30.06.2020 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు –
బాబా
సమాధానాలు – 10 (12)
గురుభక్తి 12
వ.భాగమ్
ఆత్రేయపురపు
త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744
మైల్
ఐ.డి. tyagaraju.a@gmail.com
స్త్రీలకు భర్త ఎలాంటివాడో జీవులందరికి
గురువు అటువంటివాడు. స్త్రీలకు
భర్త దైవస్వరూపుడు. అదే
విధంగా జీవులకు గురువంటే శివుడని, శివస్వరూపిగా తలంచి,
అల్పమైన కోరికలను తీర్చమనడం, మహిమలను చూపమనడం అవివేకం. గురువుని ఎన్నుకున్నాక పరీక్షించడమో,
పరిత్యజించడమో శిష్యునకు హక్కు లేదు.
(శ్రీసాయి సత్ చరిత్ర అ.16 - 17 లో బాబా అన్నమాటలను గుర్తుకు తెచ్చుకుందాము..."అనేకమంది నావద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగనివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే యడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమునివ్వుమని యడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావలెనని యడుగువారికి లోటు లేనే లేదు. పారమార్ధిక విషయమై యోచించువారు మిక్కిలి యరుదు.)
గురువు ‘గురుతత్త్వం’’ కలిగి ఉండాలి. తనను పరిపూర్ణంగా విశ్వసించిన శిష్యునకు తాను పరిపూర్ణంగా ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించవలెను. అట్టివాడే సద్గురువుగా ఎంచబడును.
మనము ఎంత విద్యాధికులమయినప్పటికి మన సద్గురువు ఎదుట మౌనముగా ఉండాలి. మనకు బాగా తెలుసుననే అహంకారాన్ని మన సద్గురువు ఎదుట ప్రదర్శించరాదు.
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 16 – 17 ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో ఎవనికి వానియందు విరక్తి లేదో యట్టివాడు గొప్ప చదువరియైనప్పటికి వాని జ్ఞానమెందుకు పనికిరానిది. ఆత్మ సాక్షాత్కారము పొందుటకిది వానికి సహాయపడదు. ఎవరహంకార పూరితులో, ఎవరింద్రియ విషయముల గూర్చి ఎల్లప్పుడు చింతించెదరో, వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమొనర్చుట తప్పనిసరి యవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నియు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. )
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.24 మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని, మన ప్రయత్నమందు జయమును పొందము. మన మహంకారరహితుల మయినచో, మన జయము నిశ్చయము.)
(అందుచేత శ్రీ సాయి సత్ చరిత్రలో అ. 16 – 17 నందు బ్రహ్మజ్ఞానము కోరిన వ్యక్తితో బాబా అన్న మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాము. “నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా యని నేను మొదట పరీక్షించవలెను.)
ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగామన్నది కాదు. మన సద్గురువు ముందు ఎంత భక్తితో,
వినయవిధేయతలతో ఒదిగి ఉన్నామన్నదే ముఖ్యం.
మనకు ఎన్ని ప్రవచనాలయినా చెప్పే శక్తి ఉండవచ్చు. ఆ శక్తి మన సద్గురువు వల్లనే వచ్చిందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన అనుగ్రహమే లేకపోతే మనలో అటువంటి జ్ఞాన పుష్పం వికసించేదే కాదు.. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనలో అహంకారం మొలకెత్తకుండా జాగ్రత్త వహించాలి. మన సద్గురువుతో మనమెప్పుడూ సమానం కాలేము.
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 27 దాదాసాహెబ్ ఖాపర్దే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిధ్ధికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు. ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు, మిక్కిలి తెలివయినవాడు, గొప్ప వక్త. కాని బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు. అనేకమంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి, వాదించిరి. కాని ముగ్గురు మాత్రము ఖాపర్దే, నూల్కర్, బూటీ నిశ్శబ్దముగా కూర్చుండువారు. వారు వినయవిధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన ఖాపర్దే బాబా ముందర ద్వారకామాయిలో కూర్చొనునప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు. నిజముగా మానవుడెంత చదివినవాడైనను, వేదపారాయణ చేసినవాడైననను, బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తకజ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు.)
ఇక ముగించేముందు ఒక్క మాట…
( శ్రీ సాయి సత్ చరిత్ర అ. 24 మనము గురుని స్మరించనిదే ఏవస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు. మన మనస్సుకు ఈ విధముగా శిక్షణనిచ్చినచో మనమెల్లప్పుడు మన సద్గురువును ఎల్లప్పుడూ
జ్ఞప్తియందుంచుకొనెదము.)
బాబా గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం గురుభక్తి గురించిన వివరణలు మీముందు ఉంచాను. గురుగీతలోని శ్లోకాలయొక్క అర్ధాన్ని, వాటికి తగినట్లుగా శ్రీ సాయి సత్ చరిత్రలోని సంగతులను, సంఘటనలను క్రోడీకరించి అసలు గురువు అనగా ఎవరు, సద్గురువు యొక్క లక్షణాలు ఏమిటి, గురువుయందు మన భక్తి ఏవిధంగా ఉండాలనే విషయాలన్నిటినీ ఇందులో పొందుపరచాను.
దీనిని బట్టి శ్రీ సాయి సత్ చరిత్ర ఒక సామాన్యమయిన పారాయణ గ్రంధము కాదని, ఈ గ్రంధమంతా ఉపనిషత్తులు, మరియు గురుగీతా సారాంశమేనని మనం గ్రహించుకోగలము. ఇది పఠించిన సాయిభక్తులందరికి మన సద్గురువు అయిన బాబా యొక్క ఉపదేశాలను, బోధనలను మరింతగా ఆకళింపు చేసుకునే అవకాశం కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
గురుభక్తి ఇప్పటితో ముగిస్తున్నా గాని, మనలో గురుభక్తి మాత్రం నిరంతరం ఉండాలి. దానికి ముగింపు అనేది ఉండరాదు.
(రేపటి సంచికలో Lt.Col. Nimbalkar గారి SHRI SAIBABA'S TEACHINGS AND PHILOSOPHY శ్రీ సాయి బోధనలు మరియు తత్త్వం తెలుగులోనికి అనువాదం చేసి 2016 వ.సంవత్సరంలో ఇదే బ్లాగులో ప్రచురించాను. అందులో ప్రచురించిన గురుభక్తి గురించి అప్పుడు చదివి ఉండని సాయిభక్తుల కోసం తిరిగి ప్రచురిస్తాను.)
(శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – బాబా సమాధానాలు భాగాలు, మరియు గురుభక్తి ఎవరయినా తమ బ్లాగులో కాని, ఫేస్ బుక్ పేజీలో గాని ప్రచురించదలచుకున్నట్లయితే కాపీ పేస్ట్ మాత్రమే చేయవలసినదిగా మనవి. చేసేముందు నాకు తెలియపరచవలసినదిగా మనవి.)
(శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – బాబా సమాధానాలు భాగాలు, మరియు గురుభక్తి ఎవరయినా తమ బ్లాగులో కాని, ఫేస్ బుక్ పేజీలో గాని ప్రచురించదలచుకున్నట్లయితే కాపీ పేస్ట్ మాత్రమే చేయవలసినదిగా మనవి. చేసేముందు నాకు తెలియపరచవలసినదిగా మనవి.)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
2 comments:
జై సాయిరాం... గురుచరణాలు సర్వవిధ శరణాలు.ఏది అడిగినా ఇవ్వగలిగిన శక్తిసంపన్నుడు సాయి. సకల సంపదలా, శరణాగతియా అన్నది భక్తుల విచక్షణ పై, వివేకం పై,కర్మల తీవ్రత ని బట్టి ఉంటుంది.
యర్రాప్రగడ ప్రసాద్, రాజమహేంద్రవరము
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
Post a Comment