18.10.2021 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
షిరిడీ ప్రయాణానికి బాబా చేసిన సహాయమ్ -2 భాగమ్
మరాఠీ నుండి ఆంగ్లానువాదమ్
శ్రీమతి
మీనాల్ తుషార్ దేశ్ పాండే దాల్వి
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
భీమాపాటిల్ గురించిన సమచారాన్నిచ్చిన వ్యక్తి ఒక పోలీసు. మేము మా పరిస్థితిని, మా ప్రయాణం గురించి చెప్పినదంతా విని, “అయ్యా ప్రధాన్
గారు, మీరు నన్ను గుర్తు పట్టలేదు. కాని నాకు మీరు తెలుసు. మీరు ఖడ్కే బంగళాలో ఉన్నపుడు నా పైఅధికారి
మీసేవ కోసం నన్ను పంపించేవారు. ఇక్కడినుండి జున్నర్ 7 మైళ్ళ దూరంలో ఉంది. కాని భీమశంకరానికి రోడ్డు మార్గం చాలా ప్రమాధకరంగా ఉంటుంది. అసలే ఇది రాత్రి సమయం. మీతో పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడికి దగ్గరలోనే పోలీసువారి క్వార్టర్స్ ఉన్నాయి.
ఇక్కడికి పోలీసు వారు వచ్చిన తరువాత వాళ్ళే అన్నీ చూసుకుంటారు.”
అన్నాడు.
మేము ఇన్స్పెక్ క్షణ్ బంగళాలో బస చేయడానికి
ఒక పోలీసు వ్యక్తిని నియమించాడు. అతను
మాకు భోజన ఏర్పాట్లన్నీ చేసిన తరువాత, “మీరు సుఖంగా
నిద్రించండి, రేపు ఉదయం ఏమేమి ఏర్పాట్లు చేయాలో అన్నీ చేస్తాము”
అన్నాడు. భోజనాలు చేసిన తరువాత మేమందరం హాయిగా నిద్రించాము. పోలీసు వ్యక్తి వెళ్ళేముందు తన సేవకుడితో
మా సామానులన్నిటినీ బాగా సర్దిపెట్టి బస్సులో పెట్టమని చెప్పాడు. బంగళాలోని కాపలా వ్యక్తిని పిలిచి
ఉదయాన్నే మాకేమి కావాలో అన్నీ అడిగి ఏర్పాట్లు చేయమని,
స్నానానికి వేడినీళ్ళు సిధ్ధం చేయమని చెప్పాడు. ఆసేవకుడు ఉదయాన్నే తనకు ఇచ్చిన ఆదేశాలన్నీ
మాకు వివరించాడు. మా
సామానులన్నీ చక్కగా సర్దేసి ఉంచడం వల్ల అన్నిటినీ ఉన్నవి ఉన్నట్లుగా బస్సులో పెట్టుకోవచ్చనుకున్నాము. ఉదయాన్నే ఆవిధంగా సామానులను పెడుతున్న సమయంలో ఒక బ్రాహ్మిన్ మాకు ఉదయం పలహారాలను తీసుకువచ్చాడు. మేము స్నానం చేసి టీ త్రాగి,
అతను తెచ్చిన ఫలహారాలను తిన్న తరువాత అందరం బస్సులోకి
ఎక్కి కూర్చున్నాము. ఒకవేళ దారిలో మరలా బస్సుకి పంక్చర్ అయితే రిపేరు చేయడానికి అవసరమయిన పనిముట్లను
కూడా సిధ్ధం చేసుకుని ఉంచుకున్నాము.
శనివారం ఉదయం మాకు సహాయంచేసిన పోలీసు
వ్యక్తినుండి కృతజ్ఞతాపూర్వకంగా శలవు తీసుకుని, గం.8.30 కు నారయణగావ్
నుండి బయలుదేరాము.
అక్కడినుండి నేరుగా ఖేడ్ చేరుకున్నాము. అక్కడివరకు
బస్సుకు పంక్చర్ పడకుండా ప్రయాణం జరిగింది. కాని కొన్ని మైళ్ళు ప్రయాణించిన తరువాత బస్సుయొక్క స్ప్రింగ్ విరిగిపోయింది. మేము భీమశంకర్ వెళ్లనందుకు మాకు మేమే
తెలివయిన నిర్ణయం తీసుకున్నామని సంతోషించాము. కాని, ఇపుడు
ముందుకు ఎలా ప్రయణించాలి? సరిగ్గా ఆసమయంలోనే దగ్గరలో ఉన్న పొలంలో ఒక కమ్మరివాడు కనిపించాడు.
అదిచాలా మారుమూల ప్రాంతం. కనుచూపు మేరలో జనసంచారమే కనిపించదు. అటువంటి ప్రదేశంలో మా బస్సు ఆగిపోవడం,
ఆవెంటనే మాకు ఒక కమ్మరివాడు కనిపించడం, మాకోసమే
బాబా అతనిని పంపించారా అని మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. తలచుకుంటే ఈ సంఘటనలన్నీ చాలా అధ్భుతంగాను,
ఊహింపనలవిగాను అనిపించాయి.
ఆకమ్మరివాడు విరిగిన స్ప్రింగ్ ను తాత్కాలికంగా బాగుచేసాడు. మేము రాత్రి 8 గంటలకి తాలేగావ్ చేరుకున్నాము.
అక్కడినుంచి రైలులో ప్రయాణం కొనసాగిద్దామని అనుకున్నాము. స్టేషన్ లో వివరాలు అడిగిన మీదట రాత్రి
ఒంటిగంట దాటిన తరువాత రైలు ఉన్నదని,
ఆతరువాత మరుసటిరోజు ఉదయం 8 గంటలకు ఉందని
చెప్పారు.
ఈ విధంగా మేము స్టేషన్ లో వివరాలు కనుక్కుంటున్న సమయంలో మా బస్సు డ్రైవరుకు
పరిచయం ఉన్న ఒక ముస్లిమ్ మెకానిక్ అనుకోకుండా అక్కడికి వచ్చాడు. ఎప్పుడయినా బస్సుకి ఏవిధమయిన సమస్య
వచ్చినా, బస్సు చెడిపోయినా అతను బాగుచేస్తూ ఉంటాడు. అదే సమయంలో బాబూరావు మహదేవ్ భలేరావు
సైకిలు తొక్కుకుంటు అక్కడికి వచ్చాడు. అతను యువకుడు మరియు రాత్రివేళల్లో
గస్తీ తిరుగుతూ ఉంటాడు. అతను మాబస్సు వద్దకు వచ్చి రాత్రికి మమ్మల్ని తన ఇంటిలో ఉండమని చెప్పాడు. మెకానిక్ కూడా బస్సుకు క్రొత్త స్ప్రింగ్ వేస్తానని, ఉదయానికల్లా బస్సు తిరిగి ప్రయాణించడానికి సిధ్ధంగా ఉంటుందని అన్నాడు.
మేము తాలేగావ్ లో బస చేసాము. భలేరావుగారి ఇంటి ఎదురుగా సంత్ తుకారామ్ నిర్మించిన విఠల్ మందిరం ఉంది. మేము ఆ దేవునికి నమస్కరించుకుని భోజనాలు చేసాము.
ఆ తరువాత హాయిగా నిద్రపోయాము. ఉదయం తాలేగావ్ బజారుకు వెళ్ళి మాకు కావలసినవి కొనుక్కున్నాము. అప్పటికి మా బస్సు బాగుపడి సిధ్ధంగా ఉంది. మేము తాలేగావ్ నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరాము. భలేరావు మాకూడా సైకిల్ మీద వచ్చాడు. ఒక మైలు దూరంలో గ్లాస్ కర్మాగారం ఉంది. మేము ఆ కర్మాగారంలోకి వెళ్ళి అన్నీ చూసాము. భలేరావు చాలా మంచి మనిషి, మర్యాదస్తుడు. ఆయన ప్రవర్తన ఒక సాదువులాగా ఉంది. అతను మావద్ద శలవు తీసుకుని వెళ్ళిపోయాడు. 11 గంటలకు మేము ఏకవీర ఆయి దేవాలయం ఉన్న కొండదిగువ ప్రాంతం వద్దకు చేరుకున్నాము.
మేము కొండఎక్కి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఆలయం పూజారి మాతో కూడా వచ్చాడు. అయనను లోనావాలాలో దిగబెట్టాము.
ఇక్కడినుంచి మా ప్రయాణం చాలా సాఫీగా
జరిగింది. బోర్ ఘాట్ ను దాటి పాన్వెల్
చేరుకున్నాము. బస్సుకు
కొత్తగా వేసిన స్ప్రింగ్ బాగా పనిచేసింది.
మెషీన్ లోకి పెట్రోలు ఒక్క చుక్క కూడా కారలేదు. ఉదయం 6 గంటలకి
మేము మరలా చిక్కుకుపోయాము. మేము ఘంటలీ వచ్చేటప్పటికి ఉదయం 8 గంటలయింది. అక్కడ దర్శనం చేసుకుని చివరికి రాత్రి 10 గంటలకి
శాంతాక్రజ్ వచ్చి ఇండ్లకు చేరుకున్నాము.
తిరుగు ప్రయాణంలో తెలిసిన విషయం. మా బస్సు యజమానితో శతృత్వం ఉన్న వ్యక్తి బస్సు యజమానిని
ఇబ్బందులకు గురిచేద్దామనే ఉద్దేశ్యంతో కుట్రపన్ని బస్సు ఇంజన్ లో
చాలా మార్పులు చేశాడు. కాని బస్సు డ్రైవరు
అప్రమత్తత వల్ల, అతను కూడా సాయిబాబా భక్తుడవడం వల్ల పైన చెప్పిన విధంగా ఎక్కడ ఏ ఇబ్బంది
కలిగినా అన్నిటినీ బాగుచేసి తిన్నగా బస్సును షిరిడీకి చేర్చాడు. సాయిబాబా మమ్మల్నందరినీ సురక్షితంగా ఇంటికి చేర్చారు.
బస్సు బయలుదేరిన దగ్గరనుంచి తిరిగి ఇండ్లకు చేరడానికి 8 రోజులు
పట్టింది. ఈ ఎనిమిది రోజులు సాయిబాబావారి సుదర్శన
చక్రం మాకు రక్షణకవచంగా రక్షణనిచ్చింది. లేకపోయినట్లయితే
మా బస్సుకు ఘోరమయిన ప్రమాదం జరిగి ఉండేది.
బస్సు నామరూపాలు లేకుండా నుజ్జునుజ్జయి ఉండేది.
ఇదే బస్సుని బొంబాయిలోని వర్క్ షాపులోనే కనక బాగుచేయించినట్లయితే
దానికి 3 గాలన్ల పెట్రోలు అవసరమయేది. (ఒక గాలను = 3.785 లీటర్లు). ఈ విధంగా మా ప్రయాణానికి
125 గాలన్ల పెట్రోలు ఖర్చయిఉండేది. కాని మా
బస్సు ప్రయాణానికి 35 గాలన్ల పెట్రోలు మాత్రమే అయింది. శ్రీ సాయిబాబావారి అధ్భుతాలు అగమ్యగోచరం. మా ప్రయాణంలో ప్రతిక్షణం ప్రతిచోట మాకు అనుభవమయింది. మేమందరం ఆయనను కీర్తిస్తూ ప్రయాణ సమయాన్నంతా గడిపాము.
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment