30.11.2016 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
భావతరంగాలు
– హేమా జోషి – 5 వ.భాగమ్
అది
2౦౦4 వ.సంవత్సరం నవంబరు 25వ.తారీకు. శీతాకాలం
కావడం వల్ల విపరీతమయిన చలిగాలులు వీస్తున్న రోజులు. నేను, నా భర్త శ్రీ సుధాకర్ జోషీ, క్రియా యోగా కి
మూలగురువయిన మహావతార్ బాబాజీ దర్శనానికి బయలుదేరాము.
ఆయన హిమాలయ పర్వతాలవద్ద గల త్రిశూల్ పర్వతం దగ్గర
ద్వారాహట్ గుహలో నివాసముంటున్నారు. మహావతార్
బాబాజీ గారు క్రియాయోగాకి ఆద్యుడు, మూలపురుషుడు, సద్గురువు. ఆయన ఇప్పటికీ చైతన్యరూపంలో అదృశ్యంగా ఉన్నారు.
ఈ విశ్వంలో శాంతిని నెలకొల్పడానికి, మానవజాతిని
ఉద్ధరించడానికి అయన ఇంకా చైతన్యరూపంలో జీవించే ఉన్నారు. ఆయన వయసు 3000 సంవత్సరాలకు పైగా ఉంటుంది.
కాని ఆయన 25 సంవత్సరాల నవయువకునిలా కన్పిస్తారు. కాని చాలా కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే, క్రియాయోగంలో
ఆధ్యాత్మిక గురువులయిన శ్రీలాహిరి మహాశయ, శ్రీస్వామి యుక్తేశ్వర్ గిరి,
(లాహిరి మహాశయ)
(శ్రీ స్వామి యుక్తేశ్వర్ గిరి)
ఇంకా ఆయన అనుంగు
శిష్యుడయిన పరమహంస శ్రీ యోగానంద లాంటి వారికి మాత్రమే బాబాజీగారి దర్శనం లభించింది. శ్రీశ్రీ యోగానందగారు తన ఆత్మకధను ‘ఒకయోగి ఆత్మకధ’
అనే పుస్తకాన్ని రచించారు.
అది చాలా ప్రసిధ్ధి
గాంచింది. మహావతార్ బాబాజీ క్రియాయోగ లక్ష్యాన్ని
ప్రముఖ పాత్రికేయుడయిన శ్రీనీలకంఠన్, మరియు రామయ్యగార్ల ద్వారా పూర్తి చేయించారు. వారిద్వారా ఇప్పటికీ క్రియాయోగ ఎంతోమంది భక్తులకు
ఈ క్రియాయోగ లో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది.
భవిష్యత్తులో కూడా ఈక్రియాయోగ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. ఆయన ఇప్పటికీ తన క్రియాయోగ ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం
చేస్తున్నారు. ఆయన ఈప్రపంచంలో ఉన్న భాషలన్నిటినీ
మాట్లాడగలరు. ఆయన తన కార్యాన్ని రహస్యంగా నిర్వహిస్తూ
ఉంటారు.
హిమాలయాలలో
బాబాజీగారు నివసించే గుహకి వెళ్ళేదారి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఒకవైపున ఎత్తయిన హిమాలయ పర్వత శిఖరాలు, ఆకాశాన్ని
అందుకుంటున్నాయా అనిపించేటంతగా పెద్దపెద్ద వృక్షాలు, మరొకవైపు అగాధమయిన లోయలు, ఆలోయలన్నీ
దట్టమయిన అడవులతోను, వేగంగా ప్రవహించే పెద్ద నదులతోను నిండి ఉంటాయి. ఆనదులలోని నీటి ప్రవాహాలు చాలా లోతుగా ఉంటాయి. నడచేటప్పుడు ఏమాత్రం కాలు జారినా ఇక ఇంతే సంగతులు. ప్రవహించే నీటి ప్రవాహంలో గాని, లోయలలో గాని పడిపోవలసిందే. ఇక బయటకు వచ్చే ప్రసక్తే లేదు. బ్రతుకుతారన్న ఆశకూడా ఏమాత్రం ఉండదు. జీవితానికి చరమాంకం. పర్వతాల మీదకు తీసుకునివెళ్ళడానికి
గుఱ్ఱాలు గాని, మనుషులను పల్లకీలో (డోలీలు) మోసుకుని వెళ్ళడానికి ఎటువంటి సౌకర్యాలు
ఉండవు. ద్వారాహట్ లోని ప్రధాన స్వామీజీ మాకు
దారి చూపించడానికి ఒక గైడ్ ని పురమాయించారు.
అతని పేరు రవి. అతని వయస్సు 12 సంవత్సరాలు. పుట్టినప్పటినుండి ఆ అబ్బాయి హిమాలయ ప్రాంతాలలోనే
ఉన్నాడు. చిన్నపిల్లవాడయినా మాకు క్షుణ్ణంగా
దారి చూపిస్తూ తీసుకెళ్లసాగాడు. మేము అతని
వెనకాలే సద్గురు శ్రీసాయిబాబా, మహావతార్ బాబాజీల నామాన్ని జపించుకుంటూ అనుసరిస్తున్నాము. నా మోకాళ్ళు బాగా నొప్పితో సలుపుతూ ఉన్నాయి. గత 22 సంవత్సరాలనుండీ నేను మోకాళ్ళ నొప్పులతో చాలా
బాధపడుతూ ఉన్నాను. కాని బాబాజీగారిని దర్శించాలనే
కోరిక బలీయంగాను, ఆయనను కలుసుకోబోతున్నామనే ఒక విధమయిన ఉద్వేగంతోను ఉండటం వల్ల పర్వతాలను
అధిరోహించడం ఎంత కష్టంగా ఉన్నా, ప్రమాదకరంగా ఉన్నా మోకాళ్ళ నొప్పులని ఏమాత్రం పట్టించుకోలేదు.
మేము
సాయంత్రం 4 గంటలకు గుహకు చేరుకున్నాము. నాజీవితంలో
అది ఒక మరుపురాని సంఘటన. మాకు కలిగిన ఆనందం
చెప్పనలవికాదు. మనసంతా ఒక విధమయిన ఉద్వేగంతో
నిండిపోయింది. ధ్యానమగ్నులమయి స్తోత్రాలను,
పఠించుకుంటూ. భజనలు చేసి ప్రార్ధనలు చేశాము. ఆక్షణాలు మాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాయి. అంతా సంతోషం, ఆనందం తప్ప మాకాక్షణంలో ఇంకేమీ లేవు.
మేము
క్రిందకి దిగడం ప్రారంభించేసరికి అసలయిన ప్రమాదం ముంచుకొచ్చింది. హటాత్తుగా వాతావరణంలో పెద్ద మార్పు. ఆకాశంలో దట్టంగా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. బలమయిన గాలులు ఊళలు వేస్తూ వేగంగా వీస్తున్నాయి. దానికితోడు మంచుకూడా కురవడం ప్రారంభమయింది. రాళ్ళతోను, బురదతోను ఉన్న దారి మరింతగా జారుడుగా
ఉండటం వల్ల, నడక కూడా చాలా ప్రమాదకరంగా ఉంది.
కొంతసేపటికి ఆచీకటిలో హిమాలయాల సౌందర్యమంతా మాయమయిపోయింది. మధ్యమధ్యలో ఉరుములు, మెరుపులతో వాతావరణం భీతి కొలుపుతూ
ఉంది. విపరీతమయిన చలితో మొత్తం వాతావరణం చాలా
ఘోరంగాను, భయంకరంగాను ఉంది. అడుగు వేద్దామంటే దారికూడా కనబడటంలేదు. నాకు చాలా భయంగా ఉంది. కాని మేము మనసులో శ్రీసాయిబాబా, మహావతార్ బాబాజీ,
శ్రీస్వామి సమర్ధ మహరాజ్ ల నామాన్ని బిగ్గరగా జపిస్తూ నడుస్తున్నాము. బిగ్గరగా జపిస్తూ ఉండటంవల్ల గాలిలో మామాటలే మరలా
మరలా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. మాకు దారి చూపిస్తున్న
గైడ్ పాపం చిన్నపిల్లవాడవటం వల్ల బాగా భయపడిపోతున్నాడు. అప్పుడే చాలా దూరంనుంచి మావైపుకు మిణుకు మిణుకు
మంటూ చిన్న కాంతి వస్తూ ఉంది. చేతిలో మండుతున్న
కాగడా పట్టుకుని మావైపే ఎవరో వస్తున్నారు.
అతను మాదగ్గరగా వచ్చి, “నాపేరు కేశర్ సింగ్, మీరు ఎవరు? ఇటువంటి ప్రమాదకరమయిన
చోటకి అంత వంటరిగా మీరెలా వచ్చారు? మీసాయినామ
జపాన్ని విని మీకు సహాయం చేద్దామని వచ్చాను. నాతో కూడా రండి” అన్నాడు.
మేము
ఆయన వెనకే మౌనంగా నడవసాగాము. ఒక గంట తరవాత
ఆయన ఉండే కుటీరం దగ్గరకు చేరుకున్నాము. మేము
ఆకుటీరంలోకి ఎస్కిమోలలాగ మోచేతులు, కాళ్ళతో ప్రాకుకుంటూ ప్రవేశించాల్సి వచ్చింది. ఆ చిన్న కుటీరంలోపలికి వెళ్ళి తల పైకెత్తి చూశాము.
ఓహ్!
ఏమాశ్చర్యం! ఏమా అద్భుతం! ఆక్షణంలో నాకు నోటమాట
రాలేదు. నాహృదయ స్పందన ఆగిపోయిందా అన్నట్టుగా ఉంది నాపరిస్థితి----ఆశ్చర్యంతో నానోటినుంచి
బిగ్గరగా వచ్చిన మాట “నా సాయిబాబా – నా సద్గురు సాయిబాబా – నేనెక్కడికి వెళ్ళినా నువ్వు
నాతోనే ఉంటావు!!”
నేను
తలపైకెత్తి చూడగానే ఎదురుగా నిలువెత్తున సాయిబాబా. ఆయన కళ్ళలో అదే కరుణ. వదనంలో చిరునవ్వు. కుడిచేతిని పైకెత్తి అభయమిస్తు ఉన్నారు. నా సాయిబాబా – నా సాయిబాబా-- ఆనందంతో గట్టిగా అరిచాను. ఆ చిన్న కుటీరంలో నిలువెత్తు సాయిబాబా కాలండరు గోడమీద
క్రిందవరకు వ్రేలాడుతూ కనిపించింది. బాబా ఆవిధంగా
నిలుచున్న తీరు ఎంతో అద్భుతంగా ఉంది. ఆయన కళ్ళలో
అదే కరుణ, దయ, ప్రేమ, చేయెత్తి మీకు రక్షణగా నేనున్నాను అని అభయమిస్తు నిలబడి ఉన్నారు. షిరిడీలోని ద్వారకామాయిలో మనం ఎప్పుడూ దర్శించుకునే
బాబా – “రండి నాదగ్గరకు. మీకోసమే నేను ఎదురు
చూస్తూ ఉన్నాను” అని మాట్లాడుతున్నట్లుగా ఉంది.
ఆనంద భాష్పాలు ఉబికి వస్తున్నాయి. నాసద్గురు
నా సాయిబాబా నన్ను రక్షించేవాడు, నేను నీతో ఏమి మాట్లాడగలను? వినమ్రంగా ఆయన పాదాలను స్పృశించాను. “నేనెక్కడికి వెళ్ళినా, నారక్షకునిగా, నన్న పాలించేవాడివిగా
నువ్వెప్పుడూ నాతోనే ఉంటావు. నా తల్లి, తండ్రి
అన్నీ నువ్వే”. హిమాలయాలలో ఉన్న ఆచిన్న కుటిరంలో
మేము ఆరాత్రి సాయిబాబా దివ్య చరణాల వద్ద నిద్రించాము.
సాయిబాబా
నాహృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. హిమాలయాలలో
ఆయన దివ్యదర్శనం నాజీవితంలో మరపురాని, మరచిపోలేని ఒక దివ్యానుభూతి. మన జీవితంలో మనకు అత్యంత సన్నిహితంగాను, పిలవగానే
పలికెడు దైవం, మోక్షాన్నిచ్చే గురువు సాయిబాబాయే అని అర్ధం చేసుకున్నాను. మనకి ఈప్రపంచంలో వెలకట్టలేని ఆధ్యాత్మిక సంపద ఏదంటే
ఆయనయొక్క అవ్యాజ్య ప్రేమ, వాత్సల్యం. ఆయనకు
నేను పూర్తిగా సర్వస్య శరణాగతి చేస్తూ---
“నా
మనస్సు నాకు నచ్చిన చోటకు ఎక్కడికయినా వెళ్ళనీ, నాకు నీదర్శనం మాత్రమే కలుగుతుంది. ఆప్రదేశంలో నా శిరసునుంచగానే అక్కడే ఆచోటనే నా సద్గురువువయిన
నీచరణకమలాలనే స్పృశిస్తున్న అనుభూతి నాకు కలుగుతుంది” అని వినమ్రంగా బాబాకు విన్నవించుకుంటు ముగిస్తున్నాను.
(వ్రాసినవారు;
ప్రొఫెసర్ హేమలతా సుధాకర్ జోషి (నిమోన్ కర్ – దేశ్ పాండే)
నానాసాహెబ్
నిమోన్ కర్ దేశ్ పాండే గారి మునిమనుమరాలు
సద్గురు
సాయిబాబాకు అత్యంత ప్రియమైన భక్తురాలు)
పూనా (మహారాష్ట్ర)
(ఆమె
తన సెల్ నంబరు కూడా ఇవ్వడంతో ఈ రోజు ఆమెకు ఫోన్ చేశాను. అంతకు ముందు అనగా ఈరోజే మైల్ కూడా పంపించాను. సమాధానం రాకపోవడంతో సెల్ నంబరుకు ఫోన్ చేశాను. ఆవిడ కుమార్తె ఫోన్ తీశారు. ఆవిడ ఢిల్లీ వెడుతున్నానని ప్రయాణంలో ఉన్నానని చెప్పారు. కాని ఆవిడ చెప్పిన విషయం చాలా బాధ కలిగించింది. ఆమె తల్లిగారు అనగా హేమాజోషీ గారు క్రిందటి నెలలో
అనగా అక్టోబరు 1వ.తారీకున కాలం చేశారని చెప్పారు.
ఆవిడ సాయిబాబాలో ఐక్యమయ్యారు. తరువాత
సుధాకర్ జోషీ గారితో కూడా మాట్లాడాను. చాలా
సంతోషం వేసింది. ఎంతో నమ్రతగా నాతో మాట్లాడారు.
వారి ఫొటోలన్నీ రేపు ప్రచురిస్తాను.)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment