28.08.2016
ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు
బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబా
వారి బోధనలు మరియు తత్వము
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
9.
మాయ – 2వ.భాగమ్
మోహము
లేక అనురాగం
సామాన్య
మానవునికి ఈ మాయతో చాలా అన్యోన్యమయిన సంబంధం ఉంది. ఈ ప్రాపంచిక రంగంలో తన భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు,
సంపద ఇటువంటివన్నీ కూడా అశాశ్వతమయినవి, మరణం తరువాత తన కూడా రావని తెలిసినప్పటికి వాటి
వ్యామోహంలో పడిపోతాడు. దానివల్ల అతనికి సుఖసంతోషాలు
ఉండవు.
ఈసందర్భంలో
మనం సురధుడనే రాజు, ఒక వ్యాపారికి సంబంధించి ఆసక్తిదాయకమయిన కధను తెలుసుకోవాలి. ఇది దుర్గాసప్తశతిలో ఉంది. (దుర్గాసప్తశతి దుర్గాదేవిని కీర్తిస్తూ 700 శ్లోకాలతొ
కూడి ఉన్నది)
(దుర్గాసప్తశతి
ప్రధమాధ్యాయంలో)
మార్కండేయ
మహర్షి తన శిష్యుడయిన భాగురికి వివరింగా చెప్పిన గాధ.
పురాతన
కాలంలో స్వారోచిష మన్వంతరంలో ఈ అఖండ భూమండలాన్నంతటినీ చైత్ర వంశీయుడయిన సురధుడు పరిపాలిస్తూ
ఉండేవాడు. అతడు ఉత్తమ క్షత్రియుడు. ప్రజలను కన్నబిడ్డలుగా అభిమానించి పరిపాలన సాగిస్తూ
ఉండేవాడు. ఇలా ఉండగా సురధుడికి కోలావిధ్వంసి
రాజులతో వైరం ఏర్పడింది. అపారమయిన సైన్యం,
మహా ఆయుధాల బలం ఉన్నప్పటికీ గొప్ప పరాక్రమ సంపన్నుడయిన సురధుడు కోలా విధ్వంసి రాజుల
చేతిలో ఓటమిపాలయ్యాడు.
ఇంకా చిత్రమేమిటంటే
కొద్దిపాటి సైనిక బలం ఉన్న శత్రువులు సురధుని రాజధాని వారకూ తరిమి తరిమి కొట్టడం వరకు
వెళ్ళింది. సురధుని యొక్క సఛ్చీలత, సౌసీల్యత,
శత్రువుల పట్ల సైతం క్షమాగుణం కలిగి ఉండటం ఇటువంటి సద్గుణాలన్నీ సురధుని బలహీనతలుగా
కోలా విధ్వంస రాజులకు తోచాయి. ఇంకా విచిత్రమేమిటంటే,
సురధుని స్వంత కొలువులోని మంత్రులే ఆపత్సమయంలో తమ ప్రభువుని ఆదుకోకపోవడమే కాకుండా,
స్వార్ధబుధ్ధితో ధనాగారాన్ని అందినంతవరకు దోచుకున్నారు. ‘విధివైపరీత్యం’ అనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు
అక్కరలేదు. ఇదే అదనుగా శత్రురాజులు మళ్ళీ సురధుని
మీదకు దండెత్తారు. దోచుకోబడినంత దోచుకోబడగా,
సురధుని సంపద, సైన్యం యావఛ్ఛక్తులు వారికి స్వాధీనమయ్యాయి. సురధుడు రాజ్యభ్రష్టుడై, దిక్కుతోచక వేటకు వెడుతున్నాని
చెప్పి, ఆనెపంతో అడవులుపట్టిపోయాడు. అది మహా
ఘోరమయిన అరణ్యప్రాంతం. సురధుడు ఆఅడవిలో సంచరిస్తుండగా
ఒకచోట అతనికి మేధామహర్షి ఆశ్రమం కన్పించింది.
ఆమునీశ్వరుని ఆశ్రమం ఉన్నంతమేరా మాత్రం ఆ ఘోరరణ్యంలోని కౄరమృగాలు పరస్పర శత్రుభావం
లేకుండా అన్యోన్యంగా ఉండటం సురధునికి ఆశ్చర్యం కలిగించింది. శిష్యసమూహం గురు శుశ్రూష చేస్తు విద్యలు నేర్చుకుంటున్న
తరుణంలో సురధుడు ఆఆశ్రమంలోకి అడుగుపెట్టాడు.
మేధామహర్షి సురధునికి అతిధి సర్కారాలన్నీ యధోచితంగా జరిపి, తన ఆశ్రమంలోనే వసతి
కల్పించాడు.
ఆక్షణంనుండి
సురధుడు ఆఆశ్రమంలోనే ఉంటూ, ఆప్రాంతంలోనే తిరుగుతూ రోజులు గడుపుతున్నాడు. ఇలా ఉండగా ఒక రోజు అతనికి మమతానురాగాలు ఆకర్షించడంతో
“నా పూర్వీకులు నారాజధానీ నగరాన్ని తమ యావచ్చక్తినీ అర్పించి రక్షించారు. అటువంటిదానిని నేను విడిచిపెట్టి పారిపోయి వచ్చాను”
అని మనసులో చాలా బాఢపడసాగాడు. ఈ విధంగా అతనికి
జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు వచ్చాయి. తన రాజ్యాన్ని
ఆక్రమించుకున్న కొత్తరాజు ధర్మబధ్ధంగా ప్రజలను పరిపాలిస్తున్నాడో లేదొ, లేక కష్టాలపాలు
చేస్తున్నాడేమో, శురాత్ములు, స్వార్ధపరాయణులు
అయిన నా అనుచర సహచరాదులందరూ న్యాయబధ్ధంగా ఉన్నారో లేదో, నాకత్యంత ప్రీతిపాత్రమయిన
‘శూర’ మనే మదపుటేనుగు శత్రువుల చేతిలో ఎన్ని బాధలు పడుతున్నదో? నాసేవకులు, నేను బహూకరించిన సత్కారాలతో, భోజన వస్త్రాదులతో
సంతుష్టులై నన్ను సేవిస్తూ ఉండేవారు. ఇపుడు
వారందరూ శత్రురాజుల సేవలో అప్రమత్తులై తన్మయులయి ఉంటారుకదా! మంత్రులందరూ నాకోశాగారాన్నంతా ఖాళీ చేసే ఉంటారు”
అని పరిపరి విధాలుగా చింతిస్తూ అక్కడే తిరుగుతూ ఉన్నాడు.
ఒకనాడు
ఆవిధంగా తిరుగుతున్న సురధునికి ఆప్రాంతంలోనే ఒక వైశ్యుడు తిరుగుతూ ఉండటం కనిపించింది. అతడా వైశ్యునితో “అయ్యా! మీరెవరు? ఈ ఆశ్రమంవద్దకు ఎందుకు వచ్చారు? మిమ్మల్ని చూస్తుంటే ఎందుకనో చాలా తీవ్రంగా బాధపడుతున్నట్లుగా
కన్పిస్తున్నారు. దానికి కారణం చెబుతారా? అని
ప్రశ్నించాడు.
అపుడా
వైశ్యుడు తన కధనంతా ఈవిధంగా చెప్పాడు. “ఆర్యా,
నాపేరు ‘సమాధి’. నేను వైశ్యకులంలో జన్మంచాను. మంచి ఐశ్వర్యవంతుల కుటుంబం మాది. నేను పెద్దయిన తరువాత చాలా ధనం సంపాదించాను. వివాహమయి పిల్లలు కూడా ఉన్నారు. కాని, నాదురదృష్టం. వార్ధక్యం మీద పడటంతో, నాభార్యాపిల్లలు నన్ను నిర్ధాక్షిణ్యంగా
ఇంటినుండి బయటకు గెంటివేశారు. నావాళ్ళందరూ నాసంపదను దోచుకున్నారు. ఇప్పుడు నాకుటుంబం గురించే నాబాధ. నేనిలా అడవులలో తిరుగుతున్నాను. ఇపుడు నావారి క్షేమ సమాచారాలేమీ నాకు తెలియవు కదా! నేను లేనందువల్ల నాభార్యాపిల్లలు క్షేమంగా ఉన్నారో
లేదో? ఏమయినా బాధలు అనుభవిస్తున్నారేమో? వారింకా అధికంగా శ్రమపడుతున్నారేమో? నాపిల్లలు దారితప్పి చెడుమార్గాలలో పయనిస్తున్నారేమో? ఇటువంటి ఆలోచనలతో నేను కుమిలి పోతున్నాను. నావిచారమమంతా వారి గురించే” అన్నాడు.
ఆయన
మాటలకు సురధుడు ఆశ్చర్యపోతూ”నిర్ధాక్షిణ్యంగా నిన్ను ఇంటినుండి తరిమి వేసిన నీభార్యాపిల్లల
మీద ఇంకా మమకారాన్ని ఎలా చూపెట్టగలుగుతున్నావు.
ఇంకా వారి యోగక్షేమాలగురించే చింతిస్తూ ఉన్నావా?” అన్నాడు.
అప్పుడు
సమాధి, “అయ్యా, మీరు చెప్పినది నిజమే. కాని
నావాళ్ళు నన్ను తరిమివేసినా వారిపై నా మమకారాన్ని చంపుకోలేను. వారియందు కఠినంగా ఉండలేను. ధనంమీద మోహంతో, నాభార్య పతిభక్తిని, నా పిల్లలు
పితృభక్తినీ త్యజించినా, నాభార్యాబిడ్దలపై నామనసు ప్రేమనే వర్షిస్తొంది. వారెంత దుర్మార్గులైనా వారివైపు నామనసు ఎందుకని
ఆకర్షింపబడుతూ ఉందో నాకు తెలియదు” అన్నాడు.
ఈసమస్య
పరిష్కారం కోసం వారిద్దరూ మేధాఋషి అభిప్రాయం తెలుసుకోగోరి ఆయన వద్దకు వెళ్ళారు.
(ఆయన
చెప్పిన సమాధానం ఏమిటి)
(ఇంకా
ఉంది)
0 comments:
Post a Comment