24.08.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 11
101. కర్మ సిధ్ధాంతము నమ్ము. నీ కర్మలను నీవు సక్రమముగా నిర్వర్తించు. ఫలితమును నీవు ఆశించవద్దు. అప్పుడే నీకు సుఖశాంతులు లభించుతాయి.
- 03.08.93
102. నీవు భగవంతుని పెంపుడు కుక్కవి.
నీళ్ళు త్రాగి నీప్రాణాన్ని నిలుపుకోమని నీయజమాని ఆజ్ఞయితే నీయజమానిపై విశ్వాసముతో, సంతోషముతో ఆనీరు త్రాగి నీప్రాణాన్ని నిలబెట్టుకో.
- 10.08.93
103. వైద్యరంగములో విలువలేని పుచ్చకాయను నీవు నాకు నైవేద్యముగా పెట్టినా నేను ప్రేమతో అంగీకరించుతాను.
- 10.08.93
104. రోజూ తినడానికి శనగలను సంపాదించాలి. ఆనపగింజలను జాగ్రత్తగా నాటి పాదును పెంచి ఆనపకాయలు కోసిన తర్వాత వాటిని అమ్మి డబ్బు సంపాదించి తినడానికి శనగలు కొనాలి. అంతే గాని ఆనపగింజలు కొనడానికి దాచిన డబ్బుతో శనగలు కొని జీవితములో చికాకులు సృష్ఠించుకోకు.
- 11.08.93
105. నీవు ప్రజాసేవ, ప్రజలకు సహాయము చేయదలచుకొంటే నీదగ్గర ఉన్నవసతి, వనరులతో చేయి. అంతేగాని అదిలేదు, యిదిలేదు అంటూ వ్యర్థ ప్రసంగాలు మాత్రము చేయవద్దు.
- 29.08.93
106. నాకోసము తయారు చేసిన నైవేద్యము నాకు పెట్టకుండా నాపూజలో మునిగిపోయి, ఎవరో చచ్చి ఆ నైవేద్యాన్ని ఎంగిలి చేసినారని ఆవ్యక్తిను దూషించినావే - ఆదూషణలను స్వీకరించినది నేనే. మరి యిపుడు చెప్పు ఆనైవేద్యాన్ని తిన్నది ఎవరు?
- 02.09.93
107. మంచి పూలచెట్ల విత్తనాలను (మంచి విషయాలు) నీమిత్రుడు అడగకపోయినా అతనికి యిచ్చినా మంచిదే. కనీసము అతను వాటిని దూరముగా తీసుకొని వెళ్ళి విసిరివేస్తాడు. అక్కడ అతనికి తెలియకుండానే మంచి పూలచెట్లు మొలచి మంచి పూలు పూస్తాయి.
- 10.09.93
108. ఉన్నత పదవులలో ఉన్నవారు మంచిని చేసిన, చెడు చేసిన సంఘములోని వారు అందరు మంచిని, చెడును గుర్తించుతారు. సామాన్య మానవుడు మంచి చేసిన చెడు చేసిన ఎవరు గుర్తించరు. నీవు మాత్రము మంచి చెడులను గుర్తించి మంచిని స్వీకరించి చెడును వదలివేయి.
- 12.09.93
109. ఎంతటి తెలివియున్న మనిషి అయిన అక్రమ సంపాదనకు అలవాటు పడితే ఏదోఒకరోజున బయటపడక మానదు ఆవ్యవహారం. దాని తర్వాతనే అతనికి కలుగుతుంది నిజమైన తెలివితేటలు.
- 22.09.93
110. కాలము అనే పాఠశాలలో సాయిమాస్టర్ క్లాసులో చేరటానికి విద్యార్ధులకు వయసుతో పనిలేదు. కులమతాల ప్రసక్తిలేదు.
- 28.09.93
(యింకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment