Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, November 28, 2016

భావ తరంగాలు – హేమాజోషి – 3వ.భాగమ్

Posted by tyagaraju on 6:21 AM

Image result for images of shirdisaibaba and vithal

Image result for images of rose hd yellow

28.11.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
పండరీపూర్, కొల్హాపూర్ యాత్రలు ముగించుకుని 24వ.తారీకున తిరిగి వచ్చాను.  మరలా ఈ రోజుకి భావతరంగాలు తరువాయి భాగం అనువాదం చేసి ప్రచురించడానికి సమయం దొరికింది.
          
(బాబా తన భక్తులనుండి దక్షిణ అడిగి మరీ తీసుకునేవారు.  దాని ఆంతర్యం ఏమిటో ఈ భాగంలో చదవండి)


      Image result for images of shirdi sai baba and kolhapur mahalakshmi
భావ తరంగాలు – హేమాజోషి – 3వ.భాగమ్
ద్వారకామాయి శిధిలావస్థలోనున్న ఒక మసీదు.  అందుచేత స్వర్గీయ నానాసాహెబ్ చందోర్కర్ ఆ పాడుపడిన మసీదును బాగుచేయించుదామని ఆ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకొన్నాడు. 


కాని ఉద్యోగరీత్యా ఆఫీసు వ్యవహారాలలో మునిగి ఉండటంవల్ల ఈ బాధ్యతను నిర్వహించడానికి తగిన సమయం దొరకలేదు.  ఇక చేసేదేమీ లేక ఆబాధ్యతను నిమోన్ కర్ గారికి అప్పచెప్పాడు.  నిమోన్ కర్ ఆబాధ్యతను ఎంతో సంతోషంగా స్వీకరించాడు.  భక్తిప్రపత్తులతో పనిని ప్రారంభించాడు.  
         Image result for images of old dwarakamayi
కాని సాయిబాబా సగం వరకు కట్టిన గోడలను పడగొట్టేసేవారు.  రాళ్ళు విసురుతూ ఉండేవారు.  మసీదు పునర్నిర్మాణంలో ఆటంకాలు కలిగించేవారు.  శ్రీనానాసాహెబ్ నిమోన్ కర్ గారి సహనానికి, భక్తికి సాయిబాబా ఆవిధంగా పరీక్ష పెట్టారు.  సాయిబాబా కోపగిస్తూ చేసిన పనులకి నిమోన్ కర్ ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు, కోపాన్ని ప్రదర్శించలేదు.  నిరాశ కూడా పడలేదు.  మరలా ఎంత రాత్రయినా సరే ‘పునశ్చ హరిహి ఓమ్’  అని మరలా పనిని ప్రారంభించేవాడు.  చేసిన పనినే మరలా మరలా మొదటినుంచి తిరిగి ప్రారంభించవలసి వచ్చేది.  ఆవిధంగా సాయిబాబా పెట్టిన పరీక్షలో ఎప్పుడూ అపజయాన్ని పొందలేదు.  ఆఖరికి ద్వారకామాయి నిర్మాణం జరిగింది.  శ్రీనిమోన్ కర్ గారు ద్వారకామాయిని తిరిగి పునర్నిర్మించడంలో సఫలీకృతులయ్యారు.

శ్రీసాయిబాబాను దర్శించడానికి వచ్చే భక్తులందరికీ నిమోన్ కర్  గారు భోజనవసతులు కల్గించి హృదయపూర్వకమయిన సేవ చేసేవారు.  ద్వారకామాయిని తుడిచి శుభ్రం చేస్తూ ఉండేవారు.  చందోర్కర్, నిమోన్ కర్, మహల్సాపతి, మాధవరావ్ దేశ్ పాండే లాంటి భక్తులందరూ రాత్రివేళల్లో సాయిబాబాకు సన్నిహితంగా  కూర్చుని ఆసక్తికరమయిన విషయాలను చర్చించుకుంటూ ఉండేవారు.  ఆయనతో ఎంతో చనువుగా ఆధ్యాత్మిక సలహాలను, సూచనలను అడిగి తెలుసుకుంటూ ఉండేవారు.  వీరందరూ సాయిబాబాకు అంత సన్నిహితంగా ఉండటానికి కారణం, సాయిబాబా పెట్టే పరీక్షలకు తట్టుకుని ఆయన అడిగే ప్రశ్నలకు సరియైన సమాధానాలను ఇవ్వడం వల్లనే.  వారందరూ సాయిబాబాపై తమ ప్రగాఢమయిన నమ్మకం, భక్తి, ప్రేమలవల్లనే ఆయనకత్యంత సన్నిహితులయ్యారు.

మేము ఎప్పుడూ సాయిబాబానే పూజిస్తూ ఉంటాము.  మాయింటిలో ఆయనకు ఆరతులు ఇస్తూ ఉంటాము.  ప్రతిరోజు సాయి సత్ చరిత్ర పారాయణ చేస్తూ ఉంటాము. అన్ని పర్వదినాలలోను సద్గురు శ్రీసాయిబాబాని ఎప్పుడూ పూజిస్తూ ఉంటాము.  మేమంతా ఆయన కుటుంబ సభ్యులం.
                           Image result for images of nimonkar

మాతాతగారయిన కీ.శే.సోమనాధ్ శంకర్ దేశ్ పాండే నిమోన్ కర్ (నానాసాహెబ్ కుమారుడు) బ్రిటిష్ వారి కాలంలో సి.ఐ.డి. ఇన్స్పెక్టర్ గా పనిచేశారు.  ఉద్యోగరీత్యా ఆయన బదిలీపై భారతదేశమంతా తిరిగారు.

ఒకసారి సాయిబాబా ఆయనకి ఒక విచిత్రమైన ప్రశ్న వేశారు.  అది ఆయన ఆజ్ఞ కావచ్చు.  బాబా, సోమనాధ్ తో “సోమూ, నువ్వు నన్ను కలుసుకోవడానికిషిరిడీ ఎప్పుడు వస్తున్నావు?  నీతుపాకీని గాలిలోకి కాల్చు.  నువ్వు షిరిడీ వచ్చావని తెలుసుకోవడానికి అదే సంకేతం” అన్నారు.  మాతాతగారయిన సోమనాధ్ గారు సాయిబాబావారి ఆజ్ఞలన్నిటినీ శిరసావహిస్తూ ఉండేవారు.  సాయిబాబావారిచ్చిన ఆజ్ఞ ప్రకారం సోమనాధ్ గారు గాలిలోకి తుపాకీ పేల్చగానే బాబా సంతోషంతో “నా సోమూ వచ్చాడు” అనేవారు.

సోమనాధ్ వచ్చీరాగానే సాయిబాబాకు నమస్కారం చేసుకున్న వెంటనే సాయిబాబా ఆయనని దక్షిణ అడుగుతూ ఉండేవారు.  సోమనాధ్ వెండి రూపాయ నాణాలని బాబా చేతిలో పెడుతూ ఉండేవారు.  బాబా ఆ వెండి రూపాయనాణాలని వేళ్ళతో రుద్దుతూ “ఇది నాసోమూ రూపాయలు” అనేవారు.  ఆతరువాత దక్షిణగా స్వీకరించిన ఆ నాణాలన్నిటినీ తన దగ్గర కూర్చున్నవారందరికీ ఒకరి తర్వాత ఒకరికి పంచిపెట్టేస్తూ ఉండేవారు.  ఒకరోజు మాతాతగారు బాబాని ఈవిధంగా అడిగారు. “బాబా మీరు నానుంచి దక్షిణ స్వీకరిస్తున్నారు.  ప్రతి నాణాన్ని రుద్దుతూ అందరికీ మీప్రసాదంగా పంచి పెట్టేస్తున్నారు, కాని మీరు ఒక్క నాణాన్ని కూడా మీప్రసాదంగా ఎప్పుడూ నాకివ్వలేదు.  ఎందుకని? కారణం ఏమిటి?”  బాబా ఇచ్చిన సమాధానం చాలా ముఖ్యమైనది, గమనించతగ్గది.  ఆయన మాతాతగారి వైపు తీక్షణంగా చూస్తూ, "అరే! నువ్వు భూస్వామివి!   నువ్వు ఫకీరునుంచి పైసలు ఎపుడూ తీసుకోకూడదు.  నువ్వే ఫకీరుకు పైసలివ్వాలి.  దీనర్ధం తెలుసా నీకు?  నీకేది లభించిందో దానితోనే సంతోషంగా జీవించాలి.  అర్ధమయిందా?”

ఇక మాతాతగారికి ఎదురు మాట్లాడే ధైర్యం లేకపోయింది.  ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆయన పూనాకి తిరిగి రాగానే జీతం (ఇంక్రిమెంట్ ) పెరిగింది.  ఆయన సాయిబాబాకు సమర్పించుకున్న దక్షిణకు రెండింతలు ఇంక్రిమెంట్ లభించింది.

కాని మాతాతగారి మనస్సులో ఎప్పుడూ ఒక ప్రశ్న వేధిస్తూ ఉండేది.  “సాయిబాబా వెండినాణాలని తన వేలితో ఎందుకని రుద్దుతూ ఉండేవారు?” ఒకరోజున బాబా తనంతట తానే ఆప్రశ్నకు సమాధానం చెప్పారు.  “సోమూ! మీరందరూ నాభక్తులు.  నేను మీనుంచి దక్షిణ ఎందుకని అడుగుతున్నానంటే, మీరు మీజీవనోపాధి కోసం, మీకుటుంబం కోసం ధనం సంపాదిస్తూ ఉంటారు.  కాని మీరు బీదలకి దానధర్మాలు మాత్రం చేయరు.  మీకర్మల యొక్క దుష్ఫలితాలు ఏమాత్రం తగ్గవు.  మీకర్మలను నశింపచేయడానికే నేను దక్షిణ అడిగి మరీ తీసుకుంటూ ఉంటాను.  మీ కర్మలను పూర్తిగా తొలగిస్తాను”

ఆవిధంగా బాబా తన భక్తులయొక్క కర్మలను,  ప్రారబ్ధకర్మలు, సంచిత కర్మలవల్ల కలిగే చెడుఫలితాలను నాశనం చేస్తూ ఉంటారు.

బాబా వివరణ వినగానే, ఆయన తన భక్తులపై చూపే ప్రేమాభిమానాలకి మాతాతగారి కళ్లనుండి కన్నీళ్ళు కారడం మొదలయ్యాయి.  సాయిబాబా తన భక్తుల యెడల స్వచ్చమయిన ప్రేమను కనపరుస్తూ, రక్షిస్తూ ఉంటారని అర్ధం చేసుకున్నారు.  ఆయన ఒక ఆధ్యాత్మిక సద్గురువే కాదు, ఆయనే మన తల్లి, తండ్రీ.  మాతాతగారు గొప్ప జ్యోతిష్య పండితులు కూడా.  ఆయన సాయిబాబా చేతులలోను, అరికాళ్ళలోను ఒక యోగికి ఉండవలసిన రేఖలు ఉండటం గమనించారు.  ఒకసారి ఆయనకు బాబా స్థానంలో హనుమంతుని దర్శనం అయింది.  సాయిబాబాతో తనకు కలిగిన అనుభవాలన్నిటినీ మాతాతగారు మాయింట్లోని వాళ్ళందరికీ, ఆయన మనుమలు మనవరాళ్ళమయిన మాకూ వివరించి చెబుతూ ఉండేవారు.

సాయిబాబా మితభాషి.  ఆయన మాటలెప్పుడూ సంజ్ఞలతోను, గూఢార్ధాలతోను నిండి ఉండేవి.  కాని ఆయన తన మాటలద్వారా ఇచ్చిన సందేశాలు ఎప్పుడూ స్పష్టంగాను, బలీయంగాను, మంగళప్రదంగాను ఉండేవి.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List