25.08.2016
గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్లమూలం
: లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
9.
మాయ – 1వ.భాగమ్
మాయ
గురించి చెప్పాలంటే దానికి మూడు అర్ధాలు ఉన్నాయి. 
ఒకటి బ్రహ్మం ఏర్పడటానికి అవసరమయిన నిర్మాణాత్మకమయిన శక్తి లేక ఈ విశ్వ సృష్టికి
మూలకారణమయిన మహోన్నతమయిన శక్తి.  
రెండవ అర్ధం
ఏమిటంటే అవాస్తవమయిన (మిధ్యా ప్రపంచం) విశ్వం వాస్తవంగా ఉన్నదని అది మహోన్నతమయిన శక్తికి
భిన్నమయినదని భ్రమించడం.  మూడవ అర్ధం ఈ ప్రాపంచిక
రంగంలో ఉన్నవాటిపై మోహాన్ని అనురక్తిని పెంచుకుని వాటి మాయలో పడి జీవితాన్ని గడిపేయడం.
బ్రహ్మం
యొక్క నిర్మాణాత్మక శక్తి :
మన
హిందూ పురాణాలలో ‘మాయ’ ను స్త్రీ రూపంగా వర్ణించారు.  బ్రహ్మం లేక విశ్వశక్తికి ఈమాయని దేవేరిగా స్థానాన్ని
కల్పించడం జరిగింది.  ఈ మాయ మూడు గుణాల కలయిక.  (సత్వ గుణం – మంచితనం లేక నిర్మలత్వం, రజోగుణం
– చైతన్యం – తీవ్రవాంఛ, తమోగుణం – భ్రాంతి, అజ్ఞానం.) ఈ మాయ అదృశ్యంగా సర్వశక్తిమంతుడయిన
పరమాత్మలో ఏకమై ఉంటుంది.  మనం చూస్తున్న ఈజగత్తే
(ఈవిశ్వమే) మాయ.  ఈమాయే శక్తిస్వరూపిణి.  పరమాత్మతో ఏకమయి ఉన్న ఈమాయయొక్క మహోత్కృష్టమయిన
శక్తినే మనం ఆరాధిస్తున్నాము.  హిందూ కాలండర్
ప్రకారం చైత్ర ఆషాఢ మాసాలలో వచ్చే మొదటి తొమ్మిది రోజులు అనగా దేవీ నవరాత్రులను జరుపుకొంటున్నాము.  (చైత్రం – వసంతనవరాత్రులు, శరన్నవరాత్రులు, దేవీ
నవరాత్రులు.)
ఆదిలో
కేవలం బ్రహ్మమే ఉంది.  పురుష సూక్తంలో కూడా
ఇదే వివరింపబడి ఉంది. “సహస్ర శీర్షా పురుష: సహస్రాక్ష సహస్రపాత్ --  అత్యత్తిష్టత్ దశాంగుళం” --- అనంతమయిన శిరస్సులు,
అనంత బాహువులు, అనంత పాదాలతో బ్రహ్మం అలరారుతూ ఉన్నది.  అంటే ఆబ్రహ్మం అంతటా నిండి ఉన్నది.  ఆ బ్రహ్మం పురుషుడు కాదు, స్త్రీకాదు, క్లీబ కాదు.  అది కేవలం బ్రహ్మమే.  మనం ఏరూపంలోనయినా పిలుచుకోవచ్చును.  ఆ బ్రహ్మానికి సృష్టి చేయాలన్న సంకల్పం కలిగింది.  
తనను తానే యజ్ఞం చేసుకొని తద్వారా ఆకాశాన్ని సృష్టించాడు.  ఆకాశంనుండి వాయువు ఉత్పన్నమైంది.  ఆవాయువునుండి అగ్ని, అగ్నినుండి ఆప (జలము), జలమునుండి
భూమి ఉత్పన్నమయాయి.  ఇక్కడ భూమి అంటే మనం నిలబడిన
భూమి మాత్రమే కాదు.  సృష్టిలో ఖగోళాలు, గ్రహాలు,
ఇత్యాదులన్నీను.  అన్నింటిలోను ఉన్నది ఆబ్రహ్మము.  అన్నింటా గ్రాహ్యము.  ఈసృష్టి మొత్తం బ్రహ్మమయం.  అవ్యక్తమయిన బ్రహ్మం వ్యక్తమయినపుడు కనపడేదే మనం
చూస్తున్న నేటి సృష్టి.
మాయయొక్క
శక్తి : 
ఈమాయ
లేక భ్రాంతి చాలా శక్తివంతమయినది.  శ్రీసాయిబాబా
స్వయంగా శ్రీసాయి సత్ చరిత్రలో ఈ మాయ గురించి చాలా చక్కగా చెప్పారు. “అన్ని చింతలను
వదలిపెట్టి సర్వసంగ పరిత్యాగినయి ఒకచోట కూర్చుని ఉండే నన్ను కూడా ఈమాయ బాధిస్తున్నది.  నేను ఫకీరునయినప్పటికి, ఇల్లుగాని, భార్యగాని లేనప్పటికి
ఒకేచోట నివసిస్తూ ఉన్నాను.  అటువంటి నన్ను కూడా
ఈ తప్పించుకోలేని మాయ బాధిస్తూ ఉంది.  నన్ను
నేను మరచినా ఆమెను మరవలేకుండా ఉన్నాను.  ఎల్లప్పుడూ
ఆమె నన్నావరిస్తూనే ఉంది.  ఈభగవంతుని మాయ (విష్ణుమాయ)
బ్రహ్మ మొదలైన వారినే కలవరపెడుతున్నపుడు నావంటి ఫకీరనగా దానికెంత?  ఎవరయితే భగవంతుని ఆశ్రయిస్తారో వారు భగవంతుని కృపవల్ల
ఆమాయనుండి తప్పించుకొందురు”.
                                          అధ్యాయం – 13
ఈమాయ
యొక్క కబంధ హస్తాలనుండి తప్పించుకోవటానికి మనమెందుకని ప్రయత్నిస్తున్నాము?  కారణం ఆమాయవల్లనే మనకి ఈప్రపంచం గురించి ఒక తప్పుడు
అభిప్రాయం ఉంది.  చీకటిలో తాడును చూసి పామని
భ్రమించినట్లుగా ఆతరువాత ఈమిధ్యా ప్రపంచం నిజంగా ఉన్నదని భ్రమించడం, మన శరీరమే ఒక ఆత్మ
అనే భావనతో ఉండటం, ఇదంతా ఆమాయ మనలని ఆవరించడం వల్లనే.  అంతే కాదు ఈ మాయవల్లే మనం ఈప్రాపంచిక క్షణిక సుఖాలకి
అలవాటు పడిపోయి వాటికోసమే ఎప్పుడూ ఎదురు చూస్తూ ఆనందమంతా అందులోనే ఉన్నదని భ్రమిస్తూ
ఉంటాము.  
ఆవిధంగా జననమరణ చక్రాలలో బంధింపబడి
తిరుగుతూ ఉంటాము.  ఎవరయినా ఈమాయనుండి, తప్పుడు
అభిప్రాయంనుండి, వాటివల్ల వచ్చే అనర్ధాన్ని కలిగించే పరిణామాలనుండి ఏవిధంగా బయటపడగలరు?  దానికి ఒకే ఒక మార్గం ఉంది.  మనమెవరో తెలుసుకోవాలన్నా నిజమైన జ్ఞానాన్ని పొందాలన్నా
సద్గురువుని ఆశ్రయించాలి.  ఆసద్గురువే మనలోని
అజ్ఞానాన్ని పోగొట్టి మనమెవరమో మనజీవితానికి అర్ధం, పరమార్ధం అన్నీ తెలియచేసి మనలో
జ్ఞాన దీపాన్ని వెలిగిస్తారు.  ఇది సాధ్యం కానప్పుడు
మనం చేయవలసిన సులభమైన మార్గం ఏదంటే భగవంతుని మీద అచంచలమయిన భక్తిని ఏర్పరచుకొని సాధన
చేయడం.  భక్తులకు ఇక ఎటువంటి చింతా ఉండదు.  మాయ వారిని బాధించదు.
(రేపు
మోహము లేక అనురాగం) 
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు) 














0 comments:
Post a Comment