమయిన విషయం చెప్పారు. ధన్యవాదాలు. నారాయణబాబా గురించి ఏమయినా చెప్పగలరా? ఆయన గురించి మీ అభిప్రాయం ఏమిటి?
తుకారామ్ --- చూడండి, బాబా తన భక్తులకు ఒక విధంగానో లేక మరొక విధంగా గాని ఎవరో ఒక వ్యక్తిద్వారా తన భక్తులకు సహాయం చేస్తారని నా అభిప్రాయం.
బాబా మిమ్మల్ని కూడా భక్తులకు సహాయపడటానికి ఒక మాధ్యమంగా ఎన్నుకున్నారు. మీరు ఒక విషయం ఊహించుకోండి. ఉదాహరణకి బాబా మీద్వారా నాకేదో పంపించదలచుకున్నారు. అపుడు బాబా మరొక వ్యక్తి రూపంలో మీవద్దకు వచ్చి మీకొక పాకెట్ ఇస్తారు. బాబా ఆవ్యక్తి ద్వారా మీచేత ఆపని చేయిస్తారు. మీరు బొంబాయి వెడుతున్నారు కాబట్టి నా చిరునామా ఇచ్చి నాకు, అంటే నగేష్కి ఇమ్మని ఆవ్యక్తి ద్వారా అందచేస్తారు. ఆవ్యక్తికి సహాయం చేయడానికి మీరు నాదగ్గరకి వచ్చి దానిని ఇవ్వడం గాని, పంపించడం గాని చేస్తారు. ఆంటే దీని అర్ధం మీరు సాయిబాబా అని కాదు. అయితే…
ప్రశ్న --- నాకర్ధమయింది. 1959 నుండి సాయిబాబా నారాయణ బాబా గారి ద్వారా మాట్లాడుతున్నారని
మీరు నమ్ముతున్నారా? తనకు నిగూఢమయిన స్వప్నదర్శనమో
అటువంటిదే మరొకటో కలిగిందనీ, అప్పటినుండీ బాబా తనను మాధ్యమంగా చేసుకున్నారని, తనద్వారా
ఆయన పలుకుతున్నారనీ నారాయణ బాబా తనకు తానే చెప్పుకోవడం జరిగింది.
తుకారామ్ --- నేను
ఆవిధంగా అనుకోవడంలేదు.
నేను (ఆంటోనియో)
--- సంస్థానంవాళ్ళకి ఈవిషయంలో నమ్మకం
లేదు. నేను నిన్న వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు దీనిని నమ్మరు.
తుకారామ్ --- నేను
కూడా నమ్మను. కారణం బాబా అన్నది ఏమిటంటే తాను
దేహాన్ని వీడినా తాను తన భక్తుల యోకక్షేమాలకోసం అప్రమత్తుడనే అని వెంటనే స్పందిస్తానని
చెప్పారు. బాబా ఆవిధంగా మనకు అభయమిచ్చి తన
మాటను నిలుపుకొంటున్నారు. ఆయన భక్తులు ఎప్పుడు
ఎక్కడ ఉన్నా సరే ఆయనను తలచుకున్న క్షణంలోనే వారి చెంత ఉంటున్నారు. తన భక్తుడు సప్తసముద్రాల అవతల ఉన్నాసరే తలచుకున్న
వెంటనే బాబా అక్కడ ఉంటారు. తన భక్తుల క్షేమం
కోసం తలచుకున్న వెంటనే బాబా తనే స్వయంగా తక్షణ సహాయం అందిస్తూ తన భక్తులను రక్షిస్తున్నపుడు
ఇక తాము బాబా అవతారులమని చెప్పేవారి గురించిన కధలను నమ్మనక్కరలేదనడానికి ఎటువంటి కారణం అవసరం
లేదు. బాబా ఇంకొకరి శరీరంలోకి ప్రవేశించారని,
వారిద్వారా పలుకుతారని చెప్పే కధలను నమ్మవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. వ్యక్తిగతంగా నేను కూడా ఇటువంటివి నమ్మను. ఎందుకంటే బాబా ఇచ్చిన మాట ప్రకారం ఆయన మనలోనే ఉన్నారు. అది మనకు అనుభవమే. నాకు బాబాతో కొన్ని అనుభవాలు కలిగాయి. మీకు తెలుసా, నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. నా సమస్యల గురించి నేనెప్పుడూ బాబాతో చెప్పుకుంటాను. ఉదాహరణకి నిన్న మధ్యాహ్నం నేను బొంబాయినుండి రెండు
గంటల బస్సుకు షిరిడీకి బయలుదేరాను. ఆబస్సు
ఎప్పుడూ సరిగ్గ సరైన సమయానికే బయలుదేరుతుంది.
నేను ఆబస్సు బయలుదేరే బస్ స్టాండుకు చేరుకోవడానికి ఇంకా రెండు మూడు మైళ్ల దూరంలో
ఉన్నాను. “బాబా నాకు ఆ బస్సు తప్పిపోకుండా
చూడు” అని బాబాను ప్రార్ధించుకున్నాను. దానికి
కారణమేమిటంటే నాతోకూడా షిరిడీ వద్దామని ఢిల్లీనుంఛి వచ్చినవాళ్ళున్నారు. బస్సు తప్పిపోతే నాకే కాదు వాళ్ళందరికీ కూడా చాలా
ఇబ్బంది కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమయినది
ఏమిటంటే పాపం వాళ్ళు ఎంతోదూరంనుండు వస్తున్నారు.
వారికి ఈ బస్సు అందకపోతే తీవ్రనిరాశకు గురవుతారు. వారికి అటువంటి కష్టం రావడం నాకిష్టంలేదు. ఈ కారణం వల్లనే నేను బాబాను ప్రార్ధిస్తూ ఉన్నాను. “బాబా బస్సును
తప్పిపోనివ్వకు”. మేము ఎనిమిది నిమిషాలు
ఆలస్యంగా చేరుకున్నప్పటికీ బస్సు అప్పుడే బయలుదేరుతూ ఉంది. నేను బస్సు డ్రైవర్ తో , మేము ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం
వల్ల సమాయానికి రాలేకపోయామని మా ఆలస్యానికి
గల కారణం చెప్పాను. డ్రైవరు మాబాధని అర్ధం
చేసుకుని బయలుదేరుతూ ఉన్న బస్సుని ఆపాడు. మేమందరం
బస్సు ఎక్కాము. ఇదంతా బాబా చేసిన సహాయమే. మనం ఆయనని తలచుకోవాలి. అందువల్ల నేను చెప్పేదేమిటంటే బాబా మనతోనే ఉన్నప్పుడు
మనం ఆయనతో నేరుగా మాట్లాడవచ్చు. బాబా తన భక్తులకు
వెంటనే సహాయం చేస్తారు. ఆయన తన భక్తులు తలచిన
వెంటనే సహాయం చేస్తున్నపుడు ఇక మధ్యవర్తులను సంప్రదించడంలో అర్ధం లేదు.
ప్రశ్న --- అయితే
నారాయణబాబా ఒక సామాన్యమయిన భక్తుడె అని మీ అభిప్రాయమా? సంస్థానంవారు కూడా అదే అన్నారు. బాబా బోధనలను వ్యాప్తిచేయడానికి ఆయన తరచూ షిరిడీ
వస్తుంటారని కొందరు చెబితే విన్నాను.
తుకారామ్ --- తాము
సాయి అవతారమని చెప్పుకునేవారు , అలాగే తాము బాబాకు ప్రతినిధులమని చెప్పుకునేవారు
కూడా బాబానామస్మరణే చేసుకోమనీ, ఆయననే తలచుకుంటూ ఉండమనీ, ఆయనకు శరణాగతి చేసుకోమని అందరికీ
చెబుతారు. ఇపుడు స్వామీజీ చేస్తున్నట్లుగానే
నేను కూడా అందరికీ చాలా సులభమయిన రీతిలో చెబుతాను..”సమాధిమందిరానికి వెళ్ళండి, ద్వారకామాయికి
వెళ్ళండి, అన్నివిషయాలు బాబాకు చెప్పుకోండి, ఆయన నామాన్నే స్మరించుకుంటూ ఉండండి మీకు
నిశ్చింతగా ఉంటుంది, మీ కష్టాలన్నీ దూరమవుతాయి.”
అలాగే స్వామీజీ కూడా తన దగ్గరకు వచ్చినవారందరికీ కూడా ఇదే చెబుతారు. వారందరికీ ఉపశమనం లభిస్తుంది. స్వామీజీ తన దగ్గరకు వచ్చినవారితో “ఎవరయితే మనఃపూర్వకంగా
బాబాకు దగ్గరగా ఉంటూ ఆయనను ప్రార్ధించుకుంటారో, ఆయననే హృదయపూర్వకంగా శరణాగతి వేడుకుంటారో,
బాబా ప్రతివిషయంలోనూ వారి యోగక్షేమాలను కనిపెట్టుకుని ఉంటారు. నేను కాదు, మీ సమస్యలను తీర్చేది. ద్వారకామాయికి
వెళ్లమని అందరికీ చెబుతూ ఉంటాను. దాని అర్ధం
ఏమిటంటే నేను బాబాకు ప్రతినిధిని కాను. నేనుకూడా
మీలాగే ఒకడిలా ఇక్కడ ఉన్నాను. బాబాను ప్రార్ధించేది
అన్నీ చేసేదీ మీరే”.
ప్రశ్న --- ఆ విధంగా
మీ అభిప్రాయం ప్రకారం భక్తులే తమ శ్రధ్ధ, సబూరీల ద్వారా స్వయంగా బాబాను సహాయం చేయమని,
తమ విషయంలో జోక్యం చేసుకుని ఆదుకోమని ఆయనను నిర్బంధించినట్లుగా ప్రార్ధించుకోవాలి అవునా?
తుకారామ్ --- అవును. మీరు, బాబా ఇద్దరే ఉంటారు. మధ్యలో ఎవరూ ఉండరు. తాము అవతారులమని, ప్రతినిధులమని చెప్పుకునేవారు
మన సమస్యలని మరింత జటిలం చేస్తారు. ప్రజలను
అమాయకులను చేసి వారిని గందరగోళంలో పడవేయడం చాలా సులభం. బాబా షిరిడిలోనే ఉన్నపుడు ఇక తామే బాబా అవతారములని
చెప్పుకునేవారి వద్దకు వెళ్లడమెందుకు? అవసరం
లేదు. ఆయన తమ దేహాన్ని వీడినందువల్ల మనమాయనను
చూడలేకపోయినా ఆయన నిరాకారంగా ఇక్కడె ఉన్నారు.
ధన్యవాదాలు
(దీనిని బట్టి సాయిభక్తులందరూ గ్రహించుకోవలసిన ముఖ్యమయిన విషయం మనలోనే బాబా ఉన్నారని మనం నమ్ముతున్నప్పుడు ఎవరయిన తమకు తామే బాబాకు ప్రతినుధులమని, స్వామీజీలమని చెప్పుకునేవారిని సంప్రదించడం భావ్యం కాదని గ్రహించుకోవాలి. మనము, బాబా అంతే. ఆయనతోనే మన విషయాలన్నీ చెప్పుకుంటే అన్నీ ఆయనే చూసుకుంటారు. త్యాగరాజు).
(ఇంకా ఉంది)
(రేపటి సంచికలో సాకోరీలో టిప్నిస్ గారితో జరిపిన సంభాషణ)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment