Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, October 7, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 33 వ, భాగమ్

Posted by tyagaraju on 4:35 AM


07.10.2022  శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః 


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 33 వ, భాగమ్

అధ్యాయమ్ – 31

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 8143626744

బాబాని గుర్తించలేకపోయాను

మన దైనందిన జీవితంలో మనకు ఎన్నో చిన్న చిన్న విచిత్రాలు, లీలలు ఎదురవుతూ ఉంటాయి.  మనలో కొంతమంది తమకు ఎదురయిన అనుభవాలను ఇతరులతో పంచుకుంటారు.  మరికొంతమంది తమకు కలిగిన అనుభవాలను తమ మనసులోనే దాచుకుని క్రమంగా మర్చిపోతూ ఉంటారు.  నాకు కలిగిన ఒక అనుభవం నాకింకా గుర్తుంది.  ఒకరోజున నేను నా చిన్న కూతురిని స్కూటర్ మీదఎక్కించుకుని వెడుతున్నాను.  ఆవిధంగా స్కూటర్ నడుపుతూ ఉండగా నామదిలో ఒక ఆలోచన వచ్చింది.  


ఆరోజు ఉదయాన్నే నేను శ్రీ సాయి సత్ చరిత్రలో ఒక అధ్యాయాన్ని చదవడం జరిగింది.  ఆ అధ్యాయంలో ఉన్న విషయాన్ని బట్టి సాయిబాబా తన భక్తులకి ఏదో ఒక రూపంలో వివిధ వేషధారణలలో కనిపించి భోజనం పెట్టమని గాని,  దక్షిణ ఇమ్మని గాని అడుగుతూ ఉంటారు కదా, అవిధంగా ఎలా వస్తారు? అని ఆలోచిస్తూ ఉన్నాను.

నేను ఇంటికి వచ్చిన తరువాత ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతూ ఉన్నాను.  ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.  అపుడు తెల్లటి లుంగీ కట్టుకుని ఉన్న  ఒక వ్యక్తి హాలులోకి వచ్చి నుంచుని ఉన్నాడు.  ఆ వ్యక్తిని మీకేమి కావాలి అని అడిగాను.  ఆవ్యక్తి నాకు దక్షిణ కావాలి అని అన్నాడు.  నేను ఆఫీసుకు వెళ్ళే తొందరలో ఉన్నందున అతనికి కొన్ని రూపాయలిచ్చి బయలుదేరి వెళ్ళిపోయాను.  ఆఫీసులో కొన్ని గంటల తరువాత ఆ సంఘటన గుర్తుకు వచ్చింది.  ఆవ్యక్తి గురించే ఆలోచిస్తూ ఉంటే అతను సాయిబాబా తప్ప మరెవరూ కాదని అనిపించింది.  ప్రొద్దున నామనసులో వచ్చిన ఆలోచనకు అనుగుణంగానే బాబా ఆరూపంలో వచ్చారని అర్ధమయింది.  కాని, నేనే గుర్తించలేకపోయాను.

ఇప్పటికీ నాకాసంఘటన గుర్తుకు వస్తూనే ఉంటుంది.

సాయిభక్త



ఇప్పుడు మీకు ఈ అనుభవాన్ని వివరిస్తున్నది…త్యాగరాజు.

బాబా మాయింటికి భోజనానికి వచ్చారు…అధ్భుతమయిన లీల

 

ఈ సందర్భంగా నా స్వీయ   అనుభవాన్ని వివరిస్తాను.  ఈ సంఘటన జరిగి దాదాపు 12 సంవత్సరాలు అయి ఉండవచ్చు.  అప్పట్లో నాకు కలిగిన ఈ అనుభవాన్ని ఎక్కడా పుస్తకంలో వ్రాసి ఉంచుకోకపోవడం నా అజ్ణానమనే చెప్పాలి.

అప్పట్లో నేను (త్యాగరాజు) భారతీయ స్టేట్ బ్యాంకులో పని చేస్తూ ఉన్నాను.  నా నివాసం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నరసాపురం.  ఒకరోజు గురువారము నాడు నేను యధావిధిగా ప్రతిరోజు చేసుకున్నట్లే పూజ చేసుకొని, బాబా చరిత్ర కూడా బహుశ ఒక పేజీ చదివానేమో.  పూర్తి అయిన తరువాత సాష్టాంగ నమస్కారం చేసుకుని పైకి లేస్తూ, మా అవిడతో ఇవాళ బాబా గారు మన ఇంటికి భోజనానికి వస్తారు అన్నాను.  అది ఊరికే నా నోటంబట వచ్చిన మాట కాదని తెలుసు.  ఎందుకనో చాలా నమ్మకంతో వచ్చిన మాట.  అప్పుడు మా ఆవిడ బాబా గారు ఎందుకు వస్తారండీ, ప్రతిరోజు మనం ఆయనకు నైవేద్యం పెట్టిన తరువాతనే తింటున్నాము కదా అంది.  ఇంక నేను ఆవిషయం అంతటితో వదిలేశాను.

ప్రతి గురువారం మా ఆవిడ ఉపవాసం.  రాత్రిపూట ఫలహారం మాత్రమే తీసుకునేది.  అందుచేత ప్రతిగురువారమునాడు నాకు మాత్రమే సరిపోయేలా వంట చేసేది.  ఆరోజున నాకు నేనే వడ్డించుకుని భోజనం చేసేసాను.  అన్నం గిన్నె పూర్తిగా ఖాళీ చేసేసి బాబా గారు వస్తే ఈవిడ ఆయనకి భోజనం ఎలా పెడుతుంది అని నా మనసులోనే అనుకున్నాను.  పైకి అనలేదు.  ఇక భోజనం అయిన తరువాత నేను ఆఫీసుకు వెళ్ళిపోయాను.  నేను ఆఫీసుకి వెళ్ళిన తరువాత మా ఆవిడ పూజ చేసుకుంటూ ఉంటుండగా కాసేపటికి మా ఇంటికి ఇద్దరు బ్రాహ్మలు వచ్చారు.  వారు ఇంటిలోకి రాగానే కాస్త వేద మంత్రాలు చదివి నీకు ప్రహ్లాదుడులాంటి మనవడు పుడతాడమ్మా అని దీవించి,  దక్షిణ అడిగారు.  మా ఆవిడ ఇద్దరికి చెరొక పదకొండు రూపాయలు దక్షిణగా ఇచ్చింది.  అప్పుడు వారు మరికొంత ఇవ్వండమ్మా హోటల్ లో భోజనం చేస్తాము అని అన్నారు.  మా ఆవిడ మరికొంత డబ్బు ఇచ్చింది.  వారిద్దరూ దక్షిణ తీసుకుని వెళ్ళిపోయారు.

సాయంత్రం నేను ఇంటికి రాగానే మా ఆవిడ ఈ విషయం చెప్పగానే వచ్చినది బాబాయె మరొకరితో కలిసి వచ్చారని అర్ధం చేసుకున్నాను.  ఆరోజు నేను బాబా గారు వస్తే ఈవిడ భోజనం ఏంపెడుతుంది అని నాకు వచ్చిన ఆలోచనకి ఆ బ్రాహ్మలు మరికాస్త డబ్బు ఇవ్వండమ్మా హోటల్ లో భోజనం చేస్తాము అనడం అధ్బుతమయిన అనుభూతిని మిగిల్చింది నాకు.  ఆవిధంగా మేము బాబాకి భోజనం పెట్టలేకపోయినా హోటల్ లో భోజనం చేస్తామని అనడం బాబా మన మనసులోని ఆలోచనలను గ్రహిస్తారనడానికి ఇదే తార్కాణం.  (శ్రీ సాయి సత్ చరిత్ర అ. 3 లో బాబా చెప్పిన మాటలు …”మీరెక్కడ ఉన్ననూ ఏమి చేయుచున్ననూ నాకు తెలియునని బాగుగా జ్ణాపకముంచుకొనుడు.  నేనందరి హృదయముల పాలించువాడను.  అందరి హృదయములలో నివసించువాడను.)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List