29.11.2016 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
భావతరంగాలు
– హేమా జోషి – 4వ.భాగమ్
మా
నాన్నగారు శ్రీ గోపాల్ సోమనాధ్ దేశ్ పాండే సీనియర్ అడ్వొకేట్. ఆ రోజుల్లో సీనియర్
పోలీస్ ప్రాసిక్యూటర్ గా అహ్మద్ నగర్ లో పనిచేస్తూ ఉండేవారు. ఆయన తన బాల్యంలోనే సాయిబాబాను దర్శించుకున్నారు.
ఆయన తన తాతగారయిన నిమోన్ కర్ గారితో కూడా షిరిడీ
వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకునేవారు. సాయిబాబా
మానాన్నగారిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని శాలువా కప్పేవారు.
ఒకరోజున సాయిబాబా సోమనాధ్ తో “ఈ పిల్లవాడిని ‘ఏకనాధ్’
అని పిలు” అని చెప్పారు. అప్పటినుండి మానాన్నగారిని
కుటుంబంలోనివారంతా సాయిబాబావారి ఏకనాధునిగా పిలవడం ప్రారంభించారు. మానాన్నగారు తనకు సాయిబాబాతో కలిగినటువంటి అనుభవాలు,
జ్ఞాపకాలు చాలా మనోహరంగాను. ఆసక్తికరంగాను, ఉల్లాసంగాను ఉండేవని చెబుతూ ఉండేవారు. ఆయన తన చిన్నతనంలో బాబావారి ఒడిలో కూర్చుని ఆయన
ఇచ్చే ప్రసాదాన్ని తినేవారట.
మేమంతా మానాన్నగారిని
“మీకు సాయిబాబా బాగా గుర్తున్నారా? చెప్పండి, బాబా ఎలా ఉండేవారు?” అని అడిగేవాళ్ళం. మా ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు మానాన్నగారి
ముఖం సంతోషంతోను, ఆనందంతోను వెలిగిపోయేది.
“సాయిబాబా మంచి స్ఫురద్రూపి, పొడవుగా ఉండేవారు. మంచి ఆరోగ్యంగా ఉండేవారు. ఆయన ఎంతో దయగా ఉండేవారు. ఆయన తన భక్తులతో మాట్లాడేటప్పుడు ద్వారకామాయిలో
తన స్థానంలో కూర్చునేవారు. ఆసమయంలో ఆయన మాకందరికీ భగవంతునిలా కన్పించేవారు. ఆయన మండుతున్న పొయ్యిమీద పెద్ద రాగిగుండిగను పెట్టి
కిచిడి వండేవారు. ఉడుకుతున్న కిచిడీలో ఆయన
చిన్నగరిటె గాని, పెద్ద గరిటను గాని పెట్టకుండా తన చేతితో కలియతిప్పడం చాలా సార్లు
చూశాను.
అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఆయన నేత్రాలు చాలా పెద్దవిగా విశాలంగా ఉండేవి. ఆయన కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉండి చూపులు తీక్షణంగా
ఎదుటివారి హృదయాలలోకి చాలా సులభంగా దూసుకుపోయేలా ఉండేవి.
ఆయన చూపులు ఎదుటివారి మనసులోని
భావాలను వెంటనే గ్రహించగలిగేవి. కాని ఆయన కళ్ళలో
కరుణ, దయ. అవి సముద్రమంత ప్రేమను కురిపిస్తూ ఉండేవి. ఆయనలో ఉన్న కరుణ, ప్రేమ ఆయన వదనంలో ప్రస్ఫుటంగా
కనిపిస్తూ ఉండేవి.”
మానాన్నగారు చెప్పిన ఈ
విషయాలు మా కెంతో ఆనందాన్ని కలిగించేవి. మానాన్నగారు
ఎంతటి అదృష్టవంతులో కదా!
మా
చిన్నతనంలో మా తాతగారయిన సోమనాధ్ గారినుంచి, మానాన్నగారయిన గోపాలరావుగారి నుంచి వారు చెప్పే
మనోహరమయిన మధురానుభూతులను ఎన్నిటినో తరచూ వింటూ ఉండేవాళ్ళం. మేము పెద్దవాళ్ళమయినప్పుడు కూడా ఆతరువాత సంవత్సరాలలోను
వారు చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఎంతో భక్తిభావంతో చర్చించుకుంటూ ఉండేవాళ్ళం.
ఆవిధంగా
మరలా మరలా వాటిగురించే మాట్లాడుకుంటూ ఎంతో ఆనందాన్ని అనుభవించేవాళ్ళం. నాకిప్పుడు అనిపిస్తూ ఉంటుంది.
“మా ముత్తాతగారు నానా సాహెబ్ నిమోన్ కర్ గారు, ఆయన
కుమారుడు శ్రీసోమనాధ్, మానాన్నగారు శ్రీగోపాలరావుగారు ఎంతటి అదృష్టవంతులో కదా అని. వారంతా సాయిబాబాగారితో అత్యంత సన్నిహితంగా ఉండి
ఆయన స్వయంగా ఇచ్చిన దీవెనలు అందుకున్న భాగ్యశాలురు. ఆయన సన్నిధానంలో జీవించిన ధన్యులు. మేము సాయిబాబాను చూడకపోయినా, ఆయన గురించి విన్న
అనుభవాల ద్వారా ఆయన మాతోనే ఉన్న అనుభూతికి లోనయిన అదృష్టవంతులమనే భావన మా చిన్నతనం
నుంచీ అనుభవిస్తూ ఉన్నాము. ఆయన దివ్యమంగళ
రూపం మా హృదయాలలో బలీయంగా స్థిరనివాసం ఏర్పరచుకొంది.
సాయిబాబాతో
ఉన్న ఈ బంధం శాశ్వతమయినది. ఈ బంధం ఈ తరంలోనే
కాదు తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది. అందువల్లనే
సాయిబాబా మాతోనే ఉన్నారనే భావం మామదిలో బలీయంగా నిక్షిప్తమయిపోయింది.
ఆబంధం
ఆవిధంగా ఉండటంవల్లనేనేమో మేము షిరిడీలో ద్వారకామాయిలోకి అడుగుపెట్టగానే బాబా మారాక కోసం
ఎదురు చూస్తూ ఉన్నారనే భావన కలిగేది. ఆయన విశాలమయిన
నేత్రాలు మాతో మాట్లాడటం మొదలు పెడుతున్నట్లుగా అనిపించేది. అందువల్లనే నేనాయన పవిత్రమయిన పాదాలమీద, సమాధిమీద
నాశిరసునుంచగానే నాలో ఏదో తెలియని ప్రేమాభిమానాలు ఉవ్వెత్తున పొంగి ప్రవహించేవి. ఉద్వేగం వచ్చేది. ఆ ఉద్వేగఫలితంగా నాకళ్ళలోనుంచి ఉబికి వచ్చే కన్నీరు
ఆయన పాదాలని అభిషేకం చేసేది.
ఇపుడు
సాయిబాబాతో నాకు కలిగిన అనుభవాన్ని చెప్పకుండా ఉండలేను. ఆ అనుభవాన్ని తలచుకున్నపుడెల్లా ఎంతో సాహసోపేతమైనదిగాను,
ఒడలు జలదరించేటట్లుగాను ఉంటుంది.
(ఆ దివ్యానుభూతి రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment