23.08.2016
మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుబాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్ల
మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
8.
ఇంద్రియ సుఖములు – 2వ.భాగమ్
1.  ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ ద్వారకామాయిలో బాబా
ముందర కూర్చుని ఉన్నపుడు, ఒక ధనికుడు తన కుటుంబంతో బాబా దర్శనానికి వచ్చాడు. అతని కుటుంబంలోని
స్త్రీలు బాబా దర్శనం చేసుకొన్నారు. 
వారు ఘోషా
స్త్రీలు.  ఆ స్త్రీలలో ఒకామె బాబా పాదాలకు
నమస్కరించడానికి తన మేలిముసుగును తొలగించింది. 
నానా సాహెబ్ ఆమె ముఖ సౌందర్యానికి సమ్మోహితుడయాడు.  
ఆమెను మరలా మరలా చూడాలనిపించేటంతగా అతని మనసు ప్రలోభ
పెట్టింది.  కాని, అక్కడ బాబా, ఇంకా ఇతర భక్తులు
ఉండటంతో సంకోచించాడు.  నానా మనసు అస్థిమితంగా
ఉండటం గమనించిన బాబా ఆ స్త్రీ వెళ్ళిపోయిన తరువాత నానాతో 
“నానా! ఎందుకని వ్యర్ధంగా
మోహపరవశుడవై చికాకు పడుతున్నావు?  ఇంద్రియాలని
వాటి పనిని వానిని చేయనీ.  వాటి పనిలో మనం అనవసరంగా
జోక్యం కలిగించుకోరాదు.  భగవంతుడు ఈసుందరమయిన
ప్రపంచాన్ని సృష్టించాడు.  ఆ సౌందర్యాన్ని చూచి
సంతోషించడం మనవిధి.  మనసు క్రమంగా మెల్లగా స్థిరపడి
శాంతిస్తుంది.  ముందు ద్వారము తెరచి యుండగా
వెనుక ద్వారమునుండి పోవడమెందుకు?  మన మనసు స్వచ్చముగా
ఉన్నంతవరకు ఎటువంటి దోషము లేదు.  మనలో చెడు
ఆలోచన లేనపుడు ఎవరికయినా భయపడనేల?  నేత్రములను
వాటిపనిని అవి నెరవేర్చుకోనిమ్ము.  నీవు సిగ్గుపడి
తడబడనవసరం లేదు”  అన్నారు.
                                                       అధ్యాయం – 49 
సహజంగానే
మన మనస్సు చంచలమైనది.  అందుచేత మనం మన మనస్సుని
దాని ఇష్టంవచ్చినట్లుగా పరుగులెత్తించకూడదు. 
పంచేంద్రియాలు అస్థిమితంగా ఉంటే ఉండవచ్చుగాక, కాని మన శరీరం మన అధీనంలో ఉండాలి.  మన శరీరం ప్రతిదానికి ఆతురత పడే విధంగా ఉండరాదు.  కోరికలనే గుఱ్ఱాలవెంట మనం పరుగులెత్తరాదు.  వాటిని పొందుదామనే బలీయమయిన కోరికతో మన మనస్సు నిండిపోకూడదు.  మనం ఆవిషయాలను గురించి పట్టించుకోకుండా, క్రమముగాను
నెమ్మదిగాను సాధన చేయడంవల్ల, మనస్సుయొక్క చంచలత్వాన్ని జయించవచ్చు.
                                                  అధ్యాయం – 49
2.  ఒకరోజున హేమాడ్ పంత్ కోటు మడతలలోనుండి శనగగింజలు
రాలి పడగా బాబా అతనితో హాస్యమాడారు.  శనగగింజల
మిషతో బాబా,  ఆసమయంలో అక్కడున్నవారికి, హేమాడిపంత్
కు హితోపదేశం చేసారు.  “పంచేద్రియముల కంటె ముందుగానే
మనసు, బుధ్ధి విషయానందమనుభవించును.  కనుక మొదటగానే
భగవంతుని స్మరించవలెను.  ఈవిధముగా చేసినచో అది
కూడా ఒక విధముగా భగవంతునికి అర్పించినట్లే అగును”.  విషయములను విడచి పంచేంద్రియములుండలేవు.  కనుక  ఆవిషయములను
మొదట గురువుకు అర్పించినచో వానియందభిమానము అదృశ్యమైపోవును”.  
                                             అధ్యాయము – 22
ఈ
సందర్భంగా శ్రీహేమాడ్ పంత్ కూడా మనకు ఈ విధంగా తెలియచేశారు.  “ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలైనవాటికి
సంబంధించిన ఆలోచనలన్నిటినీ మొట్టమొదటగా గురువుకర్పించవలెను.  ఈ అభ్యాసమునాచరించినచో భగవంతుడు, వృత్తులన్నియు నిర్మూలనమగుటకు
సహాయపడును.  విషయములననుభవించుటకు ముందుగానే
బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో, ఆవస్తువును అనుభవించవచ్చునా? లేదా? అనే ప్రశ్న
ఏర్పడును.  అపుడు మనము అనుభవించుటకు ఏది తగదో
దానిని విడిచి పెట్టెదము.  ఈవిధముగా మన దుర్గుణములన్నియు
నిష్క్రమించును”.
                                            అధ్యాయము – 24
ఇక్కడ
మీకొక ఉదాహరణ చెపుతాను.  మనం మిఠాయి దుకాణానికి
వెళ్ళామనుకోండి.  అక్కడ నోరూరించే మిఠాయిలు
మనకు కనువిందు చేస్తూ, వెంటనే కొని తినాలనిపిస్తుంది మన మనస్సుకి.  మొదటగా రుచి కోసం ఒకటి కొని తింటాము.  మన ఎదురుగా బాబా ఫొటో లేకపోవచ్చు, లేక ఆ దుకాణంలో
ఉండవచ్చు. అప్పుడు మన మనసులోనే దానిని ముందరగా బాబాకు నైవేద్యంగా సమర్పించి ఆయనను స్మరించుకుంటూ   ఆరగిస్తే
అది ఆయనకు సమర్పించినట్లే కదా!  
అనగా బాబా ను
మన మనసులో స్మరించుకుని మనం స్వీకరించాలి. 
బాబా 24వ.అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు కదా.  శనగల కధలో బాబా హేమాడ్ పంత్ తొ చెప్పిన ఈ మాటలు
ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాము.
బాబా—“అవును
అదినిజమే. దగ్గరున్నవారికి ఇచ్చెదవు.  ఎవరును
దగ్గర లేనప్పుడు నీవుగాని, నేను గాని ఏమి చేయగలము?  కాని, నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా?  నేనెల్లప్పుడు నీచెంత లేనా?  నీవేదైన తినుటకు ముందు నాకర్పించుచున్నావా?” 
(రేపటితో
ఇంద్రియసుఖాలు ఆఖరి భాగం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 










0 comments:
Post a Comment