30.04.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో
నాకు కలిగిన సందేహాలు
బాబా సమాధానాలు - 6
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
ఇందులోని విషయాలన్నిటిని ఎవరయినా తమ స్వంత బ్లాగులో ప్రచురించదలచుకున్నట్లయితే ముందుగా నాకు తెలియపరచవలెను.
శ్రీ సాయి సత్ చరిత్ర
సంధేహాలు – బాబా
సమాధానాలు - 5 కు సాయిభక్తుల స్పందన
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై
– వేపచెట్టులో అణువణువు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది. బాబాగారు వేపచెట్టు క్రింద ప్రశాంతంగా ఉంటుందని కూర్చొని ఉంటారనుకున్నాను. కాని దాని వెనుక ఇన్ని విషయాలు
దాగున్నాయని ఇప్పుడె తెలుసుకున్నాను.
మన అమ్మమ్మల కాలంలో ఇంటికి ఒక వేప చెట్టు ఉండేది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో
ఇక్కడ చెన్నైలో అందరూ ఇంటి గుమ్మానికి మామిడి తోరణంగా కడుతున్నారు. చాలా తెలియని విషయాలు
తెలుసుకున్నాను.
శ్రీమతి కిరణ్మయి, షికాగో,
ఇల్లినాయిస్ - ఈ ప్రశ్న బాగుంది
శ్రీమతి మాధవి, భువనేశ్వర్ – మంచి సందేహాలు అడుగుతున్నారు. అందరికీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. వేపచెట్టు గురించి చాలా
బాగుంది. ఇక్కడ పూరీ జగన్నాధ్ లో
విగ్రహాలను వేపమద్దితోనే చేస్తారు. అది శ్రీమహావిష్ణువు కూడాను.
శ్రీమతి కాంతి, మణికొండ, హైదరాబాద్ : బాబా చెప్పటానికి
ఇష్టపడలేదు అంటే అది భక్తులకు మంచికోసమే. వేపచెట్టు
గురించి విశేషాలు అధ్భుతం సర్. మీ సహనం బాబా
అనుగ్రహమే.
16.04.2020 : ఈ రోజు బాబాకు తెలిపిన నా
సందేహం.. “బాబా, ఏదయినా కొత్తపని ప్రారంభించెనపుడెల్లా నువ్వు ఎందుకని
కోపిస్తూ ఉండేవాడివి?
బాబా సమాధానమ్ : ఆధ్యాత్మికత పెట్టు
ఇదే ఆయన చెప్పినది. ఇక ధ్యానంలోనుండి లేచి, గూగుల్ లో Anger and Spirituality అని కొట్టి
శోధించాను. సమాచారం
చాలా చిన్నది. ఒక అయిదు వాక్యాలు మాత్రమే ఉంది. అంతకన్న ఎక్కువ సమాచారం దొరకలేదు. నాలుగయిదు వాక్యాలు మాత్రమే
ప్రచురించడానికి నాకే తృప్తి కలగలేదు.
దానినే కాస్త అనువాదం చేసి ఇంకా మరికొంత ఆధ్యాత్మిక విషయాలను
జోడించి మీకు అందిస్తున్నాను.
సాయంత్రం మళ్ళి నేను శోధించినదానిని ఒకసారి చూసుకున్నాను. బాబా చెప్పినదానికి నేను సరిగానే
వెతికానని అనిపించింది. ఆయన ఆధ్యాత్మికత పెట్టు అన్నారు. అంటే కోపానికి ఆధ్యాత్మికతను
కలిపి వెతకమని ఆయన ఉద్దేశ్యం అని గ్రహించాను.
శ్రీ సాయి సత్ చరిత్ర అ.6 : శ్రీరామనవమినాడు షిరిడీలో ఉత్సవం జరపడానికి భక్తులందరూ
నిర్ణయించారు. మసీదును చక్కగా అలంకరించారు. రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చింది. దానిని బాబా ఆసనం ముందు
వ్రేలాడగట్టారు. శ్రీరామజన్మదినోత్సవ వేడుక ప్రారంభమయింది. హరికధ ప్రారంభమయింది. రామకధాసంకీర్తనం ముగిసినవెంటనే బాజాభజంత్రీద్వనుల
మధ్య ‘శ్రీరామచంద్రమూర్తికీ జై’ అని జయజయధ్వానములు చేస్తూ పరమోత్సాహంతో అందరూ
ఒకరిపైఒకరు ‘గులాల్’ (ఎఱ్ఱరంగు పొడి) చల్లుకొన్నారు. అంతలో ఒక గర్జన వినపడింది. భక్తులు చల్లుకొంటున్న గులాల్
ఎలా పడిందో బాబా కంటిలో పడింది. బాబా కోపంతో బిగ్గరగా తిట్టడం ప్రారంభించారు. ఇది చూసి చాలా మంది భయంతో
పారిపోయారు. కాని బాబా యొక్క సన్నిహితభక్తులు మాత్రం అవన్నియు
తిట్లరూపముగా బాబా తమకిచ్చిన యాశీర్వాదములని గ్రహించి కదలకుండా అక్కడే వున్నారు. శ్రీరామజయంతినాడు రావణుడనే
అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీసాయిరూపములో ఉన్న శ్రీరాముడు
ఆగ్రహించుట సహజమేకదా అని భావించారు. షిరిడీలో ఏదైన క్రొత్తది
ప్రారంభించునపుడెల్లా బాబా కోపించుట యొక రివాజు.
శ్రీసాయి సత్ చరిత్ర అ.25 : దామూ అన్నాకు ఇద్దరు భార్యలు కలరు. కాని అతనికి సంతానము లేదు. అనేక జ్యోతిష్కులను
సంప్రదించాడు. అతను కూడా జ్యోతిష్యము
కొంతవరకు చదివాడు. తన జాతకములో దుష్టగ్రహప్రభావం ఉండటంవల్ల సంతానం కలిగే
అవకాశం లేదనుకొన్నాడు. కాని అతనికి బాబాయందు మిక్కిలి నమ్మకం ఉంది. అంతముకుందే ఒక మామలతదారు
బాబాకు 300 మామిడిపండ్ల బుట్టను పంపించాడు. బాబా వాటిలోనుండి 4 పండ్లను శ్యామా, బాబా కొలంబాలో పెట్టాడు. “ఈ నాలుగు పళ్ళు దాము అన్నాకు, అవి అక్కడె ఉండాలి” అన్నారు బాబా.
మామిడిపండ్లు బాబాకు అందిన
రెండు గంటలకు దామూ షిరిడీ వచ్చి బాబాకు నమస్కరించడానికి రాగా “బాబా ఈ విధంగా అన్నారు. “అందరూ మామిడిపండ్లవైపే
చూస్తున్నారు. కాని అవి దాము కొరకు ఉంచినవి. కావున అవి దామ్యా తిని
చావవలెను” ఈ మాటలను విన్న దామూ
భయపడ్డాడు. కాని మహల్సాపతి బాబా అన్న మాటలని ఇలా సమర్ధించాడు. “చావమనునది అహంకారమును గురించి. దానిని బాబాముందు చంపుట యొక
ఆశీర్వాదము”.
శ్రీ సాయి సత్ చరిత్ర అ.6 : మసీదుకు మరమ్మత్తులు చేయు సందర్భములో 1911వ.సంలో సభామండపాన్ని పూర్తి
చేసారు. కాకాసాహెబ్ దీక్షిత్ మసీదును
విశాలంగా తీర్చి దిద్దుదామని పైకప్పు వేసే ఉద్దేశ్యంతో ఇనుపస్థంభాలను
తెప్పించి పని ప్రారంభించాడు. రాత్రంతా శ్రమపడి స్థంభాలను నాటేవారు. మరుసటిరోజు ప్రాతఃకాలముననే
బాబా చావడినుండి వచ్చి అంతా చూసి కోపంతో స్థంభాలన్నిటిని పీకి పారేసేవారు. ఒక సారి బాబా మిక్కిలి కోపంతో
నాటిన ఇనుపస్థంభాన్ని ఒక చేతితో పెకలిస్తూ రెండవచేతితో తాత్యాపాటిలు పీకను
పట్టుకొన్నారు. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో
నిప్పంటించి, ఒక గోతిలో పారేసారు. బాబా కళ్ళు నిప్పుకణాల్లా
వెలుగసాగాయి. ఎవ్వరికీ బాబావైపు చూడటానికి ధైర్యం చాలలేదు. అందరు భయంతో వణికిపోతున్నారు. బాబా తన జేబులోనుంచి ఒక
రూపాయి తీసి అటువైపు విసిరారు. అది శుభసమయమందు చేసే ఆహుతివలె కనిపించింది. తాత్యాకూడా చాలా భయపడ్డాడు. తాత్యాకు ఏమి జరుగబోతోందో
ఎవ్వరికీ ఏమీ తెలియటల్లేదు. బాబాపట్టునుండి తాత్యాను విడిపించుటకు ఎవ్వరికీ
ధైర్యం చాలటల్లేదు. ఇంతలో కుష్టురోగియైన బాబా భక్తుడు భాగోజీ షిండే కాస్త
ధైర్యం చేసి ముందుకు వస్తుండగా బాబా వానిని ఒక ప్రక్కకు తోసివేసారు. మాధవరావు సమీపిస్తుంటే బాబా
అతనిమీద ఇటుకరాయిని రువ్వారు. ఎవరు వస్తే వారికి అదే గతి పట్టింది. కాని కొంతసేపటికి బాబా
శాంతించారు. ఒక దుకాణదారుడిని పిలిపించి అతనివద్దనుంచి ఒక నగిషీ
జరీపాగాను కొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటకా అన్నట్జు స్వయముగా తాత్యా తలకు
చుట్టారు బాబా. ఈ వింత చర్యకు అందరూ
ఆశ్చర్యపడ్డారు. అంత త్వరగా బాబాకు ఎట్లు కోపం వచ్చింది? ఎందుచేత ఆ విధంగా తాత్యాను శిక్షించారు? ఆయన కోపం తక్షణమే ఎట్లు
చల్లబడింది? అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. బాబా ఒక్కొక్కప్పుడు
శాంతమూర్తివలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగాలతో మాట్లాడుతూఉండేవారు. అంతలోనే అకారణంగా కోపిస్తూ
ఉండేవారు.
పై సంఘటనలు బట్టి మనం
గ్రహించుకోవలసినది ఏమిటంటే ఆయనలో కలిగే కోపం నిజమయిన కోపం కాదు. ఆయన ఆవిధంగా కోపంతో ఉన్నారంటే
ప్రారంభించబోతున్న పనికి ఆశీర్వాదాన్నికోరుతూ దేవుడిని కాని, దేవతను కాని ఆహ్వానించడం… ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే దైవత్వాన్ని మేల్కొలపడం.
ఇక్కడ మనకొక అనుమానం రావచ్చు. భగవంతుని ఆశీర్వాదాన్ని
కోరుకోవడానికి ఆమాత్రం కోపగిస్తూ ఆహ్వానించాలా? చేతులు జోడించి ప్రార్ధిస్తే
చాలదా అని.
ఇపుడు మన ప్రవర్తన గురించే
ఉదాహరణగా తీసుకుందాము. మన పిల్లలు తప్పు చేస్తున్నారనుకోండి. మనకు వెంటనే కోపం వస్తుంది. వాళ్ళని దండిస్తున్న రీతిలో
కోపంతో కేకలు వేస్తాము. మనం వారి మీద ద్వేషంతో కోపగించము కదా. వాళ్ళను సరైన దారిలో
నడిపించడానికి, క్రమశిక్షణలో ఉంచడానికి మనం
ఆవిధంగా ప్రవర్తిస్తాము. దాని వల్ల పిల్లలు కూడా భవిష్యత్ లో తాము చేసే పనులలో
ఎటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతారు. ఒక్కొక్కసారి మెల్లిగా చెబితే
పిల్లలు వినరు కదా. భగవంతుని దృష్టిలో మనందరం ఆయన పిల్లలమే. భగవంతుడు ఎప్పుడూ మన మంచే
కోరతాడు.
ఇక్కడ బాబాగారి కోపాన్ని, ఆయన తిట్టే తిట్లను భక్తులు ఆశీర్వాదాలుగా
భావించేవారు. ఆయన కోపానికి గురికాకూడదనే ఉద్దేశ్యంతో వారుకూడా ఎంతో
భయభక్తులతో తాము చేసే పనులలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా జాగ్రత్త పడేవారు.
ఒకానొక సందర్భంలో బాబా అన్న
మాటలు.. శ్రీ సాయి సత్ చరిత్ర అ. 11 నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి
ఎరుగను. తల్లి తన బిడ్డలనెక్కడైనా
తరిమివేయునా? సముద్రము తనను చేరు నదులనెప్పుడైన తిరుగగొట్టునా? నేను మిమ్ములనెందుకు
నిరాదరించెదను? నేనెప్పుడూ మీ యోగక్షేమములనే ఆపేక్షించెదను. నేను మీసేవకుడను. నేనెప్పుడూ మీవెంటనే యుండి, పిలచిన పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీప్రేమను
మాత్రమే”
శ్రీ సాయి సత్ చరిత్ర అ.9 “ ఈ మసీదులో గూర్చుండి నేనసత్యమాడను”
ఆయనలో కలిగే కోపం సహజమయిన కోపం
కాదు. ఆయన ఆవిధంగా కోపంతో ఉన్నారంటే
భగవంతుడినుంచి గాని, దేవతనించి కాని, చేయబోయే
పని ముందుకు సాగాలని వారికి ఆహ్వానం పలకడమే. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే
దైవత్వాన్ని మేల్కొలపడం.
ఒకవేళ ఎవరయినా తప్పు
చేస్తున్నపుడు మనం కోపం ప్రదర్శించిన్ట్లయితే అది ఒక మంచి ప్రతిస్పందన మాత్రమే
కాని అది వారిమీద ద్వేషంతో చూపించే కోపం కాదు. దాని వల్ల అది అవతలివారిమీద శాపం కాక, ఒక విధమయిన
ఆశీర్వాదాన్ని సృష్టిస్తుంది.
ఇక పైన ఇచ్చినవన్నీ బాబా గారి
కోపానికి ఉదాహరణలుగా ఇవ్వడం జరిగింది. కాని కోపానికి ఆధ్యాత్మికతకి
ఇచ్చిన వివరణ చాలా చిన్నది. (గూగుల్ లో వెదకినప్పుడు) చదవడానికి నాకే తృప్తి కలగలేదు. ఇంకా ఏదో వెతికి చూడాలనే తపన. శ్రీమద్భగవద్గీత లోని ఈ శ్లోకం కనిపించింది. దానినే శ్రీసాయి సత్
చరిత్రలోని బాబా కోపానికి అన్వయిస్తూ మన సాయిభక్తులందరికీ అందిస్తున్నాను.
యో మాం పశ్యతి
సర్వత్ర సర్వం చ మయి పశ్యతి
తస్యాహం న
ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి
(భగవద్గీత అ.6 శ్లో.30)
ఎవడు సమస్త
భూతములందును, నన్ను చూచుచున్నాడో, మరియు నన్ను సమస్త భూతములందును గాంచుచున్నాడో అట్టివానికి నేను కనబడకపోను, నాకతడు కనబడకపోడు.
నారద భక్తి
సూత్రాలలోని 61వ. సూత్రం
“లోక హానౌ
చింతా న కార్యా నివేదితాత్మ లోక వేదర్వాత్”
(లోకంలో
ప్రతికూలత/వ్యతిరేక పరిస్థితి ఎదురయినప్పుడు దాని గురించి శోకించకు,
చింతించకు. దానిలో భగవత్ అనుగ్రహాన్ని గుర్తించు.)
(ఇప్పుడు పైన చెప్పబడిన
నారద భక్తి సూత్రాన్ననుసరించి శ్రీ సాయి సత్ చరిత్రకు అన్వయించే ప్రయత్నం చేస్తాను. ఏదయినా కొత్త పని
ప్రారంభించినపుడు బాబా కోపగించడం ఒక వ్యతిరేక పరిస్థితి అని అనుకుంటే దాని గురించి
చింతించకుండా భగవత్ అనుగ్రహాన్ని గుర్తించమనే భావాన్ని గ్రహించుకున్నాను… త్యాగరాజు)
భగవంతుని వీడటం అంటే మన మనస్సుని ఆయననుండి
దూరం చేసుకోవటం. ఆయనతో
ఉండటమంటే మన మనస్సుని ఆయనతో ఏకం చేయడం.
ఆవిధంగా ఏకం చేయడమంటే మనం చేసే ప్రతి పనిలోను ఆయనను
దర్శించడం. మన
సహజమయిన స్వభావం ఏమిటంటే ఎదుటివారు మనలని ద్వేషించినా, లేక
కోపగించిన హాని చేసినా మనం కూడా వారిమీద కోపాన్ని, ద్వేషాన్ని
పెంచుకుంటాము. ఆవిధమయిన
ప్రవర్తన మనలో ఉన్నట్లయితే భగవంతునితో మనకు గల సంబంధం తెగిపోతుంది. దానికి బదులుగా మనపై కోపించిన
వ్యక్తిలో భగవంతుడిని దర్శించగలిగితే మన మనస్సులోని భావాలు మారిపోతాయి. ఎదుటివ్యక్తిలో కూడా భగవంతుడె
ఉన్నాడు కదా, అతని ద్వారా నన్ను పరీక్షిస్తున్నాడేమో? ఈ సంఘటన నన్ను ఏమాత్రం
బాధింపకుండా నిబ్బరంగా ఉంటాను” అని ఆలోచిస్తే మనలో ఎటువంటి
చెడు ఆలోచనలు రాకుండా మనకు మనమే నిరోధించుకోగలం.
ఇక బాబాగారి కోపాన్నే మనం పరిగణలోనికి
తీసుకుంటే భక్తులు కూడా ఆయనను భగవంతునిగానే గుర్తించారు. అందువల్ల ఆయన తిట్లను కూడా వారు
ఆశీర్వాదాలుగానే భావించారు. అందువల్ల దైవాంశ సంభూతులయిన వారు ప్రదర్శించే కోపం మనలని సన్మార్గంలో
నడిపించడానికి, మనం చేసే పనిలో ఏకాగ్రత చూపి అందులో
సఫలమయ్యేటట్లుగా దీవించడానికేనని మనం గ్రహించాలి.
మన స్వార్ధ ప్రయోజనం ఎందులో ఉందంటే, ఏదో రకంగా మనస్సుని భగవంతుని యందే నిలపటంలోనే. మరియు దీనికి ఒక సులువైన ఉపాయం ఏమిటంటే ప్రతిదానిలో, ప్రతివ్యక్తిలో భగవంతుడిని చూడటం. ఇది, ఈ శ్లోకంలో చెప్పబడిన పరిపూర్ణ స్థాయి దిశగా నెమ్మదిగా తీసుకువెడుతుంది. ఇక అప్పుడు మనం భగవంతుడికి దూరం కాము. మరియు భగవంతుడు మనకు దూరం కాడు.
(రేపు మరొక నా సందేహానికి బాబా సమాధానమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(రేపు మరొక నా సందేహానికి బాబా సమాధానమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
1 comments:
చక్కటి విశ్లేషణ. బాబా కోపం గురించి నాకూ సందేహం ఉండేది. కాని జ్ఞానికోపం వారిని అనుసరించే వారి సహనానికి పరీక్షగా భావించవచ్చు,అనిపించింది.
-పార్థసారథి
Post a Comment