09.08.2012 శుక్రవారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
పిలచిన పలికే దైవం
మన బ్లాగులో సాయి బంధువులకు ఒక విన్నపం అని ఎవరికయినా బాబా అనుభూతులు, లీలలు జరిగిఉంటే నాకు మైల్ చేయమని రాశాను. దానికి స్పందిస్తూ ఈ రోజు సాయి బంధు వహీదా గారు తమ అనుభవాన్ని తెలుగులోనే రాసి నాకు పంపించారు. దానిని యధాతధంగా మీకు అందిస్తున్నందుకు చాల సంతోషంగా ఉంది. నిజంగా సాయినాధులవారు వహీదాగారిని 9 గురువారముల వ్రతం చేయమని తేదీ తానే సూచించడం, వ్రతానికి సిధ్ధంగా తనే రావడం చాలా అద్భుతమైన లీల. పిలిచిన పలికే దైవము అంటే మనసాయినాధుడే అని భక్త సులభుడు అని మనకందరకూ తెలిసిన విషయమే. ఈ లీల చదివిన తరువాత మన నమ్మకం మరింతగా ద్విగుణికృతమవుతుంది.
సాయి భక్తులు ఎవరయినా సరే తమ అనుభవాలను పంపించండి. తెలుగులోనే పంపించాలనుకునేవారు lekhini.org ద్వారా పంపించవచ్చు. సైట్ ఓపెన్ చేస్తే తెలుగులో ఎలా పంపించాలో మీకే అర్ధమవుతుంది. లేకపోతే ఇంగ్లీషు లో పంపినా సరే నేను మార్చి ప్రచురిస్తాను.
ఆసాయినాధుడు, సాయిబంధు వహీదాగారికి ఎల్లప్పుడు ఆశీర్వాదములు అందచేయమని కోరి ప్రార్ధిస్తూ, ఆమె పంపిన లీలను ప్రచురిస్తున్నాను. ఇక చదవండి.
సాయి బంధువులందరికీ సాయి రామ్
మీకు నా జీవితం లో క్రితం గురువారం నాడు జరిగిన గొప్ప లీలను పంచుకోవాలనే ఆశతో ఇలా మెయిల్ చేస్తున్నాను. మీరు ఈ లీలను గురించి మన బ్లాగు లో ప్రచురించగలరని ఆశిస్తున్నాను.
నా పేరు వహిద, నేను నా తల్లిదండ్రులతో కర్నాటకలోని బళ్ళారి జిల్లా హోసపేట తాలూకా కమలాపురం లో నివసిస్తున్నాను. నేను ఒక ఆడిటర్ దగ్గర పని చేస్తున్నాను. సాయినాథుని భక్తురాలిగా అయన బిడ్డగా నన్ను నేను పరిచయం చేసుకునెందుకు చాలా సంతోషంగా ఉంది.
నాకు ఊహ తెలిసినప్పటి నుండి సాయిబాబా ను అందరు దేవుళ్ళలాగే కొలిచేదాన్ని. స్వామి అంటే చిన్నప్పటి నుండి ఇష్టం.
క్రితం సంవత్సరం స్వామి పాదాలకు నా జీవితాన్ని సర్వశ్య శరణాగతి చేశాను. నా జీవితం లో బాబా అన్నిరకాలుగా సాయి నాతో నే ఉన్నాడు అనే మాట చాలా సంతోషాన్ని ఇస్తోంది.
ఆగస్ట్ 2 , 2012 నాడు జరిగిన లీల
దాదాపు చాలా రోజులనుండి సాయినాథుడు నాకు ఏదో రూపంలో 9 గురువారముల వ్రతమును చేయమని చెప్తున్నాడు. కానీ నాకది అర్ధం కాలేదు. చివరికి నేనే నా ఫ్రెండ్ తో వ్రతం చేయాలా? వద్దా? అని 2 చీటీలు వేయించాను. స్వామి నన్ను వ్రతం చేయమని ఆదేశించాడు. ఏ రోజు చేయాలి అనేదాని గురించి మళ్లీ సందేహంలో పడ్డాను. జులై 26 న చేయాలనీ అనుకున్నాను, కానీ జులై 28వ తారీఖున మా ఫ్యామిలి ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది వివాహం ఉంది వాళ్ళ ఇంటికి మేము వెళ్ళవలసి ఉంది. అందుకు కూడా బాబా ని జులై 26 మరియు ఆగస్ట్ 2 అని రెండు చీటీలు వేసి అడిగాను అందుకు బాబా ఆగస్ట్ 2 వ తారీఖున వ్రతాన్ని మొదలు పెట్టమని చెప్పారు. స్వామిని వ్రతానికి రమ్మని ఆహ్వానించాను. స్వామి అసలు వస్తారా అనే ఆలోచన నన్ను పట్టి పీడిస్తునే ఉంది. నా ఆలోచన అంతా స్వామి 9 వ గురువారము నాడు వస్తాడు అనే ఆలోచన ఉంది కానీ ఏ రూపములో అనేది మాత్రం తెలియలేదు. అంతా ఆయనదే భారం అని అ విషయం గురించి మరిచిపోయాను.
వ్రతానికి ముందు రోజు సాయంకాలం మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి రఘు అని బెంగళూరు నుండి వచ్చాడు. తను రాఖి పండగనాడు తనకు రాఖి కట్టమని అడిగాడు. అందుకు నేను సరే అన్నాను. కానీ నా దగ్గర రాఖి కొనడానికి డబ్బు లేదు. కానీ ఏప్రిల్ లో మేము షిరిడికి వెళ్లి వచ్చాము అక్కడినుండి తెచ్చిన ఒక దారము నా దగ్గర ఉంది. దానినే రాఖిగా కట్టాలని అనుకున్నాను.
మరుసటి రోజు ఉదయాన 6 గం|| లకు పూజకు అంతా సిద్దం చేసుకుంటుండగా తను వచ్చాడు. తనకు రాఖి కట్టాలని స్వామి దారం తీసుకున్నాను. స్వామి ఆశీర్వాదం తో అతనికి రాఖి కట్టాను. నాకెందుకో తెలిదు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అతను నాకు ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చాడు తెరిచి చూడమన్నాడు. సరే అని తెరిచి చూసేసరికి నా కళ్ళలో నీళ్ళు, సంతోషం పట్టలేకపోయాను. నాకు గిఫ్ట్ రూపములో సాయినాథుడు ఇత్తడి విగ్రహము రూపము లో వచ్చాడు.
స్వామిని వ్రతములో పెట్టి గంధము పువ్వులతో అలంకరించి వ్రతమును ఆచరించాను. నామనసులో ఒక్కొక్క మాట గుర్తుకు వస్తూనే ఉన్నది గురు పౌర్ణమి నాడు నాకు ఏదైనా ఒక సందేశమును ఇవ్వమని అర్ధించగా 18 - 19 వ అధ్యాయమునందున్నసందేశము ఇచ్చారు. అదేమంటే గురు పాదములపై అచంచలమైన భక్తిని కలిగి ఉండుట మంచిది మరియు రెండో సందేశముగా 40 వ అధ్యాయమునందున్న లీలను చూపి త్వరలో నాతో వ్రతము ఆచరింపజేసి మాటకు కట్టుబడి నాతో వ్రతాన్ని చేయించడానికి స్వామియే విగ్రహ రూపములో మా ఇంటికి వచ్చాడు.
అన్నింటికంటే గొప్ప విచిత్రమో లీలో ఏంటి అంటే ఆయనే వ్రతాన్ని చేయమనడం, అందుకు ఆయనే తేదిని ఖరారు చేయడం వ్రతమును ఆరంభించక ముందే తానుగా వచ్చి వ్రతములో కుర్చుని 9 వ గురువారమునాడు వస్తాడేమో అనుకున్న స్వామి మొదటి వారమునుండే తానుగా నాతో వ్రతము చేయిస్తున్నాడు అన్న ఆలోచన నన్ను ఆనంద భాష్పాలలో ముంచివేస్తోంది. అనుక్షణము నేను అయన నాతో ఉన్నట్టే అనిపిస్తుంది నాకు తెలుసు సాయి నాతో ఉంటాడు. ఈ లీలను విన్న వాళ్ళందరికీ ఆనందమే కలిగింది
బాబా నాతో ఎప్పటికి ఉండు. నీ ఆశీర్వాదములకంటే గొప్ప ఆస్థి నాకేది లేదు ఇది సత్యం.
నిజముగా అయన "పిలిచిన పలికే దైవమే" అయ్యాడు. అనుక్షణము నన్ను కంటికి రెప్పలా కాచుకునే తండ్రి.
సాయి బంధువులందరికీ నా మాటగా చెప్పేది ఏమంటే నమ్మకము భక్తి ఓర్పుతో ఎదురుచూస్తే కనులు మూసి తెరిచేలోపు స్వామి మన చెంతనే ఉంటారు మన నీడ అయినా వదలి పోతుందేమో గాని స్వామి మన ఊపిరిలో ఉనికి. ఆయనే మన శాంతికి చిరునామా.
జై సాయి రామ్
సర్వే జన సుఖినోభవంతు
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment