02.05.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు –
బాబా సమాధానాలు – 7
ఇందులోని విషయాలను ఎవరయినా తమ
స్వంత బ్లాగులో ప్రచురించదలచుకున్నట్లయితే ముందుగా నాకు తెలియపరచవలసిందిగా నా మనవి.
శ్రీ సాయి సత్ చరిత్ర సందేహాలు
– బాబా సమాధానాలు - 6కు
సాయిభక్తుల స్పందన
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై, మీరు అన్వయించిన భగవద్గీత శ్లోకం ద్వారా చక్కగా అర్ధమవుతుంది అన్నిటిలోను
బాబాగారిని చూడాలని. చాలా విషయాలని సంగ్రహించే ఓపికని బాబాగారు మీకు ప్రసాదించి తద్వారా మా అందరికీ అందించారు.
బాబాగారి కోపం తల్లి తన పిల్లలపై చూపే కోపంలాంటిదని
ఆయన ఏమి చేసిన మనకోసమే
అన్న విషయం చాలా చక్కగా అవగతం అవుతుంది.
శ్రీ పార్ధసారధిగారు, పాలకొల్లు
: చక్కటి విశ్లేషణ. బాబా కోపం గురించి నాకూ సందేహం ఉండేది. కాని జ్ఞానికోపం వారిని అనుసరించే
వారి సహనానికి పరీక్షగా భావించవచ్చు అనిపించింది.
శ్రీమతి కాంతి, మణికొండ,
హైదరాబాద్ : నిజంగా బాబా గురించి నాకు ఇదే సందేహం ఉండేది. ఆయన ఎందుకు కోప్పడేవారు అని. మీరు అన్నట్టు దేవుడికి అందరూ పిల్లలే. పిల్లలు తప్పుచేస్తే దండించే తండ్రి
కోపమే బాబాది కూడా. మీరు
రాసిన నారదీయ భక్తిసూత్రాల్లో విషయం లోకంలో జరిగే కీడు గురించి బాధపడకు. దాని వెనుక రాబోయే దైవం యొక్క అనుగ్రహాన్ని
తలుచుకుని నిశ్చింతగా ఉండు అని. విష్ణు సహస్ర నామాలలో ఉంది భయకృద్
…. భయనాశన…. అని. పరీక్ష
పెట్టిన ఆయనే ఈ పరిస్థితిని బాగుచేస్తారు అని నమ్ముతున్నాను. మంచి విషయాలు చెబుతున్నారు. ధన్యవాదాలు.
శ్రీమతి శారద, ముంబాయి : సత్
చరిత్రలోని కొన్ని సందర్బాలలో బాబా కోపించటం వెనుక ఇంత పరమార్ధం ఉందని, ఆధ్యాత్మిక దృష్టిననుసరించి దైవత్వాన్ని మేల్కొల్పడమనే సూక్ష్మ విషయాన్ని తెలుసుకున్నాం. మీరు సరళమైన ఉదాహరణలతో వివరించారు. అదే సమయంలో ఇతర గ్రంధాల్లో విషయాలు
కూడా తెలుసుకోగలుగుతున్నాం. శ్రీయుతులు త్యాగరాజు గారికి ధన్యవాదాలు.
17.04.2020 న
నాకు కలిగిన సందేహం. బాబాను ఈ విధంగా అడిగాను. బాబా, మౌసీబాయి నీ పొత్తికడుపును తోము సందర్భములో ఇతర
భక్తులు మెల్లగా తోముము అన్నపుడు నీవు వెంటనే లేచి కోపముతో సటకాను నీపొత్తికడుపులో
గుచ్చుకొనుటకు కారణమేమిటి? నా సందేహానికి
సమాధానం 20.04.2020 ఇచ్చారు.
దానికి బాబా సమాధానమ్ : ఉధ్ధవగీత
అనగా నన్ను ఉద్ధవ గీత చదవమని
చెప్పారు.
మొట్టమొదటగా ఉధ్ధవుని గురించి
సంగ్రహంగా తెలుసుకుందాము.
ఉధ్ధవుడు శ్రీ కృష్ణుడికి
చిన్ననాటినుంచే ఎన్నో సేవలు చేసేవాడు. ఆయనే కృష్ణుడికి రధసారధి కూడా.
తను చేసే సేవలకు ఎప్పుడూ శ్రీకృష్ణునినించి ఎటువంటి ప్రతిఫలాన్ని
ఆశించలేదు.
శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో తన అవతారం చాలించే ముందు ఉద్ధవుడిని పిలిచి, “ఉధ్ధవా, నా అవతారకాలంలో ఎంతోమంది నానుంచి ఎన్నో వరాలను పొందారు. కాని నీవు ఎన్నడూ నన్ను ఏదీ కోరలేదు. నీకేదయినా ఇవ్వాలని ఉంది నాకు. నీకేమి కావాలో కోరుకోమని ఎంతో ప్రేమగా అన్నాడు.
శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో తన అవతారం చాలించే ముందు ఉద్ధవుడిని పిలిచి, “ఉధ్ధవా, నా అవతారకాలంలో ఎంతోమంది నానుంచి ఎన్నో వరాలను పొందారు. కాని నీవు ఎన్నడూ నన్ను ఏదీ కోరలేదు. నీకేదయినా ఇవ్వాలని ఉంది నాకు. నీకేమి కావాలో కోరుకోమని ఎంతో ప్రేమగా అన్నాడు.
అప్పుడు ఉధ్ధవుడు, “ఓ దేవా నీలీలలను
అర్ధం చేసుకోవటం మానవుల వల్ల కాదు.
నాకు ఎటువంటి వరము వద్దు. కాని నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుదామని
ఉంది. అడగమంటావా?
అని ఎంతొ వినయంగా అన్నాడు.
ఆసమయంలో ఉధ్ధవుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానాలే
ఉధ్ధవ గీతగా మనకి లభ్యమయింది. ఈ ఉధ్ధవ గీత శ్రీకృష్ణునియొక్క ఆఖరి సందేశం.
(ఇపుడు నాకు కలిగిన
సందేహానికి సంబంధించి శ్రీ సాయి సత్ చరిత్రలోని సంఘటన)
శ్రీ సాయి సత్ చరిత్ర అ.24 : మావిశీబాయి బాబా పొత్తికడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును జూచి,
ఇతర భక్తులు ఆతురపడిరి.
వారిట్లనిరి. “అమ్మా, కొంచెము మెల్లగా తోముము. బాబా కడుపులోని ప్రేవులు, నరములు తెగిపోగలవు” ఇట్లనగనే, బాబా
వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై గొట్టెను. వారి కండ్లు నిప్పు కణములవలె ఎఱ్ఱనాయెను. బాబాను జూచుటకెవ్వరికి ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తికడుపులోనికి గ్రుచ్చుకొనెను. ఇంకొక చివరను స్థంభమునకు నానించెను. సటకాయంతయు పొత్తికడుపులో దూరినట్లు
కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో
పొత్తికడుపు ప్రేలుననుకొనిరి. బాబా క్రమముగా స్థంభమువైపు పోవుచుండెను. అందరు భయపడిరి. ఆశ్చర్యముతోను, భయముతోను మాట్లాడలేక మూగవాండ్రవలె నిలిచిరి. బాబా తన భక్తురాలికొరకు ఈ కష్టము
అనుభవించిరి. తక్కిన
భక్తులు ఆమెను బాబాకు హానిలేకుండ తోముమనిరి. మంచి యుద్దేశముతో వారు ఈ మాటలనిరి. దీనికి కూడా బాబాయొప్పుకొనలేదు. వారి మంచి యుద్దేశమే బాబాను కష్టములో
దించినందుకు వారాశ్చర్యపడిరి. ఏమియు చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటినుండి భక్తుల ఇష్టానుసారము
సేవచేయునప్పుడు ఇతరులు జోక్యము కలుగజేసికొనరాదను నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ యెట్టిదో బాబాకే గుర్తు.
నాకు కలిగిన సందేహానికి సమాధానంగా బాబా నన్ను ఉధ్ధవగీతను చదవమని చెప్పారు. ఇక ధ్యానంలోనుండి లేచి అంతర్జాలంలో
ఉధ్ధవగీత గురించి శోధించాను. అందులో ఉధ్ధవగీత ఆంగ్ల పుస్తకం
382 పేజీలది కనిపించింది.
అందులో ఉదాహరణగా కొన్ని కొన్ని అధ్యాయాలకి నాలుగయిదు శ్లోకాలు
మాత్రమే ఇవ్వబడ్డాయి. అదృష్టవశాత్తు నాసందేహానికి సమాధానంగా రెండు మూడు శ్లోకాలు కనిపించాయి. ఇక ఉధ్ధవ గీతగురించి మరంతగా వెదకినా నా సందేహానికి తగ్గ
సమాచారం దొరకలేదు. మూడు
నాలుగు శ్లోకాలు మాత్రమే దొరకడానికి కారణం బాబాయే తప్ప మరెవరూ
కాదు.
ఉధ్ధవగీత - భాగవత ధర్మాలు
శ్రీకృష్ణుడు ఉధ్ధవునితో --- ఉధ్ధవా! నా భక్తులు
ప్రతి కార్యాన్ని నాకొరకే చేస్తుంటారు.
అన్నీ నాకే అర్పిస్తుంటారు. అలా అభ్యాసం చేసుకుని ఆపనులు చేసేటపుడు
నాస్మరణాన్ని అధికం చేస్తారు. మరికొంతకాలానికి వారి మనస్సు చిత్తం నాలో సమర్పితమవుతాయి. మనస్సు, ఆత్మ
నాధర్మ కార్యాలలో రమిస్తుంటాయి. నా భక్తవరేణ్యులు నివసించే చోటగల దేవ అసుర మనుష్య జాతులు నా అనన్య భక్తుల కార్యాచరణం
వలన వారుకూడా ప్రభావితులై భక్తులట్లే నిత్య కార్యక్రమాలను అనుసరించి పునీతులవుతారు.
ఉధ్ధవగీతలో నాకు లభించిన సమాధానం…(సంస్కృతంలో ఉన్న శ్లోకాలు
ఆంగ్లంలో ఉన్న వ్యాఖ్యలకు వాటికి తెలుగు అనువాదమ్)
ఉధ్ధవ గీత – 22 వ.శ్లోకం ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు, అడ్డంకులు లేకుండా
తన విధిని సరిగా నిర్వర్తించినవాడు దివ్యమయిన లోకాలకు చేరుకుంటాడు.
శ్లో. 23 ఎటువంటి
ఫలాపేక్ష లేకుండా భగవంతునికి సేవ చేసినవాడు స్వర్గలోకానికి వెళ్ళి
భగవంతునితో కూడి దేవతలందరితో సమానంగా సుఖాలనుభవిస్తాడు. ఇది స్వయంగా తాను చేసుకున్న పుణ్యం. నిస్వార్ధంగా చేసిన పని మంచి ఫలాలనందిస్తుంది.
శ్లో. 24 ఆవిధంగా
తను చేసిన మంచి పనులవల్ల అందమయిన వస్త్రధారణతో, పుష్పకవిమానంలో
గంధర్వలోకానికి వెళ్ళి అప్సరసల సాహచర్యంలో ఆనందాన్ననుభవిస్తాడు.
శ్లో. 25 అటువంటి
అదృష్టవంతుడు స్వర్గలోకంలో అప్సరసలతో కలిసి చిరుమువ్వలు కట్టబడిఉన్న వాహనంలో ఆశీనుడై, భగవంతుని రాజ్యంలో తను కోరుకొన్న చోటకు వెళ్ళి
సంచరిస్తూ ఉంటాడు. ఆ
సమయంలో అతనికి తాను మరలా భూమిపై జన్మించవలసిఉంటుందనే ఆలోచన కూడా రాదు. (కాని మరలా జన్మ తప్పనిసరి)
అతనియొక్క పుణ్యఫలం పూర్తయేంతవరకు
స్వర్గలోకంలో విహరిస్తూ, ఆ ఫలం పూర్తయిన వెంటనే అతనికి ఇష్టం లేకపోయినా సరైన సమయం వచ్చినపుడు మరలా భూమిపై జన్మించక తప్పదు.
శ్రీకృష్ణుడు ఉధ్ధవునితో మరొక
విషయం చెప్పాడు.
ఉధ్ధవా ! ఒక్కమాట గుర్తుంచుకోవాలి. నా భక్తులైనవారికి గర్వము,
మాత్సర్యము (ద్వేషము, పగ) ఉండకూడదు. వారు కార్యదక్షులై ఫలాపేక్షరహితులై
ఉండాలి. వారి హృదయంలో
ప్రేమరసం నిరంతరం జాలువారుతుడాలి. వారికి తొందరపాటు పనికిరాదు.
తత్వార్ధజ్ఞానమును సంపాదించుటలో తీవ్రమయిన అభిలాష ఉండవలెను. మనస్సులో అసూయకు ఎంతమాత్రము తావుండరాదు. ఏమాత్రము ఏవో వ్యర్ధకార్యకలాపాలతో
కాలం వెళ్ళబుచ్చరాదు. ఏఆత్మ తనలో ఉన్నదో అదే ఇతరులలోను ఉన్నదని గ్రహించి అందరియందు సమదృష్టితో మెలగవలెను. ఉదాసీనుడై వ్యవహరించవలెను.
ఇపుడు శ్రీమద్భగవద్గీతలోని కొన్ని
శ్లోకాలను పరిశీలిద్దాము..
శ్రీమద్భగవద్గీత అ.6 శ్లో.
47
యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా
శ్రధ్ధావాన్ భజతే యో మాం స మే
యుక్తతమో మతః
యోగులందరిలోను ఎవడు నాయందు మనస్సును
నిలిపి శ్రధ్ధతో నన్ను ధ్యానించుచున్నాడో అట్టివాడు సర్వశ్రేష్టుడని ఆ యభిప్రాయము.
ఇక్కడ శ్రధ్ధావాన్ అని చెప్పుటవలన
సాధకుడు అత్యంతశ్రధ్ధ కలిగి భగవంతుని సేవింపవలెనని స్పష్టపరచబడింది. అశ్రధ్ధతో చేసిన కార్యము చేయనిదానితో
సమానమె అని కూడా ( 17 – 28 ) చెప్పబడింది.
అనన్యాశ్చిన్తయన్తోమాం
యేజనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం
వహామ్యహమ్ (అ.9 శ్లో22)
భగవంతునియందు భక్తిలేకున్న యజ్ఞ
యాగాది క్రతువుల వల్ల గాని, వేదాధ్యయానాదుల వల్లగాని తపస్సువలన గాని లాభము లేదు. అన్నిటికీ భక్తి ప్రధానము. భక్తియున్న సర్వఫలములు పొందవచ్చు. మానవ జన్మ ఉత్తమమైనదే. అయినను మానవుడు భక్తివలన గాని తరింపడు.
భగవద్గీత అ.12 భక్తియోగము
శ్లో. 2
మయావేశ్య మనో యేమాం నిత్యయుక్త
ఉపాసతే
శ్రధ్ధయా పరయోపేతాస్తే మే యుక్త
తమా మతాః
నాయందు మనస్సును నిలిపి నిరంతర
దైవచింతనాపరులై (తదేకనిష్టులై) మిక్కిలి శ్రధ్ధతో కూడుకొనినవారై యెవరు
నన్నుపాసించుచున్నారో వారే ఉత్తమ యోగులని నా అభిప్రాయము. మనస్సును పరమాత్మయందు నిలుపుట నిరంతరము
దైవ చింతనాపరులై యుండుట మిక్కిలి శ్రధ్ధతో కూడుకొని యుండుట.
ఇప్పుడు పైన చెప్పిన శ్లోకాలయొక్క
అర్ధాలను చదివిన తరువాత మనందరికి బాగా అర్ధమయిందనుకుంటాను.
మావిశీబాయి ఎంతో భక్తితో శ్రధ్ధతో బాబాకు
సేవ చేస్తూ ఉంది. మధ్యలో ఇతరులు ఆవిధంగా
చేయకు బాబాకు ఇబ్బంది కలుగవచ్చని చెప్పడం వల్ల ఆమె దీక్షగా చేస్తున్న పనిలో కాస్త అంతరాయం
కలుగవచ్చు. తను ఆవిధంగా గట్టిగా తోమడం వల్ల నిజంగానే బాబా ప్రేగులు తెగిపోయేలా
ఉన్నాయేమో. తను సరిగా గమనించటల్లేదేమో అని ఆమె భావించవచ్చు. వారి మాటలకు
ఆమె తను చేసే పని మధ్యలో ఆపి వేయవచ్చు లేక కాస్త నెమ్మదించవచ్చు. అందువల్ల ఎవరయినా అంకితభావంతో సేవచేస్తున్నపుడు
అంతరాయం కలిగించరాదు. అది మానవ సేవయినా కావచ్చు లేక మాధవ సేవయినా కావచ్చు. నిస్వార్ధంగా సేవ చేసే వారు ఎటువంటి
పుణ్యఫలాలను పొందుతారో పై శ్లోకాలలో విశదంగా వివరింపబడింది.
మావిశీబాయి చేసే సేవకి మధ్యలో
అంతరాయం కలుగుతున్నందువల్లనే బాబాకు అంత కోపం వచ్చిందని మనం అర్ధం చేసుకోవచ్చు. అటువంటప్పుడు బాబా అంతలా ప్రవర్తించడం
దేనికి? కాస్త సౌమ్యంగా
అసలు విషయం చెప్పవచ్చు కదా అనే సందేహం మనకి రావచ్చు.
ఉధ్ధవగీతలో చెప్పినట్లు భక్తులకు
తొందరపాటు పనికిరాదు. అసూయ పనికిరాదు. ఒకరు సేవచేస్తున్నపుడు కీర్తి అంతా
వారికే వచ్చేస్తుందేమో, వారికెందుకు రావాలి? ఆ కీర్తి ఏదయితే ఉందో అది మనమె కొట్టేస్తే పోలా అనే అసూయతో
సేవచేస్తున్నవారిని మధ్యలోనే ఆపడానికి ప్రయత్నించకూడదు.
కాని ఇక్కడ మసీదులో ఉన్న భక్తులకు
అటువంటి రాగద్వేషాలు లేవని మనం గ్రహించాలి. బాబాకు బాధకలుగుతుందేమోననే ఉద్దేశ్యంతోనే
వారావిధంగా అనడం జరిగింది.
కాని ఈ సంఘటన ద్వారా బాబా మనందరికి
ఉధ్ధవగీత ద్వారా ఒక మంచి సందేశాన్నిచ్చారు.
కొందరు భక్తులు మధ్యలో కల్పించుకోవడం
వల్ల, బాబాకు మరీ ఇబ్బంది కలుగుతున్నదేమో అనే భావం మావిశిబాయికి కలగవచ్చు.
అందువల్ల తను దీక్షతో చేసే పని మధ్యలోనే వదలి వేయవచ్చు, లేక వారు అన్నట్లుగానే బాబా పొత్తికడుపును
మెల్లగా తోమే ప్రయత్నం చేయవచ్చు. దానివల్ల ఆమె చేసే పనివల్ల అందబోయే పుణ్యఫలం ఆమెకు అందకుండా
పోవునేమో ? అది బాబా
మాత్రమే గ్రహించుకోగలరు ఆయనకు సర్వం తెలుసును
కాబట్టి. అందువల్లనే
బాబాకు అంత ఆగ్రహం కలిగి ఉండవచ్చు.
ఆవిధంగా చేయడం వల్ల భక్తులందరికి ఆ సంఘటన బాగుగా గుర్తిండిపోయి
ఇక ముందెప్పుడూ ఎవరయినా సేవ చేస్తున్నప్పుడు మధ్యలో కల్పించుకోకుండా ఉంటారు.
(ప్రస్తుతానికి సందేహాలు – సమాధానాలు
సశేషం.. మరలా బాబా ఎపుడు చెబితే అప్పుడు మీకు అందిస్తాను)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
1 comments:
నాచేత బాబా సేవ చేయించుకుంటున్నారు అనే భావన ఆమెది. నేను సేవ చేస్తున్నాను అనే భావన తక్కిన వారిది.
చక్కగావివరించారు. ధన్యవాదములు.
...పార్థసారథి
Post a Comment