19.07.2016
మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
గురుపౌర్ణమి
శుభాకాంక్షలు
శ్రీసాయిబాబా
వారి బోధనలు మరియు తత్వము
(4) వాక్కు 1వ.భాగమ్
ఆంగ్ల
మూలం : లెఫ్టినెంట్
కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
“ఎప్పుడయితే
నువ్వు బంధాలను, వ్యామోహమును పోగొట్టుకొని, రుచిని జయించెదవో, యాటంకములన్నిటినీ కడిచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు
సన్యాసముము బుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యెదవు” అని
సాయిబాబా బాపూ సాహెబ్ జోగ్
తో అన్న మాటలు. (అధ్యాయం 44)
బాపూ
సాహెబ్ జోగ్, బాబాతో “నేనిన్ని సంవత్సరములనుండి మీసేవ చేస్తున్నా నా
మనసు శాంతి పొందకుండా యున్నది. ఆత్మసాక్షాత్కారమునకై
నేను చేయు ప్రయత్నములన్నీ నిష్ప్రయోజనమగుచున్నవని”
అన్నపుడు బాబా పైవిధముగా సమాధానమిచ్చారు. సాయిబాబా
ఎల్లప్పుడు మనకు ఆనందాన్ని, సుఖాన్ని
కలుగజేసే లైంగికావయవాలని, నాలుకను అదుపులో పెట్టుకోవాలని నొక్కి చెపుతూ ఉండేవారు. లైంగికావయవాలు
అందించే సుఖాలను గురించి మనము తరువాతి అధ్యాయములో
తెలుసుకొందాము. నాలుక
రెండు పనులు చేస్తుంది – రుచిని
ఆస్వాదించుట, మాటలాడుట. ఆహారాన్ని
నాలుక రుచిని ఆస్వాదించడం గురించి మనం ఇంతకుముందే తెలుసుకొన్నాము. ఇపుడు
మనం వాక్కు గురించి బాబా ఏమని బోధించారో
తెలుసుకొందాము.
వాక్కులో
పరుష పదాలు :
మన
ప్రాచీన గ్రంధాలు, వేదాలలో అహింస గురించే చాలా ప్రముఖంగా చెప్పబడింది. ఇక్కడ అహింస అనగా దాని అర్ధం మనం ఎవ్వరినీ కూడా
శారీరకంగా గాని, మానసికంగా గాని, మాటలతో హింసించకూడదు. పైన చెప్పినవాటికన్నా పరుషంగాను, కఠినంగాను మాటలాడే
మాటలు శారీరకంగాను, మానసికంగాను, వీటికంటే ఎక్కువగా అవతలి వ్యక్తిని బాధిస్తాయి.
అటువంటి పరుష పదాలు ఎప్పటికీ అంత సులభంగా మరచిపోలేనివి. అంతే కాదు ఒకసారి మాట్లాడిన మాటలను తిరిగి వెనక్కి
తీసుకోలేనివి. పర్యవసానంగా అవి శాశ్వతమయిన ద్వేషానికి, పగకి కారణమవుతాయి. అందుచేతనే సాయిబాబా తన భక్తులకు “ఎవరితోనూ పరుషంగా
మాటలాడి వారి మనసును వెంటనే బాధపడేలా చేయవద్దు.
నీగురించి ఇతరులెవరయినా వంద మాటలు మాటలాడినా తిరిగి నువ్వు పరుషంగా జవాబు చెప్పకు. వీటినన్నిటినీ నువ్వు ఎల్లప్పుడూ భరిస్తే నువ్వెపుడూ
ఆనందంగా ఉంటావు. నేను చెప్పిన ఈసలహాని పాటించేలా
స్థిర నిర్ణయంతో మెలగుతూ ఉండు” అని సలహా ఇచ్చారు. (అధ్యాయం – 19)
అంతే
కాక బాబా తన భక్తులకు అనేకసార్లు చెప్పిన అమృతతుల్యమయిన మాటలు– “ ఎవరయితే ఇతరులమీద
కారణం లేకుండా తప్పులు ఎంచి, వారిమీద నిందారోపణలు చేయుదురో వారు నన్ను హింసించినవారగుదురు. ఎవరయితే బాధలనుభవించెదరో, ఓర్చుకొందురో వారు నాకు
ప్రీతిని కలుగజేసెదరు”. (అధ్యాయం – 44)
వాదములు
– వివాదములు:
నాలుకను
అదుపులో పెట్టుకోవడం గురించి బాబా ఇంకొక సలహానిచ్చారు. ఎవరితో కూడా ఏవిషయం గురించి గాని వాదనలు, వాడివేడి
చర్చలు పెట్టుకోకుండా వాటికి దూరంగా ఉండమని చెప్పారు. వాదోపవాదాలు అహంకారమునుండే పుట్టుకు వస్తాయి. ఈ వాదోపవాదాలే కలహాలకు దారితీసి శతృత్వాన్ని పెంచుతాయి.
రెండవ అధ్యాయంలో, ధబోల్కర్ షిరిడీ దర్శించిన మొదటి
రోజునే గురువుయొక్క ఆవశ్యకత గురించి బాలాసాహెబ్ భాటేతో తీవ్రమయిన వాదన పెట్టుకొన్నపుడు
బాబా, ధబోల్కర్ గారిలో ఉన్న వాదించే అలవాటును ఏవిధంగా మాన్పించారో మనకు గుర్తుండే ఉంటుంది. ఆసమయంలోనే బాబా ఆయనను ‘హేమాడ్ పంత్’ అని సంబోధించారు. (హేమాద్రిపంత్– 13 వ.శాతాబ్దంలో దేవగిరికి చెందిన
యాదవవంశ రాజులయిన మహదేవ్, రామ్ దేవలకు ప్రధానామాత్యుడు).
ఇతరుల
వ్యవహారాలలో జోక్యం – అపవాదులు చాడీలు చెప్పుటలో సంతృప్తి :
ఇతరుల
వ్యవహారాలలో జోక్యం చేసుకోవడంగాని, ఇతరుల మీద చాడీలు చెప్పి అపవాదులు సృష్టించి వారి
గురించి చర్చలలో పాల్గొని అందులో ఆనందాన్ని పొందడం మంచిది కాదని సాయిబాబా తన భక్తులకు
హితబోధ చేశారు. తప్పు చేసినవారిని సరిదిద్దడానికి
బాబాగారికి తనదైన శైలి, పధ్ధతులు ఉన్నాయి.
బాబా సర్వజ్ఞులు. తన భక్తులు ఎప్పుడు
ఎక్కడ తప్పులు చేసినా ఆయనకు తెలిసిపోయేది.
భక్తులు ఎప్పుడు తప్పులు చేసినా వారిని ఎగతాళిగా ఎత్తిపొడుస్తూ వారి తప్పులను
సరిదిద్ది సరైన మార్గంలో పెట్టేవారు. పరులను
నిందించుచున్నవానితో ఒక పందిని చూపించి “చూడు, ఆపంది అమేద్యమును ఎంత ప్రీతికరముగా తినుచున్నదో. నీప్రవర్తన కూడా ఆవిధముగానే యున్నది. నీసాటి సోదరుని ఎంతో ఆనందంగా తిట్టుచున్నావు” అన్నారు
బాబా (అధ్యాయము 19). అప్పుడా వ్యక్తి తన తప్పును తెలుసుకొని మంచి గుణపాఠాన్ని నేర్చుకొన్నాడు.
బాబా చెప్పిన ఈ విషయాలను మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి మీద పరోక్షంగా ఎవరయినా నిందా
పూర్వకంగా మాట్లాడుతున్నపుడు కొంతమంది మరొక రెండు మాటలను జోడించి నిందా పూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అందులో వారు అంతులేని మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అది చాలా పొరబాటు. పరోక్షంగా
గాని, ప్రత్యక్షంగా గాని ఎవరినీ నిందించకూడదు.
అటువంటి సందర్భం వచ్చినపుడు శ్రీసాయి సత్చరిత్రలో బాబా చెప్పిన ఈ విషయాలు గుర్తుకు
రావాలి. ఆ క్షణంలో మనకి నిందాపూర్వకమైన మాటలు
మాటలాడటానికి మనసు రాదు. ఆవిధంగా మనం బాబా
చెప్పిన ఉపదేశాలను పాటిస్తున్నట్లే.
అలాగే
21వ.అధ్యాయంలో పండరీపురం సబ్ జడ్జి నూల్కర్ తన అనారోగ్యాన్ని నివారించుకోవడానికి షిరిడీ
వచ్చి అక్కడే మకాం చేశారు. ఈవిషయం గురించి
కోర్టులోని బార్ రూములో చర్చకు వచ్చినపుడు పండరీపురంలోని ఒక ప్లీడరు అనవసరంగా అందులో
జోక్యం చేసుకొని సాయిబాబాను నిందించాడు. ఆప్లీడరు
షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించుకున్నపుడు బాబా “ప్రజలెంత టక్కరులు? పాదములపై బడి
నమస్కరించి, దక్షిణ ఇచ్చెదరు. కాని చాటున నిందింతురు. ఇది విచిత్రము కాదా?” అన్నారు. ఈ మాటలు తనకు ఉద్దేశ్యించి అన్నవేనని ఆ ప్లీడరుకు
అర్ధమయింది. తన తప్పును గ్రహించాడు. తరువాత ఆప్లీడరు కాకాసాహెబ్ దీక్షిత్ తో ఇది నాకు
దూషణకాదు. బాబా నన్ను ఆశీర్వదించి మంచి ఉపదేశాన్నిచ్చారు. నేను ఎవరి విషయములలోనూ అనవసరంగా జోక్యం చేసుకోరాదు,
ఎవరినీ దూషించరాదు, నిందించరాదు” అన్నాడు.
(ఇంకా
వుంది)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment